పేద వర్గాల పాలిట నారా చంద్రబాబునాయుడిని విలన్ చేయడంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యారు. బాబు అంటే సంపన్నవర్గాల ప్రయోజనాల కోసం పని చేసే పొలిటీషియన్‌గా చూపడంలో జగన్ శ్రమ ఫలించింది. ఇందుకు రాజధాని అమరావతి ప్రాంతంలో ఇళ్ల స్థలాల పంపిణీలో చోటు చేసుకున్న పరిణామాలే నిదర్శనం. మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల పరిధిలో 1,402 ఎకరాల్లో 25 లేఔట్లలో 50,793 మంది నిరుపేద అక్కచెల్లెమ్మలకు జగన్ ప్రభుత్వం సెంటు చొప్పున ఇళ్ల స్థలాలు పంపిణీ చేసింది.
అక్కడ పేదలకు నివాస స్థలాలు ఇస్తే ఇక తాము కోరుకున్న రాజధాని ఉండదని, లాభాలు అసలే దక్కవని కొందరు గగ్గోలు పెడుతున్నారు. ఈ క్రమంలో గత కొంత కాలంగా రాజధానిలో నివాస స్థలాల పంపిణీపై ఎల్లో గ్యాంగ్ అడ్డంకులు, వాటిని తిప్పి కొట్టడంలో జగన్ చేస్తున్న విమర్శలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. చివరికి జగన్ ప్రభుత్వ పోరాటమే వేలాదిగా పేదలకు నివాస స్థలాలు దక్కేలా చేసింది.
దీంతో రాజధాని ప్రాంతంలోని రెండు నియోజకవర్గాల్లో టీడీపీకి రాజకీయంగా చావు దెబ్బ తప్పదనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. అందుకే టీడీపీ, జనసేన తదితర రాజకీయ పార్టీలేవీ పేదలకు నివాస స్థలాల పంపిణీపై బహిరంగంగా నోరు తెరిచి మాట్లాడలేని దుస్థితి ఏర్పడింది. ఇదంతా జగన్ వ్యూహ ఫలితమే అని చెప్పక తప్పదు. పైగా టీడీపీ అనుకూల మీడియా ప్రతినిధులు తమ ప్రభుత్వం వస్తే పట్టాలు రద్దు చేస్తామనే ప్రకటనతో రాజకీయంగా ఆ పార్టీకి తీవ్ర దెబ్బ తగులుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇలా ఏ రకంగా చూసినా 50 వేలకు పైగా కుటుంబాల వ్యతిరేకతను టీడీపీ మూటకట్టుకోవాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తమ పక్షాన నిలిచి, అనేక అడ్డంకులను ఎదుర్కొని ఇళ్ల స్థలాలు ఇచ్చిన గొప్ప ముఖ్యమంత్రిగా పేదలు ఆరాధిస్తున్నారు. ఇదే సందర్భంలో తమకు ఇళ్ల స్థలాలు దక్కకుండా అడ్డుకున్న రాక్షసుడిగా చంద్రబాబుతో పాటు ఆయన మిత్రపక్ష నేతల్ని పేదలు నెగెటివ్ కోణంలో గుర్తించుకుంటున్నారు.
పేదలకు నివాస స్థలాల పంపిణీ సందర్భంగా జగన్ మాటలను పేదలు ఎప్పుడూ గుర్తించుకుంటారు. జగన్ వ్యూహాత్మకంగా అడుగులేసి ప్రతిపక్షాలను చావుదెబ్బతీశారు. జగన్ ఏమన్నారో ఒక సారి గుర్తు చేసుకుందాం.
” దేశంలో ఎక్కడైనా సరే పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు కావాలని ధర్నాలు చేసే వారిని చూశాం. రాష్ట్రంలో మాత్రం ఇవ్వొద్దని ధర్నాలు చేస్తున్న చంద్రబాబు ముఠాను చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తోంటే తట్టుకోలేక గజ దొంగల ముఠా అడ్డు పడుతోంది. ఈ మారీచులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, సుప్రీంకోర్టు వరకు వెళ్లి.. న్యాయ పోరాటం చేసిమరీ పేదలకు ఇళ్ల పట్టాలిస్తున్న చారిత్రక ఘట్టాన్ని అమరావతిలో చూస్తున్నాం “
“రాష్ట్రంలో కులాల మధ్య యుద్ధం జరగడంలేదు. ఇక్కడ జరుగుతోంది క్లాస్ వార్. ఒకవైపు పేదవాడు ఉంటే.. మరోవైపు పేదవాళ్లకు మంచి జరగకూడదన్న పెత్తందార్లు ఏకమై యుద్ధం చేస్తున్నారు. పేదవాడికి ఇళ్ల స్థలాలు ఇస్తామంటే కోర్టుల వరకూ వెళ్లి అడ్డుకుంటున్నారు. ఈ అమరావతిలో పేదవాడికి ఇళ్ల స్థలాలు ఇస్తుంటే.. కోర్టులకు వెళ్లి సామాజిక సమతుల్యం దెబ్బ తింటుందని వాదించారు. అంటే పేదవాడు ఇక్కడికి వచ్చి ఉంటే పెత్తందార్లు జీర్ణించుకోలేక హైకోర్టులో కేసులు వేశారు. అక్కడ ఓడిపోతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు. అక్కడా ఓడిపోయినా ఇప్పటికీ చంద్రబాబు ఏదో ఒక రకంగా అడ్డుకుంటూనే ఉన్నారు”
వైఎస్ జగన్ పదేపదే క్యాస్ట్ వార్ కాదు, క్లాస్ వార్ జరుగుతోందని విమర్శించడానికి బలమైన రాజకీయ కారణం వుంది. టీడీపీని, జనసేనను పేదల శత్రువులుగా చూపే క్రమంలో జగన్ డైలాగ్ వార్‌కు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో జగన్ పైచేయి సాధించారు. భారీ మొత్తంలో రాజధాని ప్రాంతంలో పేదలకు నివాస స్థలాల పంపిణీతో రెండు నియోజకవర్గాల్లో టీడీపీ ఓటమి ఖాయమని వారు ఓ నిర్ణయానికి వచ్చారు.
పేదలకు అడ్డుపడుతున్నామన్న భావన ప్రతిపక్షాల్ని వెంటాడుతోంది. ఇది కేవలం రాజధాని ప్రాంతానికే పరిమితం కాలేదు. యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా పేదల పాలిట చంద్రబాబు శత్రువనే అభిప్రాయం బలపడుతోంది.