పూలమ్మిన చోటనే కట్టెలమ్మడం అంటే ఇదే! ఒక్క ఎన్నికతో పరిస్థితులు ఎంతగా మారిపోయాయో కదా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. దానిని సాధించింది తామే అని చెప్పుకుంటూ.. వరుసగా రెండుసార్లు ఎన్నికల్లో నెగ్గి.. సుమారు పదేళ్లపాటు అప్రతిహతంగా అధికారం వెలగబెట్టిన తర్వాత.. ఒకసారి ఎదురైన ఓటమిని, వాస్తవానికి, అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ.. భారాస మాత్రం ఆ ఓటమిని జీర్ణించుకోలేకపోవడమే కాదు, ఆ ఓటమి ప్రభావంలో విలవిల్లాడిపోతోంది. ఇప్పుడు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీచేయడానికి అభ్యర్థులు కూడా దొరకని దీనస్థితిలో ఉన్నదంటే పరిస్థితి అర్థంచేసుకోవచ్చు.
రాష్ట్రంలో అధికారం పోయింది. చేతిలో పది ఎంపీ సీట్లు ఉండగా.. ఇప్పటికే ముగ్గురు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు. వెంకటేష్ నేత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా, రాములు, బీబీ పాటిల్ భారాసలో చేరారు. భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్న ఎంపీలు ఇంకా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితిలో వచ్చే ఎంపీ ఎన్నికల్లో రాష్ట్రంలో మొత్తం 17 సీట్లను గెలుచుకుంటాం అని గులాబీ నాయకులు మేకపోతు గాంభీర్యంతో పలుకుతున్నారు గానీ.. వాస్తవంలో పరిస్థితి చాలా దయనీయంగా ఉన్నట్టు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. పోటీచేయడానికి అభ్యర్థులే దొరకడం లేదని తెలుస్తోంది.
సాధారణంగా ఎంపీగా పోటీచేయడం అంటే ఇవాళ్టి రోజుల్లో వంద కోట్ల రూపాయల వ్యవహారంగా మారిపోయింది. అంత డబ్బు పెట్టే సంపన్నులు, పారిశ్రామికవేత్తలు ఆ పెట్టుబడికి తగినట్టుగా తమ తమ వ్యక్తిగత వ్యాపార ప్రయోజనాలు నెరవేరాలని కోరుకుంటూ ఉంటారు. కేంద్రంలో మరోసారి మోడీ సర్కారు ఏర్పడుతుందని పలువురు భావిస్తున్న సమయంలో.. గులాబీ దళం నుంచి ఎంపీలు ఆ పార్టీ వైపు మొగ్గుతున్నారు.
భారాస కనీసం రాష్ట్రంలోనైనా అధికారంలోకి వచ్చి ఉంటే.. ఆ పార్టీ తరఫున ఎంపీ హోదాలో ఏదో కాస్త అధికార వైభవం వెలగబెట్టవచ్చుననే ఆలోచన వారికి ఉండేది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేకపోవడం వల్ల పార్టీ మారుతున్నారు. పైగా గెలవడానికి అవసరమైన ఆర్థిక బలం ఉన్న వారు కొత్త అభ్యర్థులుగా బరిలోకి దిగడానికి కూడా పెద్దగా మొగ్గు చూపడం లేదని తెలుస్తోంది.
నిజామాబాద్ నుంచి గత ఎన్నికల్లో ఓడిపోయిన కేసీఆర్ కూతురు ఈసారి ఎన్నికల్లో పోటీచేసే ఉద్దేశంతో లేదు. ఆమె వెనక్కి తగ్గడం కూడా.. కార్యకర్తలకు తప్పుడు సంకేతాలు పంపుతోంది. గెలుపు అవకాశం లేనందువల్లనే వెనక్కుతగ్గుతున్నారని అనుకుంటున్నారు.
ఇలాంటి నేపథ్యంలో చాలాచోట్ల కొత్తవారినే బరిలోకి దింపాల్సి వచ్చేలా ఉంది. చాలా స్థానాల్లో రాజకీయ పునాదిగా అవకాశం వాడుకోవచ్చునని వచ్చే వారే తప్ప.. బలంగా తలపడి నెగ్గితీరాలనే పట్టుదలతో వచ్చేవారు తక్కువగా ఉన్నారని కార్యకర్తలు అంటున్నారు.