జనసేనాని పవన్‌కల్యాణ్ ఎదురుగా జనం, కెమెరాలు, చేతిలో మైకు వుంటే, ఆయనేం మాట్లాడ్తారో కూడా తెలియదు. మత్తులో ఉన్న వాళ్లు ఇష్టానుసారం నోరు పారేసుకున్నట్టుగా, పవన్ కూడా బహిరంగ సభల్లో ఏదో మైకం కమ్మిన వ్యక్తిలా ప్రవర్తిస్తుంటారు. తీరా స్టేజీ దిగిన తర్వాత.. అరె ఇట్లా మాట్లాడానా? అని తనను తాను ప్రశ్నించుకునే పరిస్థితి. ఇదే పవన్‌కు పెద్ద సమస్య. ఆ తర్వాత పరిణామాలపై ఆయన ఆందోళన చెందుతుంటారు.
ఇటీవల తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన కూటమి మొట్టమొదటి ఎన్నికల సభ జరిగింది. ఈ సభలో పవన్‌కల్యాణ్ ప్రసంగం అదుపు తప్పిందని మేధావులు అంటున్న మాట. సభా వేదికపై నుంచి తమ ప్రధాన ప్రత్యర్థి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను పవన్‌కల్యాణ్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. అథఃపాతాళానికి తొక్కుతానని గట్టి హెచ్చరిక చేశారు. తన పేరు పవన్‌కల్యాణ్ అంటూ… సీఎం జగన్‌కు ఏవేవో హెచ్చరికలు చేశారు. ఇవన్నీ వినడానికి, చూడడానికి బాగానే వుంటాయి. అయితే రాజకీయం అంటే అరుపులు కాదని పవన్ తెలుసుకుంటే మంచిది.
అసలే జగన్ పట్టుదల మనిషి. ఎవరినైనా ఓడించాలని జగన్ ఒక్కసారి కమిట్ అయితే, అనుకున్న పని చేసేంత వరకూ నిద్రపోరు. జగన్ రాజకీయ దెబ్బకు బాధితులు పవన్‌కల్యాణ్, నారా లోకేశ్. గత ఎన్నికల్లో పవన్‌ను రెండు చోట్లా, లోకేశ్‌ను మంగళగిరిలో మట్టి కరిపించిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలిసి కూడా పవన్ చెలరేగిపోవడం ఆయన అజ్ఞానానికి నిదర్శనం. సభల్లో రాజకీయ విమర్శల వరకే పరిమితం అయితే ఇరుపక్షాలకు బాగుంటుంది.
కానీ పవన్ బ్యాలెన్స్ తప్పి, చివరికి తన అభిమానుల్ని కూడా తిట్టారు. తనకెవరూ సలహాలివ్వొద్దని వార్నింగ్ ఇచ్చారు. అలాగే తన పార్టీని కించపరుచుకునేలా పిచ్చిపిచ్చి ప్రేలాపనలు చేశారు. దీంతో సొంత వాళ్ల అభిమానాన్ని కూడా ఆయన పోగొట్టుకున్నారు.
తాడేపల్లి గూడెం సభలో పవన్ ఘాటు కామెంట్స్ ఆయనకు చిక్కులు తెచ్చేలా వున్నాయి. సీఎం జగన్‌లో మరింత పట్టుదల పెంచేలా చేశాయి. పవన్‌కల్యాణ్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వకూడదనే పట్టుదల జగన్‌లో పెంచారు. దీంతో పవన్ పోటీ చేస్తారని ప్రచారంలో ఉన్న పిఠాపురంపై జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే పిఠాపురం వైసీపీ అభ్యర్థిగా కాకినాడ ఎంపీ వంగా గీతను ప్రకటించారు. ప్రస్తుతం మారిన రాజకీయ పరిస్థితుల్లో గీతకు బదులు మరొకరిని నిలిపే ప్రయత్నంలో జగన్ ఉన్నట్టు సమాచారం.
ముల్లును ముల్లుతోనే తీయాలని జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ముద్రగడ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరిని పవన్‌పై పోటీ చేయించాలనే ఆలోచనలో జగన్ ఉన్నట్టు తెలుస్తోంది. పిఠాపురం నుంచి పవన్‌ను కదలనివ్వకుండా, అక్కడికే పరిమితం చేసేలా వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. ఇటీవల సభలో తన వాళ్లపై పవన్ అవాకులు చెవాకులు పేలడాన్ని గుర్తు చేస్తూ, కాపుల్లోనే ఆయనపై తిరుగుబాటు వచ్చేలా వైసీపీ పావులు కదుపుతోంది.
జగన్‌పై తన మాటలు ఏ రకంగా చేటు తెస్తాయో పవన్‌కు రానున్న రోజుల్లో తెలుసొస్తుంది. పవన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ విడిచి పెట్టరు. 2019 నాటి చేదు ఫలితాన్ని పవన్‌కు మిగిల్చేందుకు జగన్ అన్ని రకాల అస్త్రాలను ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్ అధికారికంగా తాను పోటీ చేసే నియోజకవర్గాన్ని ప్రకటిస్తే, అప్పుడు అసలు సినిమా మొదలవుతుంది. కనీసం తాను పోటీ చేసే నియోజకవర్గం… ఇదీ అని చెప్పడానికి ధైర్యం లేని పవన్… సీఎం జగన్‌ను అథఃపాతాళానికి తొక్కుతానని ప్రగల్భాలు పలకడం ఆశ్చర్యం కలుగుతుంది.
తన కోపమే తన శత్రువనే పెద్దల మాట… ఎంత నిజమో పవన్‌కు రానున్న రోజుల్లో తెలిసొచ్చేలా జగన్ చేస్తారు. పవన్ గుండెల్లో జగన్ నిద్రపోవడం ఖాయం. పవన్ మాటల నాయకుడైతే, జగన్ చేతల లీడర్!