Advertisement

Advertisement


Home > Politics - Analysis

జ‌గ‌న్ దూకుడు...బాబు పాకుడు!

జ‌గ‌న్ దూకుడు...బాబు పాకుడు!

వైసీపీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌ల‌కు ఆ పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ రానున్న ఎన్నిక‌ల్లో గెలుపు సాధించ‌డంపై దిశానిర్దేశం చేశారు. కొంద‌రికి క్లాస్ తీసుకున్నారు. ఎన్నిక‌ల‌కు ఆరు నెల‌ల ముందే స‌ర్వే చేయించి, ప్ర‌జాద‌ర‌ణ ఉన్న వారికే టికెట్లు ఇస్తాన‌ని తేల్చి చెప్పారు. జ‌గ‌న్ నిర్మొహ‌మాట‌త‌నం వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు, నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జ్‌ల కంటే ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు వెన్నులో వ‌ణుకు పుట్టిస్తోంది.

ఎందుకంటే మ‌రోసారి అధికారంలోకి రావాల‌ని జ‌గ‌న్ ఎంతో ప‌ట్టుద‌ల‌తో ఉన్నార‌నే సంకేతాలు వెలువ‌డ్డాయి. గెలుపు కోసం జ‌గ‌న్ ఎందాకైనా పోరాడుతార‌ని చంద్ర‌బాబుకు తెలిసినంత‌గా మ‌రెవ‌రికీ తెలియ‌దు. ఎన్నిక‌ల‌కు ఇంకా 19 నెల‌ల స‌మ‌యం వుండ‌గానే త‌న పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌ల‌కు జ‌గ‌న్ దిశానిర్దేశం చేయ‌డంపై ప్ర‌తిప‌క్ష పార్టీలు జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తున్నాయి. అధికారంలో ఉన్న పార్టీ అధినేత‌గా జ‌గ‌న్ ఎంతో బిజీగా వుంటారు. కానీ రానున్న ఎన్నిక‌ల‌పై జ‌గ‌న్ ఇప్ప‌టి నుంచే ప్ర‌త్యేక శ్ర‌ద్ధ క‌న‌బ‌రుస్తు న్నార‌ని అంద‌రికీ క‌నిపిస్తోంది.

జ‌గ‌న్ కంటే చంద్ర‌బాబుకు రానున్న ఎన్నిక‌లు ఎంతో కీల‌కం. ఈ ద‌ఫా టీడీపీ అధికారంలోకి రాక‌పోతే ....ఇక ఆ పార్టీకి భ‌విష్య‌త్ వుండ‌ద‌ని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ నాయ‌కులు ఆందోళ‌న‌లో ఉన్నారు. రానున్న ఎన్నికల్లో చావోరేవో అన్న‌ట్టు టీడీపీ త‌ల‌ప‌డాల్సి వుంది. మ‌రి అభ్య‌ర్థుల ఎంపిక‌లో చంద్ర‌బాబునాయుడు చేస్తున్న క‌స‌ర‌త్తు ఏంటి? జ‌గ‌న్‌లా ఆయ‌న నిర్మొహ‌మాటంగా ఎందుకు వ్య‌వ‌హ‌రించ‌లేక‌పోతున్నార‌ని సొంత పార్టీ వాళ్లే ప్ర‌శ్నిస్తున్న ప‌రిస్థితి.

అధికార పార్టీపై కొన్ని వ‌ర్గాల్లో స‌హ‌జంగానే అసంతృప్తి వున్న మాట వాస్త‌వ‌మే. ఇదే సంద‌ర్భంలో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీగా టీడీపీ బ‌ల‌ప‌డిన దాఖ‌లాలు లేవు. పార్టీలో అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల‌ను చంద్ర‌బాబు ప‌రిష్క‌రించ‌లేక‌పోతున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు విజ‌య‌వాడ‌లో దేవినేని ఉమా, బొండా ఉమా, బుద్ధా వెంక‌న్న త‌దిత‌రుల‌తో ఎంపీ కేశినేని మ‌ధ్య పోరు సాగుతూనే వుంది. అయినా ఏమీ చేయ‌లేని నిస్స‌హాయ స్థితి. కేశినేని నాని బ‌హిరంగంగానే పార్టీ నేత‌ల‌పై విసుర్లు, అటు వైపు నుంచి ఘాటు వ్యాఖ్య‌లు ....టీడీపీ అధిష్టానం ప్రేక్ష‌క‌పాత్ర పోషిస్తుండ‌డం త‌ప్ప‌, ఏం చేస్తున్న‌ద‌నే ప్ర‌శ్న పార్టీ శ్రేణుల నుంచే వ‌స్తోంది.

