జ‌గ‌న్‌కు దూరం… దూరం!

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చుట్టూ ఎవ‌రున్నారు? ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ఈ విష‌యం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. 2019 ఎన్నిక‌ల‌కు ముందు, ఆ త‌ర్వాత అధికారం హ‌స్త‌గ‌తం అయ్యాక వైఎస్ జ‌గ‌న్ చుట్టూ ఉన్న వాళ్ల విష‌యం…

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చుట్టూ ఎవ‌రున్నారు? ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ఈ విష‌యం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. 2019 ఎన్నిక‌ల‌కు ముందు, ఆ త‌ర్వాత అధికారం హ‌స్త‌గ‌తం అయ్యాక వైఎస్ జ‌గ‌న్ చుట్టూ ఉన్న వాళ్ల విష‌యం చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది. వైఎస్ జ‌గ‌న్ అధికారానికి ద‌గ్గ‌రైన మ‌రుక్ష‌ణం నుంచి, ప్ర‌జ‌ల‌కు, మిత్రుల‌కు, శ్రేయోభిలాషుల‌కు దూర‌మ‌య్యారు.

అధికారంలో వున్న నాయ‌కులెవ‌రికైనా నిజాలు రుచించ‌వు. అబ‌ద్ధాలు తియ్య‌గా వుంటాయి. నాయ‌కుడిపై అభిమానంతో క్షేత్ర‌స్థాయిలోని వాస్త‌వ ప‌రిస్థితుల‌ను చెప్పాల‌ని ప్ర‌య‌త్నిస్తే, ఆ త‌ర్వాత వారెవ‌రూ పాల‌కుల వ‌ద్ద క‌నిపించ‌రు. వైఎస్ జ‌గ‌న్ విష‌యంలోనూ ఇదే జ‌రుగుతోంది. కార‌ణాలేవైనా త‌ల్లి, చెల్లి త‌దిత‌ర ఆత్మ బంధువులు కూడా ఇప్పుడు జ‌గ‌న్‌కు ద‌గ్గ‌ర‌గా లేర‌న్న‌ది చేదు నిజం. త్వ‌ర‌లో వైఎస్ జ‌గ‌న్‌కు వ్య‌తిరేకంగా ఏపీలో ష‌ర్మిల కాంగ్రెస్ ప‌క్షాన వ్య‌తిరేక రాజ‌కీయాలు చేసినా ఆశ్చ‌ర్య పోవాల్సిన ప‌నిలేదు.

మ‌రోవైపు ప్ర‌తిప‌క్షాల‌న్నీ ఏక‌మ‌వుతున్నాయి. ఎంత‌గా అంటే… ఉదాహ‌ర‌ణ‌కు ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు మెగాస్టార్ చిరంజీవి ప‌రోక్షంగా మ‌ద్ద‌తుగా నిలిచారు. అలాగే ప‌వ‌న్ మాజీ భార్య రేణూ దేశాయ్ కూడా రాజ‌కీయంగా మ‌ద్ద‌తుగా నిలిచారు. ఈ ద‌ఫా ప‌వ‌న్‌కు ఒక అవ‌కాశం ఇవ్వాల‌ని ఆమె కోర‌డం విశేషం. వైసీపీ వ్య‌తిరేక వ‌ర్గాల్ని ఏకం చేయ‌డంలో చంద్ర‌బాబు, లోకేశ్ త‌ల‌మున‌క‌లై ఉన్నారు. జ‌న‌సేన‌, టీడీపీ క‌లిసి రాజ‌కీయ ప్ర‌యాణం సాగించ‌డానికి అన‌ధికారికంగా ఒక అవ‌గాహ‌న‌కు వ‌చ్చిన‌ట్టే క‌నిపిస్తోంది.

మ‌రోవైపు పురందేశ్వ‌రి ఏపీ బీజేపీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి టీడీపీ కోసం ప‌ని చేస్తున్నారు. ఇలా విప‌క్షాల‌న్నీ ఒక ప‌క్షమై సీఎం వైఎస్ జ‌గ‌న్‌ను ఎదుర్కోడానికి అస్త్ర‌శ‌స్త్రాల‌ను సిద్ధం చేసుకుంటున్నాయి. మ‌రి ప్ర‌త్య‌ర్థుల‌ను దీటుగా ఎదుర్కోడానికి వైఎస్ జ‌గ‌న్ ఏం చేస్తున్నారో ఎవ‌రికీ అంతుచిక్క‌డం లేదు. ఎంత‌సేపూ ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు ఎమ్మెల్యేలు, మంత్రుల్ని వెళ్లాల‌ని జ‌గ‌న్ ఉసిగొల్పుతున్నారే త‌ప్ప‌, తాను మాత్రం తాడేప‌ల్లిలోని త‌న ఇంటి గ‌డ‌ప దాటి బ‌య‌ట‌కు రావ‌డం లేదు.

