టీడీపీ వెన్నెముక విరిచేలా వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బీసీ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. టీడీపీకి మొదటి నుంచి బీసీలు అండగా నిలుస్తున్నారు. ఎన్టీఆర్ హయాంలో బీసీలకు అత్యధికంగా అధికారంలో భాగస్వామ్యం కల్పించారు. ఎన్టీఆర్ తదనంతరం చంద్రబాబు పెత్తనం మొదలైన తర్వాత, ఆయన ప్రాధాన్యతలు మారుతూ వచ్చాయి. చంద్రబాబు ఎక్కువగా పారిశ్రామికవేత్తలకు ఎంపీ, ఎమ్మెల్యే పదవులు కట్టబెడుతూ వచ్చారు.
ఏపీలో ప్రత్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఉన్నంత కాలం అధికారం మనదే అనే ధీమా టీడీపీ నేతల్లో కనిపించింది. ఏపీ విభజనతో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారాయి. ఏపీలో టీడీపీకి ప్రధాన ప్రత్యర్థిగా వైఎస్ జగన్ నేతృత్వంలో వైసీపీ అవతరించింది. సామాజిక సమీకరణలకు జగన్ పెద్దపీట వేయడం మొదలు పెట్టారు. ఈ నేపథ్యంలో టీడీపీ వెన్నెముక అయిన బీసీలను తన వైపు తిప్పుకోడానికి జగన్ వ్యూహాత్మకంగా పావులు కదిపారు.
బీసీలతో పాటు గుర్తింపునకు నోచుకోని కులాలకు జగన్ అధిక ప్రాధాన్యం ఇచ్చారు. రిజర్వేషన్లకు మించి ఆయన పదవుల పంపిణీ చేపట్టారు. ఈ ఎన్నికల్లో కూడా ఇదే ఫార్ములాను ఆయన అనుసరిస్తున్నారు. ముఖ్యంగా యాదవ సామాజిక వర్గానికి జగన్ ఇస్తున్న ప్రాధాన్యాన్ని చూస్తే, టీడీపీ వెన్నులో వణుకు పుడుతోంది. కమ్మ వర్సెస్ యాదవ్ అనే రీతిలో రాజకీయ సమరాన్ని సృష్టించడంలో జగన్ ఆరితేరారు.
నరసారావుపేట ఎంపీ స్థానం టీడీపీ తరపున లావు శ్రీకృష్ణదేవరాయలు (కమ్మ), వైసీపీ నుంచి అనిల్‌కుమార్ (యాదవ్), ఏలూరు లోక్‌సభ నుంచి మాగంటి బాబు (కమ్మ), వైసీపీ తరపున కారుమూరి సునీల్ కుమార్ (యాదవ్) పోటీ చేయనున్నారు. ఏలూరుకు సంబంధించి టీడీపీ అభ్యర్థి ఇంకా ఫైనల్ కాలేదు. కానీ ఏలూరు అంటే కమ్మ రిజర్వ్‌డ్ స్థానమనే అభిప్రాయం కలిగేలా ఇంత కాలం అక్కడ ఏ పార్టీ నుంచైనా ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలే ఎన్నికవుతున్నారు. దీన్ని బద్ధలు కొట్టేందుకు జగన్ తన మార్క్ కనిపించేలా బీసీ అభ్యర్థిని బరిలో నిలిపారు.
ఇక అసెంబ్లీ నియోజకవర్గాల విషయానికి వెళ్దాం. మైలవరం టీడీపీ అభ్యర్థిగా వసంత కృష్ణప్రసాదవ్ (కమ్మ), వైసీపీ నుంచి తిరుమలరావు (యాదవ్), కందుకూరులో ఇంటూరి నాగేశ్వరరావు (టీడీపీ, కమ్మ), అరవింద యాదవ్ (వైసీపీ, యాదవ్), కనిగిరిలో ఉగ్ర నరసింహారెడ్డి (టీడీపీ, రెడ్డి), నారాయణ (వైసీపీ, యాదవ్), తణుకు ఆరిమిల్లి రాధాకృష్ణ (టీడీపీ, కమ్మ), కారుమూరి నాగేశ్వరరావు (వైసీపీ, యాదవ్) పోటీ చేయనున్నారు. ఇంకా అభ్యర్థుల ప్రకటన పూర్తయ్యే సరికి మరెంత మంది యాదవులు లేదా బీసీలకు జగన్ సీట్లు ఇస్తారో అంచనా వేయలేని పరిస్థితి.
తన సామాజిక వర్గానికి చెందిన సిటింగ్ ప్రజాప్రతినిధులకు కూడా చెక్ పెట్టి, బీసీలకు జగన్ ప్రాధాన్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఉదాహరణకు మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డికి కాదని, చేనేత సామాజిక వర్గానికి చెందిన వారికి సీటు ఇవ్వడానికి జగన్ నిర్ణయించారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయమే వైసీపీ అంటే తమ పార్టీగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు భావిస్తున్నారు. వైసీపీని వీడే ఒకరిద్దరు బీసీ నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. కేవలం పదవులు ఇస్తున్నారే తప్ప, అధికారం మాత్రం తమ చేతల్లో వైసీపీ పెద్దలు పెట్టుకుంటున్నారనే విమర్శలను విస్మరించకూడదు.
ముందే పదవుల్లోకి వస్తే, ఆ తర్వాత అధికారం దానికదే వస్తుంది. అసలు రాజకీయాల్లో ప్రవేశమే లేకపోతే, అధికారం గురించి ఆలోచించే ప్రశ్న ఉత్పన్నం కాదు. అందుకే ఎవరెన్ని విమర్శలు చేసినా, జగన్ తమ శ్రేయోభిలాషిగా ఆ సామాజిక వర్గాలు భావిస్తున్నాయనేది నిజం. తమ ఓటు బ్యాంకు వైసీపీ వైపు టర్న్ అయ్యిందనే భయమే టీడీపీని ఒంటరిగా బరిలో దిగనివ్వడం లేదు. టీడీపీ ప్రాణం ఎక్కడుందో జగన్ కనుక్కోవడంతో పాటు, దాన్ని తన వైపు తిప్పుకోవడంలో జగన్ సక్సెస్ అయ్యారు. అందుకే జగన్ అంత బలవంతమైన నాయకుడిగా అవతరించారు. జగన్ స్ట్రాంగ్ లీడర్ కావడం అంటే, బాబు బలహీనపడడమే.