ప్రేమ మైకంలో విచక్షణ వదిలేసింది. ప్రియుడు అడిగాడని ఏకంగా బ్యాంక్ ను లూటీ చేసింది. ఇప్పుడు కటకటాలు లెక్కిస్తోంది ఆ అమ్మాయి. 2 రోజుల కిందట శ్రీకాళహస్తిలో జరిగిన బ్యాంక్ చోరీ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు, గంటల వ్యవథిలో దర్యాప్తు జరిపి నిగ్గుతేల్చిన నిజం ఇది.
శ్రీకాళహస్తిలోని ఫిన్ కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో చీకటి పడిన తర్వాత దొంగలు చొరబడ్డారు. అప్పటికీ అందరూ వెళ్లిపోయారు. స్రవంతి అనే మహిళా ఉద్యోగి మాత్రమే విధుల్లో ఉంది. ఆమెను నిర్బంధించారు. బ్యాంకులో ఉన్న బంగారం, డబ్బు ఎత్తుకెళ్లారు.
వెంటనే తేరుకున్న స్రవంతి పోలీసులకు సమాచారం అందించింది. రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. వాళ్లకు ఒకటే అనుమానం మిగిలిపోయింది. అసలు అంత రాత్రి వరకు స్రవంతి ఆఫీస్ లో ఏం చేస్తోంది. ఆమెతో పాటు ఉన్న మరో ఉద్యోగి బయటకు వెళ్లిన తర్వాత దొంగతనం ఎలా జరిగింది.
ఓ ఇద్దరు మహిళా పోలీసులు ఈ కోణంలో కూడా దర్యాప్తు చేశారు. స్రవంతిని తమదైన శైలిలో ప్రశ్నించారు. దీంతో స్రవంతి అసలు విషయం చెప్పేసింది. తన ప్రియుడి కోరిక మేరకు బ్యాంకులో నగలు, డబ్బు దొంగిలించినట్టు అంగీకరించింది స్రవంతి. అప్పటివరకు గుక్కపెట్టి ఏడ్చిన స్రవంతిని చూసి జాలిపడిన పోలీసులు, అధికారులు ఈ దెబ్బతో అవాక్కయ్యారు.
బ్యాంకులో ఉన్న 2.25 కిలోల బంగారాన్ని, 5 లక్షల క్యాష్ ను పక్కా ప్లాన్ తో, ముగ్గురు వ్యక్తుల సహాయంతో బ్యాంక్ నుంచి తరలించింది స్రవంతి. ఆ తర్వాత తన వాటాగా వచ్చిన కిలో బంగారాన్ని భద్రంగా దాచుకుంది. ఈ బంగారంతో పాటు, చెన్నైకి పారిపోయిన ఆ ముగ్గురు దొంగల నుంచి కూడా మిగతా బంగారాన్ని, నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.