ఏ నది అయినా ఎప్పటికైనా సాగరంలో కలవాల్సిందే అన్నట్లు ఎప్పటికైనా జనసేన అనే పార్టీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవాల్సిందే.
పైకి ఎన్ని కబుర్లు చెప్పినా జనసేన అనే పార్టీ 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పొత్తుతోనే ముందుకు వెళ్తుందని రాజకీయ పరిశీలకుల నిశ్చితాభిప్రాయం.
పొత్తుకోసం 40 సీట్లు కావాలని బేరం పెడుతోంది జనసేన అని ఇప్పటికే రాజకీయవార్తలు గుప్పుమంటున్నాయి. కానీ అదే సమయంలో 30 కి మించి ఒక్క సీటు కూడా ఇచ్చే ఉద్దేశం తెలుగుదేశం పార్టీకి లేదని కూడా వినిపించింది.
ఇలాంటి నేపథ్యంలో అసలు జనసేనతో పొత్తు వద్దు…బిసి లు దూరం అయిపోతారు అని ఆ పార్టీ సీనియర్లు అంటున్నారని కూడా వార్తలు వున్నాయి.
ఇప్పటికే మహానాడులో బిసి ల గురించే తప్ప కాపుల గురించి ఒక్క మాట కూడా లేదు. బిసి నాయకులను ప్రొజెక్ట్ చేయడంతోనే సరిపోయింది.
దీనికి తోడు ఇప్పుడు మహానాడు వచ్చిన వారో, తీసుకు వచ్చిన వారో జనాలు బాగానే వచ్చారు. దాంతో దేశం కాన్ఫిడెన్స్ మరింత పెరిగింది. ఇక ఇప్పుడు బేరాలు వుండకపోవచ్చు.
వస్తే పాతిక, ముఫై సీట్లకు ఒప్పుకుని జనసేన రావాల్సి వుంటుంది. లేదంటే లేదు. మా దగ్గర బేరాలు లేవమ్మా అంటూ మహేష్ బాబు స్టయిల్ లో లోకేష్ బాబు డైలాగ్ వేసే అవకాశం కనిపిస్తోంది.
అయినా పవన్ బేరాలు ఆడినపుడు సంగతి కదా ఇదంతా. ఆయన పెద్దగా బేరాలు లేకుండానే తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యే అవకాశాలే ఎక్కువ అని రాజకీయ వర్గాల బోగట్టా.