రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, ఆయన భార్య ప్రశాంతిరెడ్డి ఎట్టకేలకు నేడు టీడీపీ కండువా కప్పుకోనున్నారు. వేమిరెడ్డి దంపతులను పార్టీలో చేర్చుకునేందుకు చంద్రబాబునాయుడే నెల్లూరు వెళుతున్నారు. దీన్నిబట్టి వేమిరెడ్డికి టీడీపీ ఎంత ప్రాధాన్యం ఇస్తున్నదో అర్థం చేసుకోవచ్చు. అసలు వేమిరెడ్డి బలం ఏంటి? అనేది ప్రశ్న. కేవలం డబ్బే వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి బలం, బలగం.
ఆయన వెనుక పది మంది కార్యకర్తలు కూడా లేరు. డబ్బుతో ఏమైనా చేయగలమనే ధీమా చాలా మంది రాజకీయ నాయకులకు ఉన్నట్టే, వేమిరెడ్డిలో కూడా వుంది. రాజకీయాల్లో డబ్బున్న వాళ్ల మాటే చెల్లుబాటు అవుతున్న తరుణంలో, వేమిరెడ్డి చాలా బలమైన నాయకుడిగా కనిపిస్తున్నారు. అయితే వైసీపీలో సీఎం జగన్ ఇచ్చిన మర్యాదను వేమిరెడ్డి కాపాడుకోలేక పోయారు.
అంతా తన ఇష్టం వచ్చినట్టు నడుచుకోవాలనే వేమిరెడ్డి ధోరణి వైసీపీ పెద్దలకు నచ్చలేదు. వైసీపీకి వేమిరెడ్డి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచారనే కృతజ్ఞతతోనే.. ఆయనకు తగిన గౌరవం ఇచ్చారు. వేమిరెడ్డిని దేశంలోనే అత్యున్నత చట్టసభకు పంపారు. వేమిరెడ్డి భార్య ప్రశాంతిరెడ్డికి రెండుసార్లు టీటీడీ పాలక మండలిలో సభ్యత్వం కల్పించారు. అలాగే ఉత్తర భారతదేశంలోని టీటీడీ ఆలయాల పర్యవేక్షణ అధ్యక్ష పదవి ఇచ్చారు. నెల్లూరు జిల్లా వైసీపీ నాయకత్వ బాధ్యతల్ని ఆయన చేతిలో పెట్టారు.
వేమిరెడ్డి కోరినట్టుగానే నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్‌ను అక్కడి నుంచి తప్పించి నరసారావుపేటకు పంపారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ఇష్టం వచ్చిన అభ్యర్థిని నిలబెట్టుకొమ్మని వేమిరెడ్డి చెప్పిన తర్వాతే …డిప్యూటీ మేయర్ ఖలీల్ పేరు ఖరారు చేశారు. ఇలా వేమిరెడ్డి చెప్పిన తర్వాతే వైసీపీ అధిష్టానం నెల్లూరు సిటీ అభ్యర్థిని ఎంపిక చేసింది. ఆ తర్వాత వేమిరెడ్డి యూటర్న్ తీసుకోవడం దేనికి సంకేతం?
ఒక బీసీ, మైనార్టీ వర్గానికి చెందిన అభ్యర్థిని నెల్లూరు సిటీ నుంచి పోటీ చేయించడాన్ని కూడా ఓర్వలేకపోతే ఎలా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. తాను లేకపోతే నెల్లూరు వైసీపీకే దిక్కే లేదన్న అహంకారం తప్ప, ఆయన అసంతృప్తికి బలమైన ఒక్క కారణాన్నైనా చెప్పగలరా? నెల్లూరు ఎంపీ టికెట్‌ను తాను కాదంటే, వైసీపీకి అసలు అభ్యర్థులే దొరకరనే చిన్న చూపే, వేమిరెడ్డితో ఇష్టానుసారం ఆడిస్తోందనే చర్చకు తెరలేచింది.
సౌమ్యుడు, మంచి మనిషి అనే గౌరవంతోనే కదా, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సూచలను సీఎం జగన్ పరిగణలోకి తీసుకుని మార్పులకు శ్రీకారం చుట్టింది. సీఎం ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వేమిరెడ్డికి లేదా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. వేమిరెడ్డితో పాటు ఆయన భార్య ప్రశాంతిరెడ్డికి కూడా టీటీడీలో గౌరవప్రదమైన స్థానం కల్పించి, కలియుగ దైవం శ్రీవారి సేవా భాగ్యం కల్పించిన మాట వాస్తవం కాదా? ఇలా భార్యాభర్తలకు గౌరవం ఇవ్వడమే జగన్ చేసిన తప్పా? వేమిరెడ్డి కోరికలు మరీ శ్రుతిమించడంతోనే జగన్ లైట్ తీసుకున్నారనే చర్చ జరుగుతోంది. అందుకే ఆయన చూపు టీడీపీ వైపు మళ్లింది.
టీడీపీలో చేరి, వైసీపీలో కంటే గొప్ప గౌరవం, పదవులు పొందగలరా? వేమిరెడ్డి తన గురించి తాను గొప్పగా ఊహించుకుంటే ఎవరికీ అభ్యంతరం వుండదు. కానీ ఇతరులను అల్పులుగా లెక్క కట్టి, డబ్బు ఉందన్న అహంకారంతో నడుచుకుంటేనే సమస్య. ఇప్పుడాయనకు టీడీపీ ఇస్తున్న గౌరవ మర్యాదలు… కేవలం తన డబ్బుకు మాత్రమే అని వేమిరెడ్డి గుర్తించి, అందుకు తగ్గట్టు మసులుకుంటే మంచిది. లేదంటే అభాసుపాలు కావడం ఖాయం.