తెలంగాణ ముఖ్యమంత్రి ముద్దుల తనయ, ఎమ్మెల్సీ కె.కవిత స్వభావానికి విరుద్ధంగా తీవ్రస్థాయిలో ప్రత్యర్థి ఎంపీపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గేతో కవిత ఫోన్‌లో మాట్లాడి, ఆ పార్టీలో చేరుతానని చెప్పినట్టు నిజామాబాద్ ఎంపీ అర్వింద్ సంచలన ఆరోపణ చేశారు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్‌గా రూపు మార్చుకునే సభకు పిలవలేదని కవిత అలిగారని ఆయన ఆరోపించిన సంగతి తెలిసిందే. తండ్రి తనను పట్టించుకోకపోవడంతో కాంగ్రెస్‌లో చేరేందుకు కవిత నిర్ణయించుకున్నారని ఆరోపించడం వివాదానికి దారి తీసింది.
బీజేపీ ఎంపీ అర్వింద్ ఆరోపణలకు కవిత ఘాటు కౌంటర్ ఇచ్చారు. ఇవాళ అసెంబ్లీలోని శాసనసభాపక్ష కార్యాలయంలో మీడియాతో కవిత మాట్లాడారు. నిజామాబాద్ జిల్లాలో ఎంపీ ఆర్వింద్ అనే ఆణిముత్యం ఉన్నాడన్నారు. ఇంత కాలం అతనో బురదలాంటోడనే ఉద్దేశంతో ఎవరూ పట్టించుకోకుండా ఉన్నారన్నారు. ఎందుకంటే బురదపై రాయి వేస్తే తిరిగి మన మీదే పడుతుందనే ఉద్దేశంతో మాట్లాడలేదన్నారు. కానీ నిన్న ఓ మాట మాట్లాడాడన్నారు. ఖర్గేతో మాట్లాడి, కాంగ్రెస్ పార్టీలోకి పోతున్నట్టు అర్వింద్ చెప్పాడని ఆమె గుర్తు చేశారు. కాంగ్రెస్ నాయకులే తనకు చెప్పారని అర్వింద్ అన్నాడన్నారు. దీన్నిబట్టి అర్విందే కాంగ్రెస్ నాయకులతో టచ్‌లో ఉన్నట్టు అర్థమవుతోందన్నారు. తాను కాంగ్రెస్‌తో టచ్‌లో లేనన్నారు.
బీజేపీ ఎంపీగా ఉన్న నీకు కాంగ్రెస్ నేతలతో ఏం పని అని ఆమె నిలదీశారు. కాంగ్రెస్‌తో కలిసి గెలిచింది నువ్వు అని అర్వింద్‌పై మండిపడ్డారు. ఇంత వరకూ తాను ఏ ఒక్కరినీ వ్యక్తిగతంగా విమర్శించలేదన్నారు. తన గురించి వ్యక్తిగతంగా మాట్లాడితే ఊరుకోనని కవిత హెచ్చరించారు. తన పుట్టుక, భవిష్యత్తు తెలంగాణ, టీఆర్‌ఎస్ అని ఆమె తేల్చి చెప్పారు. అర్వింద్ గుర్తు పెట్టుకో… ఇంకోసారి తన గురించి పిచ్చిపిచ్చిగా మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడ్తా అని తీవ్రస్థాయిలో హెచ్చరించారు.
తమాషాగా ఉందా? చూస్తూ ఊరుకుంటుంటే అని కవిత మండిపడ్డారు. భాష లేదు, పద్ధతి లేదు, మాటలేదు, మంతి లేదు అని ఆమె విరుచుకుపడ్డారు. తెలంగాణకు నీ కాంట్రిబ్యూషన్ ఏదంటూ ఆమె నిలదీశారు. ఎందుకోసం మాట్లాడుతున్నావ్? ఎవరి మీద అంటే వాళ్ల మీద ఏది పడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకుంటామని అనుకుంటున్నావా? అని కవిత నిప్పులు చెరిగారు. బిడ్డా చెబుతున్నా….వెంటపడి ఓడిస్తా నిన్ను అని ఆమె శపథం చేశారు. ఇంకోసారి ఎక్కువతక్కువలు మాట్లాడితే …మాములుగా తన్నమని హెచ్చరించారు.
పట్టుకుని మెత్తగా తంతామన్నారు. నోరు అదుపులో పెట్టుకోకుంటే అర్వింద్‌ను తరిమికొడతామని హెచ్చరించారు. కొట్టి చంపుతం బిడ్డ.. రాజకీయం చెయ్.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడవద్దని ఘాటు హెచ్చరిక చేశారు.