భారతీయజనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. అనూహ్యంగా చంద్రబాబు భజన ప్రారంభించారు. తాను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అయిన నాటినుంచి.. చంద్రబాబును తిట్టడం మీదనే.. తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వచ్చిన సోము వీర్రాజుకు, హఠాత్తుగా నారా వారు ఒక దార్శనికుడిగా కార్యశీలిగా కనిపించడం వెనుక మతలబు ఏమిటో ఎవ్వరికీ తెలియదు.
ఇటీవలి కాలంలో స్వరం మార్చి.. జగన్ మోహన్ రెడ్డిని విలన్ గా ప్రొజెక్టు చేయడానికి తపన పడుతున్న సోము వీర్రాజు.. అలాంటి తాపత్రయంలో -‘రాజుగారి పెద్ద భార్య మంచిది..’ అనే సామెత చందంగా చంద్రబాబును పొగుడుతున్నారో ఏమో కూడా అర్థం కావడం లేదు.
ఇంతకూ ఈ కమలదళపతి ఏమంటున్నారో తెలుసా..? చంద్రబాబునాయుడు దార్శనికుడైన నాయకుడుట! ఆయన దార్శనికుడు అనే సంగతి తెలుసు కాబట్టే.. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అమరావతిలో రాజధాని నిర్మాణానికి 8500 కోట్ల నిధులివ్వడానికి సిద్ధపడిందిట. అదే సమయంలో జగన్ దార్శనికుడు కాదు కాబట్టి నిధులు ఇవ్వడం లేదట. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదనే సంగతిని.. మొత్తానికి ఈ నాయకుడు చాలా స్పష్టంగానే ఒప్పుకున్నారు.
కాకపోతే.. ఆయన దర్శించిన ‘‘చంద్ర దార్శనికత’’ విషయంలోనే సందేహాలు రేకెత్తుతున్నాయి. సోము వీర్రాజుకు చూపు మందగించిందా అనే అనుమానమూ కలుగుతోంది. ఆయన చెప్పినట్లుగా చంద్రబాబు దార్శనికుడు అయి ఉండి.. ఆయన చెప్పినట్లుగా కేంద్రం 8500 కోట్ల రూపాయల నిధులు ఇచ్చి ఉంటే గనుక.. అవన్నీ ఎక్కడకు పోయాయి? నిధులను కాకిఎత్తుకుపోయిందా? ఆవిరైపోయాయా?
అంత భారీస్థాయిలో కేంద్రంనుంచి నిధులు.. రాజధాని కోసం, దార్శనికుడైన నాయకుడి చేతికి అంది ఉంటే.. ఆ ఫలితం.. ఆయన ప్రకటించిన రాజధాని ప్రాంతంలో ఏదో ఒక రూపంలో కనిపించాలి కదా? ఏదీ? ఎక్కడ? అమరావతి రాజధాని అనే గ్రాఫిక్స్ తప్ప.. అక్కడ ఏం నిర్మించారు గనుక.. చంద్రబాబును దార్శనికుడని అనాలి? కేంద్రం నిధులు ఇచ్చిందని నమ్మాలి? అనేది సామాన్యులకు కలుగుతున్న సందేహం. అందుకే.. సోము వీర్రాజు ఈ మాటలను వ్యూహాత్మకంగా అన్నారా.. అజ్ఞానం కొద్దీ అన్నారా అనే అభిప్రాయం పలువురికి కలుగుతోంది.
చూడబోతే.. ఇదంతా అమరావతి రాజధానికి మద్దతుగా మాట్లాడే ప్రయత్నంలో సోమువీర్రాజు చెప్పిన తలాతోకా సంగతులే అని అర్థమవుతుంది. ఎందుకంటే.. జగన్ దార్శనికుడు కాదు కాబట్టి కేంద్ర నిధులు ఇవ్వడం లేదని అన్న సోము వీర్రాజు దాన్ని రాజధానికి ముడిపెట్టారు.
భూములను ఆక్రమించడానికే జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చారంటూ ఇంకో ఆరోపణ కూడా చేశారు. జగన్ అధికార వికేంద్రీకరణకు మూడు రాజధానులను ప్రకటిస్తే.. అది అమల్లోకి రాకుండా కోర్టు అడ్డుకుంది. ఈ వాస్తవాలను వక్రీకరించి.. వ్యాఖ్యానిస్తున్న కమలనాయకుడికి అసలు దార్శనికతకు అర్థం తెలుసా.. తెలిసే.. తాను ప్రకటించిన రాజధాని ప్రాంతంలో ఒక్క నిర్మాణమూ పూర్తి చేయలేని చంద్రబాబును అలా కీర్తిస్తున్నారా? అనే సందేహాలు ప్రజలకు కలుగుతున్నాయి.