రాజకీయ నేతలు మాట తూలుతున్నారు. భాషపై అదుపు తప్పుతోంది. విమర్శల హద్దులు దాటి పరస్పరం దూషణలకు దిగుతున్నారు. రాజకీయ పార్టీల నేతలు ఒకరికొకరు శత్రువులుగా చూసుకుంటున్నారు. తాము రాజకీయ ప్రత్యర్థులమనే స్పృహ లేకుండా నోటికొచ్చినట్టు తిట్టుకుంటున్నారు. ఇందుకు ఏపీ, తెలంగాణ అతీతం కాదు. కాస్త ఎక్కువ, తక్కువ …తేడా అంతే. అదే తిట్ల పురాణం. నాయకుల నోటి దురుసుతనానికి వారిని ఎన్నుకున్న జనం సిగ్గుతో తలదించుకుంటున్న దయనీయ స్థితి.
ఇటీవల ఏపీలో జనసేనాని పవన్‌కల్యాణ్ తన ప్రత్యర్థులైన వైసీపీ నేతలపై చెప్పు తీసుకుని …కొడ్తా నా కొడకల్లారా అంటూ తీవ్రస్థాయిలో తిట్ల పురాణానికి దిగిన సంగతి తెలిసిందే. ఇవాళ తెలంగాణ సీఎం కేసీఆర్ తనయ కవిత చెప్పుతో కొడ్తానంటూ బీజేపీ ఎంపీ అర్వింద్‌పై నోరు పారేసుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేతో కవిత ఫోన్లో మాట్లాడి, ఆ పార్టీలో చేరుతానని చెప్పినట్టు, తనకు అదే పార్టీకి చెందిన ఓ ప్రముఖుడు సమాచారం ఇచ్చాడని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ సంచలన ఆరోపణ చేశారు. దీనికి నేపథ్యం లేకపోలేదు.
తన కుమార్తె కవితను బీజేపీలో చేరాలని ఆ పార్టీకి చెందిన నాయకులు ఒత్తిడి తెచ్చారని రెండురోజుల క్రితం కేసీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. దీన్ని తిప్పికొట్టే క్రమంలో అర్వింద్ తన మార్క్ ఆరోపణలకు దిగారు. నిరాధార ఆరోపణలకు కవిత నొచ్చుకున్నారు. గతంలో ఎప్పుడూ వ్యక్తిగత విమర్శలకు దిగని కవిత, ఇవాళ మాత్రం స్పృహలో వుంటూనే, క్షమాపణ చెప్పి మరీ అర్వింద్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడ్తానని ఒకటికి రెండుసార్లు కవిత అనడాన్ని గమనించొచ్చు. అలాగే చంపుతాం అని కూడా హెచ్చరించారు. రాజకీయాల్లో ఇలాంటి అభ్యంతరకర భాష మంచిది కాదని కవితకు తెలుసు కాబట్టే, ఆమె తెలంగాణ సమాజానికి ఇదే వేదికపై నుంచి క్షమాపణ చెప్పారు. అయితే హద్దులు దాటి అర్వింద్ పదేపదే ఆరోపణలు చేస్తుండడం వల్లే మాట్లాడాల్సి వస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
పవన్, కవిత చెప్పు భాషపై మంచీచెడుల గురించి సమాజం చూసుకుంటుంది. కానీ కవిత తన భాషపై సమాజానికి క్షమాపణ చెప్పడం గమనార్హం. మరి లక్ష పుస్తకాలు చదివి, జ్ఞానం పొందిన జనసేనానిలో ఆ సంస్కారం లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.