అప్పుడ‌ప్పుడు బ‌ట‌న్ నొక్క‌డానికి మిన‌హాయిస్తే, రాజ‌కీయ కార్య‌క‌లాపాల కోసం ఆయ‌న ఇంకా రెడీ కాక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. కానీ మ‌రోసారి ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తామ‌నే ధీమా సీఎం జ‌గ‌న్‌తో పాటు చుట్టూ ఉన్న వాళ్ల‌లో క‌నిపిస్తోంది. వాళ్ల ధైర్యం ఏంటో అర్థం కావ‌డం లేదు. క్షేత్ర‌స్థాయిలో వైసీపీ శ్రేణుల్లో మాత్రం మ‌రోసారి అధికారంపై ఆందోళ‌న నెల‌కుంది. నాలుగేళ్ల‌లో త‌మ‌కు ప్ర‌భుత్వం ఏమీ చేయ‌లేద‌ని, అలాంట‌ప్పుడు తామెందుకు వైసీపీకి మ‌ద్ద‌తుగా నిల‌వాల‌నే ప్ర‌శ్న మెలిపెడుతోంది.

2019 ఎన్నిక‌ల ముందు వైఎస్ జ‌గ‌న్ సీఎం కావాల‌ని సోష‌ల్ మీడియాలోనూ, క్షేత్ర‌స్థాయిలోనూ చాలా మంది స్వ‌చ్ఛందంగా ప‌ని చేశారు. జ‌గ‌న్ పాల‌న గొప్ప‌త‌నం ఏంటంటే…. వాళ్లంద‌రినీ ఇవాళ దూరం చేసుకోవ‌డం. వైసీపీ ప్ర‌భుత్వంలో అంద‌రినీ క‌లుపుకుని పోయే పెద్ద‌రికం కొర‌వ‌డ‌డం. వైసీపీ ప్ర‌భుత్వంలో ప‌ద‌వులు ద‌క్కించుకున్న మొహాల‌ను చూస్తే… సొంత వాళ్లు కూడా అస‌హ్యించుకుని దూరం జ‌రిగే ప‌రిస్థితి.

ప్ర‌జ‌ల‌తో ఏ మాత్రం సంబంధం లేని వాళ్లంతా జ‌గ‌న్ చుట్టూ ఉన్నారు. లాబీయిస్టులు, భ‌జ‌న‌ప‌రులు వైసీపీ ప్ర‌భుత్వంలో ప‌ద‌వులు ద‌క్కించుకున్నారు. ఆర్థికంగా ల‌బ్ధి పొందారు. నిజంగా వైసీపీ అధికారంలోకి రావాల‌ని శ్ర‌మించిన వారంతా దూర‌మ‌య్యారు. అలాంటి వాళ్ల ఆవేద‌న‌, శాపాలే నేడు వైసీపీకి శాపంగా మారాయి. అభిమానంతో కాకుండా అధికార‌మే ప‌ర‌మావ‌ధిగా భావించిన వాళ్లు జ‌గ‌న్‌ను ఎలాగోలా బుట్ట‌లో వేసుకుని అనుకున్న‌ది సాధించుకున్నారు. కాస్త ఆత్మాభిమానం ఉన్న నాయ‌కులు త‌మ‌కు తాముగా జ‌గ‌న్ ద‌గ్గ‌ర చేతులు క‌ట్టుకుని అడుక్కోలేక వీధిన ప‌డ్డారు.

జ‌గ‌న్ వ్య‌క్తిత్వ‌మే ప్ర‌తిప‌క్షాల‌కు క‌లిసొస్తోంది. ప్ర‌తిప‌క్షాల‌న్నీ ఏకం అవుతున్నాయంటే… అది వాళ్ల గొప్ప ఎంత మాత్రం కాదు. “మీరంతా నాకు వ్య‌తిరేకంగా ఏకం కావాల్సిందే” అని జ‌గ‌న్ త‌న చ‌ర్య‌ల ద్వారా క‌లుపుతున్నారు. మొండిత‌నంతో ద‌గ్గ‌రి వాళ్ల‌ను కూడా దూరం చేసుకున్నారు. 

జ‌గ‌న్ ప్ర‌తిప‌క్షంలో ఉండ‌గా ఆయ‌న్ను చూసేందుకు త‌పించిన వాళ్లంతా, ఇప్పుడు ప‌క్క‌నే వెళుతున్నా చూపు అటు వైపు మ‌ళ్లించ‌డానికి మ‌న‌సు ఇష్ట‌ప‌డ‌డం లేద‌ని వైసీపీ నేత‌లు అంటున్నారంటే, ఆయ‌న ప‌రిపాన ఏ దిశ‌గా సాగిందో, సాగుతున్న‌దో అర్థం చేసుకోవ‌చ్చు. త‌ర‌చూ జ‌గ‌న్ ఒక మాట అంటుంటారు. పైన దేవుడు, భూమిపై మీరు (ప్ర‌జ‌లు) త‌న‌కు అండ‌దండ అని. దేవుడు, ప్ర‌జ‌లు జ‌గ‌న్‌కు మాత్ర‌మే సొంతం కాదు. జ‌గ‌న్ అవ‌స‌రాల‌కే ఎప్పుడూ వారంతా ఉండ‌రు. వారి కోసం జ‌గ‌న్ ఎంత వ‌ర‌కు ఉన్నార‌నేదే మ‌రోసారి ఆయ‌న‌కు అధికారం ద‌క్క‌డంపై ఆధార‌ప‌డి వుంటుంది.