నిజామాబాద్ చౌరస్తాలో తనను చెప్పుతో కొడ్తానని ఎమ్మెల్సీ కవిత సంచలన హెచ్చరిక చేయడంపై బీజేపీ ఎంపీ అర్వింద్ ఘాటుగా స్పందించారు. తన ఇంటిపై టీఆర్ఎస్ శ్రేణులు దాడికి దిగడంపై ఆయన మండిపడ్డారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబంపై విరుచుకుపడ్డారు. కేసీఆర్ తనయ కవితపై తాను అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదన్నారు.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గేతో కవిత మాట్లాడినట్టు చెప్పానన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్‌కు చెందిన ముఖ్య నాయకుడు తనతో చెప్పాడన్నారు. తన కుమార్తెను బీజేపీలో చేరాలని ఆ పార్టీ నాయకులు ఒత్తిడి తెచ్చారని కేసీఆర్ చెప్పారన్నారు. మీ అయ్య చెప్పినట్టు తాను మాట్లాడానని ఎంపీ అర్వింద్ వెటకరించారు. మరి మీ అయ్యను చెప్పుతో కొట్టినావా? అని కవితను అర్వింద్ నిలదీయడం గమనార్హం.
ఇంటిపై దాడి చేసి తన తల్లిని, మరికొందరు మహిళలను టీఆర్ఎస్ గూండాలు భయపెట్టారని అర్వింద్ మండిపడ్డారు. ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? అని నిలదీశారు. కేసీఆర్, కేటీఆర్, కవితలకు కుల అహంకారం ఎక్కువైందన్నారు. దొరల అహంకారంతో దాడులకు తెగబడుతున్నారని విమర్శించారు. తన తల్లిపై దాడి చేసే హక్కు ఎవరిచ్చారని ఆవేశంతో అర్వింద్ ప్రశ్నించారు. దాడి చేసే హక్కు మీ అయ్య ఇచ్చిండా అని కవితను ఆయన ప్రశ్నించారు.
తన వెంబడించి ఓడిస్తామని కవిత హెచ్చరించడంపై ఆయన సీరియస్‌గా స్పందించారు. ఆమె వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్టు ఆయన అన్నారు. దమ్ముంటే తనపై పోటీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిజామాబాద్ నుంచే తాను పోటీ చేస్తానని, ఇప్పటికైనా ఆమే పోటీ చేస్తుందనేది ఫైనలా అని అర్వింద్ ప్రశ్నించడం గమనార్హం. మళ్లీ మాట మార్చుకుంటుందా? అని అర్వింద్ ప్రశ్నించారు.
కవిత సీరియస్‌గా రియాక్ట్ అయ్యిందంటే…ఆ ఫోన్ కాల్ నిజమా? కాదా? అనేది విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ సర్కార్ అందరి ఫోన్లను ట్యాప్ చేస్తుందని, బిడ్డ కవిత ఫోన్ కాల్ రికార్డ్‌ను తీయాలని అర్వింద్ కోరారు. కవిత ఇంత సీరియస్‌గా రియాక్ట్ అయ్యిందంటే తన ఆరోపణల్లో నిజం వున్నట్టే అని ఆయన చెప్పుకొచ్చారు.