విజయం ఎలా సాధించాలో జగన్‌కు బాగా తెలుసు. నిర్మొహమాటమే విజయానికి తొలి మెట్టు అని జగన్ గ్రహించారు. జగన్‌కు గెలుపు తర్వాతే ఎవరైనా, ఏమైనా! అందుకే ఆప్తులుగా పేరు పొందిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిని సైతం అంత మందిలో గడపగడపకూ తిరగకపోతే ఎలా రాజా? ఎంతో నమ్మకం పెట్టుకుని ఆర్థికశాఖ మంత్రి పదవి ఇచ్చాను కదా? అని ప్రశ్నించారు. ఈ పని మరో రాజకీయ నాయకుడు చేస్తాడని అసలు ఊహించలేం.
అంతిమ నిష్టూరం కంటే ఆది నిష్టూరమే మేలని జగన్ గట్టి నిర్ణయానికి వచ్చారు. పదేపదే జగన్ గెలుపు నామ స్మరణ చేస్తున్నారు. ఒక వైపు 175కు 175 నియోజకవర్గాల్లో గెలిచి తీరాల్సిందేనని టార్గెట్ పెట్టి, మరోవైపు గెలుపునకు షార్ట్ కట్స్ వుండవని, నిత్యం ప్రజల్లో ఉండాల్సిందేనని దిశానిర్దేశం చేశారు. మరీ ముఖ్యంగా జగన్ తన ఉద్దేశాన్ని నిర్మొహమాటంగా తన ఎమ్మెల్యేల ముందు ఉంచారు.
“మొహమాటాల్లేవు. గడపగడపకూ తిరగాల్సిందే. మీపై నాకు ప్రేమ ఉంది. అందుకే ముందస్తుగా అప్రమత్తం చేస్తున్నాను. ఇప్పటికైనా మీ తీరు మార్చుకోండి. ఓడిపోయే పోతారనే వాళ్లకు టికెట్లు ఇవ్వలేను” అని తేల్చి చెప్పారు. ఎమ్మెల్యేలు గెలిస్తేనే కదా మనం నిలవగలిగేది అని జగన్ చెప్పడంలో న్యాయం వుంది. రాజకీయాలను ఎంచుకున్న తర్వాత ప్రజల్లో తిరగడం తప్ప మరో ఆలోచన ఉండకూడదని ఆయన తేల్చి చెప్పడం గమనార్హం.
అవ్వా కావాలి, బువ్వా కావాలి అంటే కుదరదనే చందంగా, వ్యాపారాలో, రాజకీయాలో ఏదో ఒకటి తేల్చుకోవాలని ఆయన ఎమ్మెల్యేలకు ఆప్షన్ ఇవ్వడం సాహసమే. ఎమ్మెల్యేలు, ఎంపీల మనసుల చూరగొనడానికి తాను లేనని జగన్ విస్పష్టంగా చెప్పారు. అంతిమంగా మరోసారి వైసీపీ ప్రభుత్వం వచ్చేందుకు అందరూ కృషి చేయాల్సిందేనని ఆయన మార్గనిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో మొక్కుబడి కార్యక్రమాలు చేస్తే ఇక మీదట కుదరదని జగన్ నేరుగానే చెప్పారు.
రాజకీయాల్లో జగన్ వ్యూహం కొత్త ఒరవడి అని చెప్పాలి. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నప్పటి నుంచి ఎమ్మెల్యేలను జనంలో తిరగాలని ఆదేశించడం నూతన పంథాకు నిదర్శనమని చెప్పాలి. రాజకీయాలను, అధికారాన్ని జగన్ ఎంత సీరియస్‌గా తీసుకున్నారో ఎమ్మెల్యేలతో పదేపదే నిర్వహిస్తున్న సమీక్షా సమావేశాలే నిదర్శనం. జగన్‌లా రాజకీయాలను సీరియస్‌గా తీసుకునే వాళ్లే ఆయన చెప్పినట్టు నడుచుకుంటారు. లేదంటే తమకు తాముగా తప్పుకోవడమో, జగనే తప్పించడమో జరుగుతుంది.
జగన్ చెబుతున్న దాంట్లో తప్పేమీ లేదు. జనంలో ఉండాలని ఆయన ఆదేశిస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో గెలుపునకు షార్ట్ కట్స్ వుండవని చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. ప్రజలతో నాయకులు ఉంటే, వారితో ప్రజలు ఉంటారని ఆయన సిద్ధాంతం. మంచి విషయాన్ని చెబితే ఆచరించడానికి ప్రజాప్రతినిధులకు ఇబ్బంది ఎందుకు? మారుతున్న కాలానికి తగ్గట్టు నాయకులు తమ విధానాలను మార్చుకోకపోతే, ఓడిపోవడం ఖాయమని జగన్ చెప్పకనే చెప్పారు. ప్రతిపక్షాలు సైతం జగన్‌ను అనుసరించే పరిస్థితి తీసుకొచ్చారు.