ఇక గుంటూరు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ పార్టీలో ఉన్నారో, లేరో కూడా తెలియ‌ని అయోమ‌య ప‌రిస్థితి. రెండో దఫా అమ‌రావ‌తి పాద‌యాత్ర‌లో ఆయ‌న ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. విశాఖ‌లో గంటా శ్రీ‌నివాస్ పార్టీలో ఉన్న‌ట్టా? లేన‌ట్టా? అనేది చంద్ర‌బాబుకే తెలియ‌ని దుస్థితి. గంటాకు ప్ర‌త్యామ్నాయంగా మ‌రో నాయ‌కుడిని చూసుకోలేని దుస్థితి. అలాగే విజ‌య‌వాడ‌లో వంగ‌వీటి రాధా జ‌న‌సేన‌తోనూ, వైసీపీ నేత‌ల‌తోనూ చెట్ట‌ప‌ట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఆయ‌న గురించి టీడీపీ మ‌న‌సులో ఏముందో తెలియ‌దు.

ఇక రాయ‌ల‌సీమ‌కు వ‌స్తే...నంద్యాల‌లో ఫ‌రూక్‌, భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి ఉండ‌గా, అఖిల‌ప్రియ ఎంట‌ర్ అయ్యారు. దీంతో అక్క‌డ టీడీపీలో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు మొద‌ల‌య్యాయి. ఆళ్ల‌గ‌డ్డ‌లో టీడీపీ ప‌రిస్థితి గాలిలో దీప‌మైంది. అలాటే కేఈ కుటుంబం, కోట్ల కుటుంబాలు రాజ‌కీయంగా పూర్తిగా మౌనం పాటిస్తున్నాయి. క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరులో లింగారెడ్డి, ఉక్కు ప్ర‌వీణ్ మ‌ధ్య ఆధిప‌త్య పోరు న‌డుస్తోంది. అస‌లే అంతంత మాత్రంగా ఉన్న ఆ నియోజ‌క‌వ‌ర్గంలో విభేదాల‌ను స‌మ‌సిపోయేలా చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదు.

క‌మ‌లాపురంలో మాజీ ఎమ్మెల్యే వీర‌శివారెడ్డి రాక‌తో కొత్త స‌మ‌స్య త‌లెత్తింది. ప్ర‌స్తుతానికి అక్క‌డ పుత్తా న‌ర‌సింహారెడ్డి ఇన్‌చార్జ్‌గా కొన‌సాగుతున్నారు. వ‌రుస‌గా మూడు ద‌ఫాలు ఓడిపోయిన వాళ్ల‌కు టికెట్ ఇవ్వ‌మ‌ని లోకేశ్ తేల్చి చెప్పిన నేప‌థ్యంలో, క‌మ‌లాపురం టీడీపీ అభ్య‌ర్థిపై అనేక అనుమానాలున్నాయి. వీర‌శివారెడ్డి మాత్రం త‌న‌కే టికెట్ అని ప్ర‌చారం చేసుకుంటున్నారు. ఇక అదే జిల్లా జ‌మ్మ‌ల‌మ‌డుగులో ఒకే కుటుంబానికి చెందిన ఆదినారాయ‌ణ‌రెడ్డి బీజేపీ త‌ర‌పున‌, ఆయ‌న అన్న కుమారుడు భూపేష్ టీడీపీ త‌ర‌పున నిల‌బ‌డితే... వైసీపీ మ‌రోసారి తిరుగులేని మెజార్టీతో గెల‌వ‌డం ఖాయం. ఇలాంటి చోట్ల టీడీపీ అధిష్టానం తీసుకుంటున్న చ‌ర్య‌లేంటి?

చంద్ర‌బాబు వైఖ‌రి చూస్తుంటే... కేవ‌లం వైసీపీ ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త‌తో త‌మ‌ను గెలిపిస్తార‌నే ఆశ‌తో ఉన్న‌ట్టున్నారు. ఇది ఎప్ప‌టికీ జ‌ర‌గ‌ద‌ని ఆయ‌న గ్ర‌హించాల్సి వుంది. అభ్య‌ర్థుల ఎంపిక‌పై ఎంతో ముందు చూపుతో స‌ర్వేలు చేయిస్తూ, జ‌గ‌న్ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. కానీ చంద్ర‌బాబు మాత్రం పాకుతూ వెళుతున్నారు. ఈ ర‌క‌మైన వ్యూహాల‌తో జ‌గ‌న్‌ను ఎదుర్కోవ‌డం చంద్ర‌బాబుకు అసాధ్య‌మ‌నే చెప్పాలి.

