తుపాకి దెబ్బకు కాకులు ఎగిరిపోయినట్లు సోషల్ మీడియా నుంచి వైకాపా అనుకూల హ్యాండిల్స్ ఎగిరిపోయాయి. దానికి చాలా కారణాలు వున్నాయి. పార్టీని నమ్ముకున్న, అభిమానించే, హార్డ్ కోర్ ఫ్యాన్స్ ను వదిలేసుకోవడం. డబ్బులు ఇచ్చి సోషల్ మీడియా జనాలను అపాయింట్ చేసుకోవడం. కేసులు పడినప్పుడు సోషల్ మీడియా హ్యాండిల్స్ కు అండగా నిలబడకపోవడం. పైగా కూటమి అధికారంలోకి వచ్చింది కనుక, ఏం పెడితే ఏం వస్తుందో అన్న భయం.
కానీ పాయింట్ టు పాయింట్ మాట్లాడితే, పాయింట్ టు పాయింట్ ఎత్తి చూపితే ఏమీ కాదు. దుర్భాషలు ఆడితే, తప్పుడు ప్రచారం చేస్తే, కావాలని అసభ్యకరమైన భాష వాడితే అప్పుడు సమస్య. అసలు విషయం వివరించే సరైన సోషల్ మీడియా హ్యాండిల్ నే ఇప్పుడు వైకాపా కు కరువైంది. అటు తెలుగుదేశం వైపు చూస్తే పలు డిజిటల్ పోర్టల్స్ హ్యాండిల్స్, పగలు రాత్రి నిర్విరామంగా పదునైన జర్నలిస్ట్ ల మాదిరిగా పనిచేసే హార్డ్ కోర్ అభిమాన హ్యాండిల్స్.. ఇంకా.. ఇంకా.
ఇప్పుడు వైకాపా కు కావాల్సింది బలమైన సోషల్ మీడియా డెస్క్. పార్టీ అభిమానం వున్న వారిని సమీకరించి, వారికి సోషల్ మీడియాలో ఎలా వుండాలో శిక్షణ ఇవ్వాల్సి వుంది. ఆరోపణలను, విమర్శలను బలంగా ఎలా తిప్పి కొట్టాలో నేర్పాల్సి వుంది. దేశ విదేశాల్లో వున్న హార్డ్ కోర్ అభిమానులను సమీకరించి, వారిని మళ్లీ వైకాపా బాటలోకి తెచ్చుకొవాల్సి వుంది.
ఎన్నికల ముందు జూనియర్ సజ్జల సారథ్యంలో వైకాపా సోషల్ మీడియా అంటే కేవలం బురద వేయడం అనే తీరుగా నడిచింది తప్ప, సహేతుకమైన, సవివరమైన సమర్ధన లేకపోయింది. ఇప్పటికైనా అలాంటి మెకానిజమ్ ను తెచ్చుకొకపోతే, తప్పుడు ప్రచారాలే నిజమైన ప్రచారాలుగా చలామణీ అవుతాయి.
తెలుగుదేశం ఎకరా వెయ్యి వంతున లీజుకు తీసుకుని ఎక్కడిక్కడ భవనాలు కట్టుకుంది. వైకాపా అదే చేసింది. కానీ వైకాపాదే తప్పు అన్నట్లు ప్రచారం సాగుతోంది. అదేమని అడిగితే, తాము చేస్తే మీరు చేస్తారా? అనే ఎదురుదాడి వస్తోంది.
అందువల్ల వైకాపా ఇప్పుడు పార్టీ కన్నా ముందుగా సోషల్ మీడియా వింగ్ ను పటిష్టం చేయాల్సి వుంది.