‘‘అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం ప్రత్యేకహోదాపైనే చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు’’ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా కావాలని కోరుకునే వారికి, అలాంటి హోదా వస్తే గనుక ఏపీ రూపురేఖలు మారిపోతాయని, ప్రజల జీవితాలు ఎన్నోరెట్లు మెరుగుపడతాయని ఆశపడేవారికి ఈ వాక్యం ఎంత తియ్యగా కనిపిస్తుందో కదా? ప్రత్యేకహోదా డిక్లరేషన్ పేరుతో తిరుపతిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో వైఎస్ షర్మిల ఈ సంగతి చెప్పారు! ఆ మాట నిజమైతే ఎంతో బాగుండుననుకునే వారికి, ఇప్పుడు అనుమానం వస్తుంది! ఇంతకూ రాహుల్ గాంధీ ఎవరికి చెప్పారు? ఎప్పుడు చెప్పారు? వీడియో ఏదైనా ఉందా?
కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రత్యేకహోదా వస్తుంది అని చాటిచెప్పడం ఒక్కటే ఏపీసీసీ సారథిగా షర్మిలకున్న ప్రచారాస్త్రం కావొచ్చు. మరెలాంటి ఇతర సంక్షేమ ఆలోచనలు చేయడానికి ఆమెకు అవకాశం లేనంతగా రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లుతుండవచ్చు. అందుకే ఆమె దానిని గట్టిగా పట్టుకున్నారు. ప్రత్యేకహోదా వస్తుందంటే ఆశపడి ఓట్లు వేసే వాళ్లు కొందరు తప్పకుండా ఉంటారు గానీ.. ఇంతకీ రాహుల్ గాంధీ ఆ మాట ఎప్పుడు చెప్పారు?
కన్యాకుమారి నుంచి కాశ్మీరు వరకు పాదయాత్ర సాగించినప్పుడు ఆయన ఏపీలో కూడా అతి కొద్ది ప్రాంతాల గుండా పర్యటించారు. అప్పుడు కూడా ఈ మాట చెప్పినట్టు ఎక్కడా రాలేదు. కాంగ్రెస్ తో మాత్రమే ప్రత్యేకహోదా సాధ్యం వంటి డొంకతిరుగుడు మాటలు తప్ప.. అధికారంలోకి వస్తే.. ప్రత్యేకహోదా మీదనే తొలిసంతకం అనే మాట ఆయన అనలేదు. కానీ అన్నారని షర్మిల తెలుగు ప్రజలకు చెబుతున్నారు. అందుకే ఆయన ఎఫ్పుడు అన్నారో, ఎక్కడ అన్నారో నిరూపించాల్సిన బాధ్యత ఆమె మీద ఉంది.
రాహుల్ గాంధీ.. వైఎస్ షర్మిలకు చెవిలో చెబితే సరిపోదు. ఇదేమీ అక్రమ లాలూచీ వ్యవహారం కాదు కదా. ఆయన స్వయంగా తెలుగు ప్రజలను ఉద్దేశించి చెప్పాలి.. తెలుగు ప్రజల ఎదుట ఒక సభలో చెప్పాలి.. లేదా, వారి కోసం ఒక వీడియో రిలీజ్ చేయాలి. తొలి సంతకం హోదాపై పెడతాను అనాలి. అప్పుడు మాత్రమే ఎవరైనా నమ్ముతారు.
అలాంటి హామీకి ఎలాంటి మెలికలు పెట్టకుండా ఉండాలి. కాంగ్రెస్ కు సింగిల్ గా కేంద్రంలో అధికారంలోకి వచ్చేటన్ని సీట్లు రావాలి.. అప్పుడు మాత్రమే హోదా ఇవ్వగలం.. లాంటి మడత పేచీలు ఉండకూడదు. ఇంతకూ ఇండియా కూటమి గెలుస్తుందో లేదో తెలియదు. గెలిస్తే రాహుల్ పీఎం అవుతారో లేదో తెలియదు. అయినా సరే.. అప్పుడు.. కొన్ని భాగస్వామి పార్టీలు వద్దంటున్నాయి.. వారికి కూడా కావాలంటున్నాయి. కాబట్టి.. ఇప్పటికి వాయిదా వేసి, కాంగ్రెస్ సింగిల్ గా గెలిచిన తర్వాత అప్పుడు సంతకం పెడతా అన్నారంటే.. ఇక అక్కడితో కథ ముగిసినట్టే.
కాబట్టి.. ఏపీ ప్రజలను వంచించడానికి తాను మాటలు చెప్పడం లేదని నిరూపించుకోవాలంటే.. షర్మిల కాస్త క్లారిటీ ఇవ్వాలి.