కాంగ్రెస్ దేశాన్ని అటు ఇటుగా యాభై సంవత్సరాల పాటు ఏలింది. ఆ సుదీర్ఘకాలంలో జవహార్ లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ, మన్మోహన్ సింగ్ వంటి ప్రధాని పదవిలో ఒక్కోరూ చెప్పుకోదగినంత కాలం కూర్చున్నారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో సోనియాగాంధీ బ్యాక్ సీట్ డ్రైవింగ్ చేశారనే పేరునూ తెచ్చుకున్నారు. మరి అన్నేళ్ల పాలన తర్వాత 2014లో బీజేపీ చేతికి బంపర్ మెజారిటీ తో అధికారం అందింది.
1998-99 సమయంలో మొదట పదమూడు నెలల పాటు, ఆ తర్వాత అటు ఇటుగా ఐదేళ్ల పాటు బీజేపీ అధికారంలోనే ఉంది. అలాగే దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఆ పార్టీ అధికారం అందుకుంది. అయితే వాటిని తమ పాలనా సంవత్సరాలుగా బీజేపీ వాళ్లే గుర్తించరు! అరవై యేళ్లు కాంగ్రెస్ దేశాన్ని భ్రష్టు పట్టించిందంటూ చెబుతూ ఉంటారు.
ఇంకా కాంగ్రెస్ ను నిందించడానికే మోడీ అండ్ కో కు సమయం చాలడం లేదు. కాంగ్రెస్ హయాంలో అన్ని పథకాలకూ ఒక కుటుంబం పేర్లనే పెట్టారని, అంతటా వారి పేర్లనే వినిపించారని.. దేశంలో నెహ్రూ, ఇందిర, రాజీవ్ ల పేరుతో వందల కొద్దీ సంస్థలు, నిర్మాణాలు, పథకాలు ఉన్నాయంటూ కమలం పార్టీ వాళ్లు చాలా యేళ్లుగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ ధోరణి తప్పు పడుతూ ఉన్నారు. తమకు అధికారం చేతికి అందాకా.. ఇలాంటి వాటి పేర్లను కూడా చాలా వరకూ మార్చారు కూడా!
మరి తాము వ్యక్తి పూజకు వ్యతిరేకం అని బీజేపీ చెబుతూ ఉంటుంది. బీజేపీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ కూడా వ్యక్తి పూజకు వ్యతిరేకమే. వ్యక్తులు ముఖ్యం కాదని, వ్యవస్థ ముఖ్యమంటూ సంఘ్ పరివార్ చెబుతూ ఉంటుంది. ఈ నినాదాలతోనే కాంగ్రెస్ ను కూడా బీజేపీ అండ్ కో విపరీతంగా విమర్శిస్తూ వచ్చింది. తమకు అధికారం దక్కితే వ్యవస్థను బలోపేతం చేస్తాం తప్ప.. వ్యక్తులు వ్యవస్థను శాసించే పరిస్థితి ఉండదని చెబుతూ వచ్చారు. మరి కమలం పార్టీ చేతికి బంపర్ మెజారిటీతో అధికారం దక్కి దాదాపు దశాబ్దం కావొస్తున్న తరుణంలో ఇప్పుడు ఒకే నినాదం వినిపిస్తోంది బీజేపీ నుంచి. అది కేంద్రం అయినా రాష్ట్రం అయినా.. మోడీ అనే పేరు మాత్రమే ఇప్పుడు బీజేపీ నినాదంగా మారింది.
అంతా మోడీ, అన్నింటా మోడీ, ఎటు చూసినా మోడీనే బీజేపీ విధానం, నినాదంగా మారిందిప్పుడు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలప్పుడు మోడీనే తనే సీఎం అభ్యర్థి అన్నట్టుగా ప్రచారం చేశారు. రికార్డు స్థాయిలో రోడ్ షోలు ర్యాలీలు చేశారు. కేవలం కర్ణాటక అనే కాదు.. అంతకు ముందు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు, అంతకన్నా ముందు బిహార్ ఎన్నికలు, ఇంకా యూపీ ఎన్నికలు… ఇలా ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా మోడీ పేరే నినాదంగా కొనసాగుతూ ఉంది కమలం పార్టీ తరఫు నుంచి. ఏతావాతా ఇప్పుడు మోడీ మానియా మీదే కమలం పార్టీ ప్రస్థానం ఆధారపడి కొనసాగుతూ ఉంది.
ఇక కేవలం బీజేపీ వ్యవహారాల్లోనే కాదు.. ప్రభుత్వంలో కూడా అంతా మోడీనే. టక్కున చెప్పమంటే చాలా రాష్ట్రాల సీఎంల పేర్లు కూడా సగటు భారతీయుడు చెప్పలేడు. అన్ని రాష్ట్రాల్లోనూ మోడీనే ప్రచారం చేశారు మోడీనే ఓటడిగారు. బీజేపీ గెలిచిన చోట సీఎం ఎవరనేది పెద్ద విషయం కాకుండా పోయింది. ఇక ఎంతమంది కేంద్రమంత్రులు ఇప్పుడు ఏదైనా అంశం గురించి మాట్లాడుతూ ఉన్నారు? ఎంతమంది కేంద్రమంత్రులు ప్రభుత్వ విధానాల గురించి మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు? గతంలో కేంద్రమంత్రులు అనేక విధానపరమైన అంశాల గురించి విపులంగా మాట్లాడేవారు. అయితే 2019 తర్వాత కేంద్ర ప్రభుత్వం విషయంలో రెండే పేర్లు వినిపిస్తున్నాయి. అవి మోడీ- అమిత్ షా.
ఇక ఏడాదికోసారి బడ్జెట్ ప్రవేశ పెడుతున్నప్పుడు ఆర్థిక శాఖా మంత్రి నిర్మలాసీతారామన్ పేరు వినిపిస్తూ ఉంటుంది. గతంలో ఏ పోటీ పరీక్షలకో ప్రిపేర్ అయ్యే వారు ప్రతి రోజూ పేపర్ చదివితే వారికి మంత్రులు, వారి శాఖలు వ్యవవహారాల గురించి క్లారిటీ వస్తుందని చదివేవారు. అయితే ఇప్పుడు మోడీ మంత్రి వర్గంలో ఏదైనా శాఖ పేరు చెప్పి దాని మంత్రి ఎవరనే ప్రశ్నను ప్రతిరోజూ పేపవర్ చదివేవాడికి వేసినా ఆన్సర్ ఇవ్వడం కష్టం. అంతలా మంత్రుల పేర్లు తెరమరుగున ఉన్నాయి.
ఇక మోడీ పేరుతో క్రికెట్ స్టేడియాలు పెట్టడమే కాదు, దాని కోసం పటేల్ పేరునూ తొలగించారు. అంతే కాదు.. మోడీ క్రికెట్ స్టేడియంకే మ్యాచ్ ల కేటాయింపులు కూడా! టీమిండియా జాతీయ జట్టు ఆడే మ్యాచ్ లలో అధిక కేటాయింపులు మోడీ స్టేడియానికే.
ఇవన్నీ గాక.. పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రారంభించే అవకాశం రాష్ట్రపతికి ఇవ్వకుండా ఆ అవకాశానన్ని కూడా మోడీనే గుంజేసుకున్నాడని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఈ వ్యవహారం కోర్టు వరకూ వెళ్లింది. అయితే కోర్టు జోక్యం చేసుకోవడానికి ఇష్టపడలేదు. మొత్తానికి అంతా మోడీ, అన్నింటా మోడీ గా భారత రాజకీయం సాగుతూ ఉంది!
-హిమ