పూర్వరంగం సిద్ధం చేసుకుంటున్న పెద్దక్క!

‘నువ్వు ఒక కుక్కని చంపాలని అనుకుంటే.. ముందుగా దాని మీద, అది పిచ్చిదనే ముద్ర వేయి’ అనే కుటిల నీతిని మనకు తెలియజెప్పే ఇంగ్లిషు సామెత ఒకటి ఉంటుంది. ఏపీలో ఇప్పుడు రాజకీయాలు కూడా…

‘నువ్వు ఒక కుక్కని చంపాలని అనుకుంటే.. ముందుగా దాని మీద, అది పిచ్చిదనే ముద్ర వేయి’ అనే కుటిల నీతిని మనకు తెలియజెప్పే ఇంగ్లిషు సామెత ఒకటి ఉంటుంది. ఏపీలో ఇప్పుడు రాజకీయాలు కూడా అలాగే తయారవుతున్నాయి.

తెలుగుదేశం పార్టీ ఆదరణ కోరుకుంటున్న వారు.. లేదా.. చంద్రబాబునాయుడు నుంచి లోపాయికారీ మద్దతును, ‘సహకారాన్ని’ కోరుకుంటున్న వారు.. అవి దక్కాలంటే ముందుగా చేయాల్సిన పని ఒకటుంది. జగన్మోహన్ రెడ్డిని తిట్టడం, ఆయన మీద నిందలు వేయడం, ఆయనను విలన్ గా చిత్రీకరించడం, జగన్ దుర్మార్గుడంటూ ప్రజల మెదళ్లలో విషాన్ని నింపే ప్రయత్నం చేయడం. ఇప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీత కూడా అదే పని చేస్తున్నారు.

తన తండ్రి జీవించి ఉండగా ఆయనతో అనేక కారణాల వలన విభేదించి ఉండిన సునీత.. ఆయన మరణించిన నాటి నుంచి.. హత్య కేసు దర్యాప్తు గురించి రోజుకొక రకంగా నానా యాగీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ మరణానికి ముడిపెట్టి జగన్ మీద నిందలు వేయడానికి, ఆయనను ఇరుకున పెట్టడానికి రకరకాలుగా ప్రయత్నిస్తూ వచ్చారు.

జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్ర పోలీసుల దర్యాప్తులో నిజాలు తేలవన్నారు. తీరా సీబీఐ విచారణ కూడా వచ్చింది. ఆ విచారణ ఒక దశకు చేరిన ఈ సమయంలో, ఆ దర్యాప్తు ముందుకు సాగడం లేదంటూ ఆరోపణలతో తాజాగా ఆమె మీడియా ముందుకు వచ్చారు.

సీబీఐ విచారణ చురుగ్గా సాగకపోయినా అందుకు జగన్ దే బాధ్యత అన్నట్టుగా సునీత మాట్లాడడం విశేషం. సరిగ్గా ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న సమయంలో సునీత హస్తినలో ప్రెస్ మీట్ పెట్టి అవినాష్ రెడ్డిని, జగన్ ను నిందితులుగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నానికి దిగారు.

ఆమె రాజకీయ రంగ ప్రవేశానికి తండ్రి మరణాన్ని ఒక మెట్టుగా వాడుకోవాలని అనుకుంటున్నట్టుగా ప్రజలు భావిస్తున్నారు. ఆమె తెలుగుదేశం పార్టీ తరఫున కడప ఎంపీగా పోటీచేస్తారని గతంలో ముమ్మరంగా ప్రచారం జరిగింది. వైఎస్ షర్మిల ఏపీసీసీ సారథిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సీన్ మారింది.

తొలినుంచి సునీత చేస్తున్న ఆరోపణలకు షర్మిల మద్దతిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సునీత కాంగ్రెసులోకి వెళ్తారని ఆమె కడప ఎంపీగా అవినాష్ రెడ్డి పై పోటీచేస్తారని ప్రచారం జరుగుతోంది. దానికి తగ్గట్టుగానే.. ఢిల్లీ ప్రెస్మీట్ లో సొంత చెల్లెలికి అన్యాయం చేశారంటూ ఆమె షర్మిలకు అనుకూలంగా మాట్లాడుతున్నారు.

ప్రజలెవ్వరూ జగన్ పార్టీకి ఓటు వేయవద్దని అంటున్న సునీత.. సీబీఐ దర్యాప్తు సాగడం లేదు గనుక.. తనకు ప్రజా కోర్టులో తీర్పు కావాలని అనడాన్ని గమనిస్తే.. ఆమె ఎన్నికల్లో పోటీచేయడం తథ్యం అని.. అందుకే ఇప్పుడు జగన్ మీద బురద చల్లుతున్నారని అర్థమవుతోంది.