వైసీపీ అమోఘ‌మైన తెలివితేట‌లు.. ముచ్చ‌టేస్తోంది!

ఏపీ అధికార పార్టీ వైసీపీ అమోఘ‌మైన తెలివితేట‌ల్ని చూస్తుంటే ముచ్చ‌టేస్తోంది. వైఎస్ జ‌గ‌న్ సార‌థ్యం వ‌హిస్తున్న పార్టీకి ఈ మాత్రం నాలెడ్జ్ ఉండడంలో ఆశ్చ‌ర్యం లేద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ప్ర‌భుత్వం చేయాల్సిన ప్ర‌క‌ట‌న వైసీపీ…

ఏపీ అధికార పార్టీ వైసీపీ అమోఘ‌మైన తెలివితేట‌ల్ని చూస్తుంటే ముచ్చ‌టేస్తోంది. వైఎస్ జ‌గ‌న్ సార‌థ్యం వ‌హిస్తున్న పార్టీకి ఈ మాత్రం నాలెడ్జ్ ఉండడంలో ఆశ్చ‌ర్యం లేద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ప్ర‌భుత్వం చేయాల్సిన ప్ర‌క‌ట‌న వైసీపీ చేసింది. అయితే ఈ ప్ర‌క‌ట‌న గురించి ప్ర‌చారం చేసుకోక‌పోవ‌డం కాస్త ఆశ్చ‌ర్యం కలిగిస్తోంది.

విశాఖ‌ రుషికొండ మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది. వారాహి యాత్ర‌లో భాగంగా రుషికొండ స‌మీపానికి ప‌వ‌న్‌క‌ల్యాణ్ వెళ్లి సంద‌ర్శించారు. రుషికొండ‌లో విచ్చ‌ల‌విడిగా నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా అక్ర‌మ నిర్మాణాల‌ను చేప‌డుతున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. దీనివ‌ల్ల ప‌ర్యావ‌ర‌ణం విధ్వంసం అవుతోంద‌ని విమ‌ర్శించారు. ప‌వ‌న్‌కు మంత్రి రోజా గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారు. న్యాయ‌స్థానాల‌కు లేని అభ్యంత‌రం నీకెందుక‌ని ఆమె నిల‌దీశారు. కేవ‌లం 130కి పైగా చెట్ల‌ను తొల‌గించి, 13 వేల మొక్క‌ల పెంప‌కాన్ని చేప‌ట్టి ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడుతున్న‌ట్టు రోజా వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో వైసీపీ అధికారిక ట్విట‌ర్ ఖాతా నుంచి  రుషి కొండ‌పై ట్వీట్ వెలువ‌డింది. అదేంటంటే….”ఉత్త‌రాంధ్ర‌ను అభివృద్ధి చేసేందుకు జ‌గ‌న్‌… విశాఖ‌ను ప‌రిపాల‌న రాజ‌ధానిగా ప్ర‌క‌టించి రుషికొండ‌పై స‌చివాల‌యం నిర్మిస్తున్నారు. దీన్ని టీడీపీ దుష్ప్ర‌చారం చేస్తోంది. ఇది చూస్తుంటే ఉత్త‌రాంధ్ర అభివృద్ధి చెంద‌టం ఆ పార్టీకి ఇష్టం లేద‌నిపిస్తోంది” అని వైసీపీ ట్వీట్ చేయ‌డం గ‌మ‌నార్హం. మ‌రో ట్వీట్‌లో ప‌వ‌న్‌ను వెట‌క‌రిస్తూ ఆయ‌న కొండ‌ను త‌వ్వి ఎలుక‌ను ప‌ట్టుకున్నాడంటూ వ్యంగ్య కార్టూన్‌ను వైసీపీ పోస్టు చేయ‌డం విశేషం.  

అయితే ఇక్క‌డ ప్ర‌ధానంగా చ‌ర్చ‌నీయాంశ‌మైన అంశం ఏంటంటే… రుషికొండ‌పై ఏపీ ప్ర‌భుత్వం స‌చివాల‌యం నిర్మాణంపై ప్ర‌క‌ట‌న చేయ‌క‌పోవ‌డం. అధికారంలో ఉన్న వైసీపీ రుషికొండ‌పై స‌చివాల‌యం నిర్మిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించ‌డం వెనుక రాజ‌కీయ కోణం వుంద‌ని చెప్పొచ్చు. 

ఇప్ప‌టికే సుప్రీంకోర్టులో మూడు రాజ‌ధానుల వ్య‌వ‌హారంపై విచార‌ణ న‌డుస్తోంది. ఈ స‌మ‌యంలో రుషికొండ‌పై స‌చివాల‌యం నిర్మాణం గురించి ప్ర‌భుత్వం ప్ర‌క‌ట‌న చేయ‌డం కోర్టు ధిక్క‌ర‌ణ కిందికి వ‌స్తుంద‌నే భ‌యం క‌నిపిస్తోంది. మ‌రోవైపు విశాఖ‌కు ప‌రిపాల‌న రాజ‌ధాని వ‌స్తుంద‌నే ప్ర‌క‌ట‌న ద్వారా రాజ‌కీయ ప్ర‌యోజ‌నం పొందాల‌నే తాప‌త్ర‌యం వైసీపీలో క‌నిపించింది. అందుకే వైసీపీ తెలివి తేట‌లు చూస్తుంటే ముచ్చ‌టేస్తోంద‌నే కామెంట్స్ వినిపిస్తున్నాయి.