2024 టార్గెట్ వీరిది.. 2029 ఆశలు వారికి

2024లో జగన్ ను కొట్టేయ్.. 2029లో ఆ సామ్రాజ్యం నీదే… ఇదీ ఇప్పుడు కమ్మని వ్యూహం. జనసేన అధిపతి పవన్ కైనా అదే సూత్రం, జగన్ చెల్లెలమ్మ షర్మిలకు అయినా అదే గేలం. నిజానికి…

2024లో జగన్ ను కొట్టేయ్.. 2029లో ఆ సామ్రాజ్యం నీదే… ఇదీ ఇప్పుడు కమ్మని వ్యూహం. జనసేన అధిపతి పవన్ కైనా అదే సూత్రం, జగన్ చెల్లెలమ్మ షర్మిలకు అయినా అదే గేలం. నిజానికి దీని వెనుక వున్నది ఒంటరిగా జగన్ ను ఢీ కొట్టలేని నిస్సహాయత. బలహీనత. ఇటు పవన్ అటు షర్మిల, కుదిరితే ఇంకెవరైనా అందరూ కలిసి జగన్ ను తలో వైపు నుంచి ముట్టడించి బలహీనుడిని చేస్తే, అప్పుడు వీరాధివీరుడిలా తెలుగుదేశం పార్టీ వెళ్లి, అధికారాన్ని కైవసం చేసుకుంటుంది.

సరే, అయితే మాకేంటీ? అని పవన్ నో, షర్మిలనో అడిగితే.. 2029 మీదేగా.. ఈ 2024లో మీరు మరీ జగన్ ను ఓడించి అధికారంలోకి వచ్చేంత బలంగా లేరు. కానీ 2029 నాటికి మీకు ఆ బలం వచ్చేస్తుంది అంటోంది చంద్రబాబు ను ఎలాగైనా అధికారంలోకి తేవాలని పచ్చ తోరణం కట్టుకున్న మీడియా.

కావాలంటే ఈ వాక్యాలు చూడండి

‘’…2024 ఎన్నికల్లో షర్మిల వల్ల ఉపయోగం పెద్దగా ఉండకపోవచ్చును గానీ 2029 ఎన్నికల నాటికి కాంగ్రెస్‌ను బతికించుకోవచ్చునని ఆ పార్టీ అధిష్ఠానం కూడా అభిప్రాయపడుతోంది. రాష్ట్ర రాజకీయాలలో జగన్‌ బలంగా ఉన్నంత కాలం కాంగ్రెస్‌కు భవిష్యత్తు ఉండదన్నది బహిరంగ రహస్యమే. ఈ కారణంగా 2024లో చంద్రబాబు అధికారంలోకి రావడం తమ పార్టీకి అవసరమేనని కాంగ్రెస్‌ నాయకులు భావిస్తున్నారు. షర్మిలకు వయసు ఎడ్వాంటేజ్‌ కూడా ఉంది. ఈ కారణంగానే 2029 ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ రోడ్‌ మ్యాప్‌ రూపొందించింది. ..’’

ఎంత అద్భుతంగా వున్నాయి ఈ పలుకులు… 2024లో చంద్రబాబు అధికారంలోకి రావడం తమ పార్టీకి అవసరం అని కాంగ్రెస్ భావిస్తోందట.

అబ్బ..ఎంత గొప్పటి భావన.

షర్మిలకు ఇంకా వయస్సు వుంది కనుక 2024 వదిలేసి 2029 కి టార్గెట్ చేసుకోవచ్చునంట. అంటే గత నాలుగున్నరేళ్లుగా సర్వశక్తులు ఒడ్డి పోరాడుతున్న తెలుగుదేశం పార్టీ, తన మీడియా సాయంతో నిత్యం జగన్ మీద బురద జల్లుతూ, వ్యక్తిత్వ హనానికి తెగబడుతూ, అసలు జగన్ పాలన అంటేనే దారుణం, ఘోరం,అత్యంత ప్రమాదకరం అనే భావనను జనాల్లోకి చొప్పించడానికి కిందా మీదా అయిపోతున్న చంద్రబాబు అండ్ కో, ఇదంతా చేస్తున్నది కేవలం అయిదేళ్ల అధికారం కోసమేనా? 2024 నుంచి 2029 వచ్చేసరికి అధికారం వదిలేసి, ‘రండమ్మా..రండి.. పవన్ బాబూ, షర్మిలమ్మా వచ్చి ఏలుకోండి’ అని వదిలేస్తారా? మీకు వయస్సు వుందమ్మా, నాకు అయిపోయిందమ్మా.. అని చంద్రబాబు బంగారు పళ్లెంలో పెట్టి పవన్ (నాయుడు)కో, షర్మిల (రెడ్డి) కో అధికారం అందించేస్తారా. రాజకీయాల గురించి ఏబిసిడి లు కూడా తెలియని వారు సైతం ఇది నమ్మే విషయమేనా?

షర్మిల కన్నా, పవన్ కన్నా చిన్న వయసు వున్న లోకేష్ ఇప్పుడు అధికారం తనకు వద్దు అని 2034 వరకు వేచి వుండొచ్చు కదా? ఎందుకు పాదయాత్ర చేస్తున్నారు. అధికారం కోసం కాదా? చంద్రబాబు ముఖ్యమంత్రి అయినా, తన అధికార వారసత్వం లోకేష్ ఇవ్వకుండా 2024లో జగన్ ను ఓడించడానికి సాయపడ్డారు అని పవన్ కో, షర్మిల కో ఇచ్చేస్తారా?

కేవలం ఇలాంటి కబుర్లు చెప్పి పవన్ ను, షర్మిలను జగన్ పైకి ఉసిగొల్పడం అన్నది కేవలం తమ అధికారసాధనకు తప్ప వేరు కాదని చెప్పగలరా?

ఇలాంటి ఆణిముత్యాల లాంటి వ్యాసాలు వండి వారుస్తున్న వారికి సమాధానం చెప్పడానికి ఎక్కడి నుంచో అక్షరాలు అరువు తెచ్చుకోనక్కరలేదు. అదే వ్యాసం లో వున్న ఈ కింది వాక్యాలు గమనిస్తే చాలు. ఏమిటా వాక్యాలు?

‘’..తాము ఏం మాట్లాడినా చెల్లుబాటవుతుందని, ప్రజలు అమాయకంగా నమ్మేస్తారని కొంత మంది నాయకులు భ్రమల్లో బతికేస్తుంటారు. ప్రజల్లో ఇప్పుడు చైతన్యం పెరిగింది. పబ్లిక్‌ మెమరీ షార్ట్‌ అని అంటారు. అయితే ఇప్పుడు సోషల్‌ మీడియా పుణ్యమా అని నాయకులు గతంలో ఏం మాట్లాడిందీ, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నదీ వెంటవెంటనే సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి…’

ఇందులో నాయకులు.. మాట్లాడడం అనే పదాలను, మీడియా.. వ్యాసాలు వండి వార్చడం అని మార్చుకుంటే చాలు.

అంతే కదా, ఇదే పవన్ మీద ఒకప్పుడు ఇదే మీడియా రాసిన వార్తలు గుర్తులేవా? రేపు ఒక్క రోజు అయినా పవన్ కానీ షర్మిల కానీ చంద్రబాబుకు వ్యతిరేకంగా పదునైన విమర్ళలు చేసి చూడమనండి..’అబ్ ఆయేగా మజా’.