Advertisement

Advertisement


Home > Politics - Analysis

ఇది పచ్చమీడియా వక్రభాష్యం కాదా?

ఇది పచ్చమీడియా వక్రభాష్యం కాదా?

జగన్మోహన్ రెడ్డి మీద విషం కక్కడానికి, ప్రజల్లో అనుమానాలు, దురభిప్రాయాలు పుట్టించడానికి పచ్చ మీడియా తమ శక్తివంచన లేకుండా ప్రతిరోజూ ప్రయత్నిస్తూనే ఉంటోంది. ఇందుకోసం వారు నిత్యం వెయ్యికళ్లతో రంధ్రాన్వేషణ చేస్తుంటారు. ఏ చిన్న వంక దొరికినా.. దానికి వంద వక్రభాష్యాలు చెప్పి.. జగన్ అక్రమాలకు పాల్పడుతున్నాడని అర్థం స్ఫురించేలా కథనాలను వండి వార్చి తెలుగు ప్రజలకు వడ్డిస్తుంటారు. 

తాజాగా వారి దృష్టి సుప్రీం కోర్టు విచారణలోని అంశం మీద పడింది. గాలి జనార్దనరెడ్డి కి చెందిన ఓబులాపురం మైనింగ్ కంపెనీ, మళ్లీ ఏపీ రాష్ట్ర పరిధిలో మైనింగ్ తవ్వకాలు జరపడానికి జగన్ సర్కారు అనుమతులు ఇచ్చేసిందని అర్థం వచ్చేలా.. పచ్చమీడియా పుక్కిటి పురాణాలు వండి వార్చేసింది. వ్యవహారం ఇంకా సుప్రీంకోర్టులో ఉండగానే, అక్కడ తీర్పు కూడా రాకముందే.. ఇలాంటి కల్పిత కథనాన్ని దురుద్దేశంతో ప్రచురించడం గమనార్హం.

ఇంతకూ జరిగినది ఏంటంటే.. బళ్లారి మైనింగ్ కింగ్ గాలి జనార్దనరెడ్డికి చెందిన ఓఎంసీ నిబంధనలను అనేకరీతులుగా ఉల్లంఘించినందున, కంపెనీ తవ్వకాలు జరపకుండా ఏపీ ప్రభుత్వం 2009లోనే కోర్టుకెళ్లింది. హైకోర్టు గాలికి అనుకూలంగా తీర్పు చెప్పిన తర్వాత.. సుప్రీంను కూడా ఆశ్రయించింది. మరోవైపు ఓఎంసీ పాల్పడిన అక్రమాల గురించి సీబీఐ విచారణ సాగిస్తోంది. 

గతంలో ఏపీ సర్కారు సరిహద్దు వివాదం లేవనెత్తడం వల్లనే ఓఎంసీ తవ్వకాలు నిలిపేశారు. ఆ తర్వాత సరిహద్దుల గురించి సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా సర్వే చేయించారు. దానికి వారి ఆమోదమూ లభించింది. సర్వే పూర్తిచేసిన కొత్త మ్యాప్ పై ఏపీ ప్రభుత్వం సంతకాలు కూడా చేసేసింది. గతంలో సరిహద్దు గొడవ గురించే తవ్వకాలు ఆపించారు గనుక.. ఇప్పుడు సరిహద్దు సర్వే పూర్తయినందున అనుమతి ఇవ్వాలని గాలి జనార్దనరెడ్డి న్యాయవాది కోరారు. 

సర్వే పూర్తయిన మ్యాప్ పై ఏపీ ప్రభుత్వం సంతకం కూడా చేసేసింది గనుక.. తమకు అభ్యంతరం లేదని సర్కారు పేర్కొంది. ఇందులో తప్పేం ఉన్నదో అర్థం కావడం లేదు. అయితే ఈ పాయింటు పట్టుకుని.. ‘కర్నాటక సంతకం పెట్టకుండానే తమకు అభ్యంతరం లేదని ఏపీ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఏముందని’ పచ్చ మీడియా నీచమైన రాతలు రాస్తోంది. 

కర్నాటక ప్రభుత్వం సంతకం పెట్టకపోతే.. ‘తమకు అభ్యంతరం ఉందని’ ఆ ప్రభుత్వం చెప్పాలి. అంతే తప్ప.. మ్యాప్ ను ఒప్పుకుంటూ సంతకం పెట్టిన తర్వాత.. దానికి భిన్నంగా ఏపీ ప్రభుత్వం ఎలా వ్యవహరించగలుగుతుంది. మనకు అభ్యతరం లేదని ఏపీ సర్కారు చెప్పినంత మాత్రాన తవ్వకాలు మొదలైపోవు కదా..? తవ్వకాలు చేయవచ్చునో లేదో సుప్రీం కోర్టు చెబుతుంది. ఆ విషయం తేల్చి చెప్పే ముందు.. కర్నాటక ప్రభుత్వ అభిప్రాయాన్ని కూడా తెలుసుకుంటుంది. ఇదంతా న్యాయపరంగా జరుగుతున్న వ్యవహారం.

కానీ.. న్యాయస్థానంలోని ప్రక్రియ మధ్యలో ఉండగానే.. గాలి జనార్దనరెడ్డి కోసం జగన్ అడ్డదారిలో మేలుచేసేస్తున్నట్టుగా పచ్చరంగు పులుముతూ పచ్చమీడియా కథనాలు ఇవ్వడం నీచం. కోర్టులో జరిగినది చాలా సహజంగా జరిగే ప్రక్రియ. దానికి  మీడియా భాష్యాలే చాలా వక్రంగా ఉన్నాయి. ఈ బుద్ధులను వారు ఎప్పటికి మానుకుంటారో అర్థం కావడం లేదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?