ఎన్నిక‌ల వ్యూహాల్లో జ‌గ‌న్ ఆరితేరారు. ఈ త‌రం నాయ‌కుడిగా ప్ర‌జ‌ల నాడిని జ‌గ‌న్ బాగా తెలుసుకున్నారు. ఏం చేస్తే జ‌నం ఆద‌రిస్తారో జ‌గ‌న్ బాగా స్ట‌డీ చేశారు. గెల‌వాలంటే ఏం చేయాలో, ఏం చేయ‌కూడ‌దో బాగా ఆలోచించే జ‌గ‌న్ అడుగులు వేస్తు న్నారు. కానీ చంద్ర‌బాబు మాత్రం... జ‌గ‌న్ ఏం చేస్తున్నారో అధ్య‌య‌నం చేస్తూ అడుగులు వేయాల‌ని అనుకుంటున్నగా క‌నిపిస్తోంది. అంతెందుకు లోకేశ్‌కు ఇప్ప‌టి వ‌ర‌కూ ఒక సుర‌క్షిత‌మైన నియోజ‌కవ‌ర్గం లేదంటే... ఎలా అర్థం చేసుకోవాలి?

లోకేశ్ క‌థ దేవుడెరుగు... జ‌గ‌న్ మూడున్న‌రేళ్ల పాల‌న పుణ్య‌మా అని కుప్పంలో కూడా ఈ సారి చంద్ర‌బాబు గెలుపు అనుమాన‌మే అని ప‌రిస్థితి తెచ్చారు. జ‌గ‌న్ వ్యూహం ఎలా వుంటుందో కుప్పం ఎపిసోడే నిద‌ర్శ‌నం. అధికార రేస్‌లో జ‌గ‌న్ చిరుత‌లా దూసుకెళుతున్నారు. చంద్ర‌బాబు మాత్రం ఇంకా స‌ర్దుకోవ‌డంలోనే వున్నారు. ప్ర‌స్తుతానికి త‌మ ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌ల‌కు జ‌గ‌న్ ఫైన‌ల్ వార్నింగ్ కూడా ఇచ్చారు.

ఇదే చంద్ర‌బాబు విష‌యానికి వ‌స్తే... ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న 50 నియోజ‌క వ‌ర్గ ఇన్‌చార్జ్‌ల‌తో మొద‌టి ద‌ఫా స‌మావేశాలు నిర్వ‌హించారు. అది కూడా ఎవ‌రికీ టికెట్ ఖ‌రారు చేయ‌లేదు. కేవ‌లం సిటింగ్ ఎమ్మెల్యేల‌కు మాత్ర‌మే గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చారు. అంటే 18 మందికి మాత్రమే టికెట్లు ఖ‌రారు చేశార‌న్న మాట‌. దీన్నిబ‌ట్టి జ‌గ‌న్ ఎంత దూకుడుతో వ్య‌వ‌హ‌రిస్తున్నారో అర్థం చేసుకోవ‌చ్చు. చంద్ర‌బాబు మాత్రం మొహ‌మాటంతో ఎవ‌రికీ గ‌ట్టిగా చెప్ప‌లేక‌, అలాగ‌ని చెప్ప‌కుండా ఉండ‌లేక స‌త‌మ‌తం అవుతున్నార‌ని తెలిసింది. 

చంద్ర‌బాబు తీరు మార్చుకోక‌పోతే మాత్రం ...శాశ్వ‌తంగా టీడీపీకి త‌న చేతుల‌తో స‌మాధి క‌ట్ట‌డం ఖాయం. టీడీపీ భ‌విష్య‌త్ చంద్ర‌బాబు ఆలోచ‌న‌ల‌పై ఆధార‌ప‌డి వుంది. ఆయ‌న ఏం ఆలోచిస్తారో, ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటారో కాల‌మే జ‌వాబు చెప్పాల్సి వుంది.

ఇద్దరూ ఏడ్చేసారు

నేను సింగిల్ గా ఉండిపోతా