Advertisement

Advertisement


Home > Politics - Analysis

ఇష్టంలేని గర్భం: అమెరికా కంటె ఇండియా బెటర్!

ఇష్టంలేని గర్భం: అమెరికా కంటె ఇండియా బెటర్!

ఇష్టంలేని గర్భం వస్తే ఎవరైనా ఏం చేస్తారు? వీలైనంత త్వరగా తీయించేసుకుంటారు. అబార్షన్ అనే నిర్ణయాన్ని ప్రతిసారీ ఒక హత్యతో సమానంగా చూడాల్సిన అవసరం లేదు. కానీ సమాజంలో మాత్రం రకరకాల అభిప్రాయాలు ఉంటాయి.

ఈ అబార్షన్ కూడా పెళ్లయిన వారి విషయంలో ఒక రకంగా, పెళ్లికాని యువతుల విషయంలో మరో రకంగా  అభిప్రాయాలు వ్యక్తం అవుతుంటాయి. అయితే భారత సుప్రీం కోర్టు తాజాగా ఒక తీర్పులో.. అవివాహిత యువతులకు అబార్షన్ విషయంలో నిర్ణయం తీసుకునే హక్కు ఉండాలని తీర్పు చెప్పింది.

అబార్షన్ చేసుకునే హక్కును నిరాకరించడం, ఆమె వ్యక్తిగత స్వయంప్రతిపత్తిని ఉల్లంఘించడమే అవుతుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చట్టానికి కొన్ని సవరణలు చేసినా.. అందులో ఉన్న సందిగ్ధతను తొలగించడానికి కోర్టు ఈ తీర్పు చెప్పడం గమనార్హం.

అబార్షన్ అనేది మహిళల స్వేచ్ఛకు, స్వీయనిర్ణయాధికారానికి సంబంధించిన వ్యవహారం. చట్టపరంగా దానిని నియంత్రించాలనుకోవడం తప్పు అవుతుంది. అబార్షన్ అనేది ఒక హక్కు అనే స్పృహ లేకుండా.. అరక్షితమైన పద్ధతుల్లో అబార్షన్ లు చేయించుకుంటూ మన దేశంలో రోజుకు పది మందికి పైగా చనిపోతున్నారనేది ఒక అంచనా.

అలాంటి నేపథ్యంలో అబార్షన్ లకు చట్టబద్ధత అనేది మనదేశంలో 1971 నుంచి.. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నన్సీ యాక్ట్ రూపంలో ఉంది. గర్భనిరోధక సాధనాలు విఫలం కావడం, అవాంఛితంగా గర్భం దాల్చడం నేపథ్యాల్లో అబార్షన్ కు అనుమతిస్తారు. అయితే పెళ్లికాని వారి విషయంలో స్పష్టత లేదు.

దీనికోసం కేంద్రప్రభుత్వం నిబంధనల్లో కొన్ని సవరణలు చేసింది. ‘భర్త’ అనే పదంతో పాటుగా, ‘భాగస్వామి’ అనే పదాన్ని కూడా చేర్చింది. ఈ సవరణ అవివాహితలకు తప్పకుండా వర్తిస్తుందని.. 24 వారాలకు మించని సందర్భాల్లో అబార్షన్ అనేది మహిళల ఇష్టం అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. 

భారత్ లో తీరు.. సుప్రీం కోర్టు తీర్పు.. ఈ రీతిగా మహిళలకు హక్కు ఇచ్చేలా ఉంటే.. ఇటీవలే అమెరికా సుప్రీం కోర్టు తిరోగమన నిర్ణయం తీసుకోవడం విశేషం. అమెరికాలో అబార్షన్ చేసుకోవడానికి స్వీయనిర్ణయానికి హక్కు కల్పించే చట్టాన్ని సుప్రీం కోర్టు రద్దు చేసింది.

ఈ విషయంలో రాష్ట్రాలు ఎవరికి వారు కొత్త చట్టాలు రూపొందించుకోవచ్చునని చెప్పింది. దాంతో అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో అబార్షన్ అనేది చట్టవ్యతిరేకం అనే చట్టాలు కొత్తగా పుట్టుకొచ్చాయి. ‘రోయ్ వెర్సస్ వేడ్’ గా పరిగణించే నిర్ణయంతో అమెరికాలో 1973లో అబార్షన్ చట్టబద్ధం అయింది. ఈ నిర్ణయాన్ని సుమారు నెల రోజుల కిందట సుప్రీం కోర్టు రద్దు చేసింది. మహిళల ఆరోగ్యం జీవితాలు ఈ తీర్పుతో ప్రమాదంలో పడ్డాయి అని దేశాధ్యక్షుడు బైడెనే వ్యాఖ్యానించారు కూడా. 

ఒకవైపు అవివాహితలకు కూడా అబార్షన్ విషయంలో స్వీయనిర్ణయాధికారం కల్పించే చట్టసవరణలు భారత్ లో వస్తున్నాయి. ఆ చట్టసవరణల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు తాజాగా మరింత స్పష్టత ఇచ్చి.. మహిళల గౌరవానికి, స్వేచ్ఛకు భంగం లేకుండా చూస్తోంది. అదే సమయంలో అమెరికా.. అసలు ఆ హక్కునే రద్దు చేస్తూ.. ఎటు పయనిస్తోందో అర్థంకాని స్థితిలో ఉంది అని పలువురు విశ్లేషిస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?