వైఎస్సార్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పవర్ గేమ్ స్టార్ట్ చేశారు. ఇందుకు పార్టీ ప్లీనరీని వేదికగా చేసుకున్నారు. ఎన్నికలకు రెండేళ్లు ముందుగానే జగన్ సమరశంఖం పూరించారు. మరోవైపు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విలవిలలాడుతున్నారు. మహానాడు సక్సెస్ మూణ్ణాళ్ల ముచ్చటైంది. ప్లీనరీ విజయం ముందు మహానాడు తేలిపోయింది. రెండింటిని పోల్చి చూస్తూ…. జగన్ సక్సెస్ అయ్యారనే మాట వినిపిస్తోంది.
జగన్ అంటే ఇదే. ప్రత్యర్థుల అంచనాలకు అందని రీతిలో అతని పవర్ గేమ్ ప్లాన్ వుంటుంది. ఇంత కాలం రాజకీయాల్లో చంద్రబాబు మహామేధావి అని, మైండ్‌గేమ్ ఆడడంలో ఆయనకు సాటి వచ్చే నాయకులెవరూ లేరని ప్రత్యర్థులు కూడా చెప్పేవాళ్లు.
ఎన్నికల్లో ఏదో ఒకటి చేసి చంద్రబాబే అధికారంలోకి వస్తారని ప్రత్యర్థులు భయపడేవాళ్లు. దీన్నిబట్టి చంద్రబాబు మైండ్‌గేమ్ ఏ స్థాయిలో భయపెట్టేదో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా గతం. మైండ్‌గేమ్‌ను తలదన్నే పవర్‌గేమ్ వచ్చింది. అది జగన్ రూపంలో. లక్ష్యం కోసం తన పని తాను చేసుకుపోవడం, ఎవరినీ లెక్క చేయకపోవడం జగన్ పవర్‌గేమ్‌లో ప్రధాన లక్షణాలు.
జగన్ పవర్ గేమ్ ముందు, చంద్రబాబు మైండ్‌గేమ్ ఎటు పోయిందో దానికే తెలియదు. వామ్మో జగన్ అనే రీతిలో రోజురోజుకూ అతని వ్యూహాలు, ప్రతివ్యూహాలు వున్నాయి. ప్రత్యర్థులకు నిద్ర లేకుండా చేయడమే పవర్ గేమ్ లక్షణం. ప్రత్యర్థులు ఊపరి తీసుకోకుండానే ఆటను మొదలు పెట్టడం పవర్ గేమ్‌లో కీలకాంశం. 2019 ఎన్నికలకు ఏడాదిన్నర ముందే ఎన్డీఏ నుంచి టీడీపీ బయటికి వచ్చేలా జగన్ పవర్ గేమ్ ఆడారు.
ఇందులో చిక్కుకుని చంద్రబాబు అనవసరంగా ఎన్డీఏ నుంచి బయటికి రావడమే కాకుండా, ప్రధాని మోదీకి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా తిరిగేంతగా శత్రుత్వం పెంచడంలో జగన్ సక్సెస్ అయ్యారు. ఇదే జగన్ పవర్ గేమ్ మంత్రం. దాని ఎఫెక్ట్ చంద్రబాబును ఇప్పటికీ వెంటాడుతోంది. చంద్రబాబును కనీసం దరిదాపుల్లోకి కూడా రాకుండా బీజేపీ అడ్డుకుంటోంది.
అలాగే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ నిస్సహాయుడిని చేయడంలో జగన్ విజయం సాధించారు. బాబుకు అనుకూలమైన చీఫ్ సెక్రటరీని, ఇతరత్రా ఉన్నతాధికారులను మార్చడం వెనుక జగన్ పవర్ గేమ్ ఫలితాలే. 2019లో ఎన్నికలు జరగక ముందే చంద్రబాబు ఓడిపోతారనే సంకేతాల్ని జనంలోకి జగన్ తీసుకెళ్లగలిగారు. అందుకే అంత దారుణమైన పరాజయం.
2024 ఎన్నికలకు జగన్ వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నారు. జగన్‌ను ఏ విధంగా టార్గెట్ చేయాలో చంద్రబాబు ఇంకా ఓ నిర్ణయానికి రాలేకున్నారు. తనను అనుసరించడం తప్ప చంద్రబాబుకు మరో మార్గం లేకుండా జగన్ చేస్తున్నారు. తన మ్యానిఫెస్టోను 95 శాతం అమలు చేశానని, రానున్న రెండేళ్లలో మిగిలిన 5 శాతాన్ని పూర్తి చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్తానని జగన్ ధీమాగా చెబుతున్నారు.
తన పాలనను తప్పు పడుతున్న చంద్రబాబు… ఒకవేళ అధికారంలోకి వస్తే పేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు మంగళం పాడతారా? అని ప్రశ్నిస్తున్నారు. టీడీపీకి ఓటు వేయడం అంటే సంక్షేమానికి వ్యతిరేకంగా ఓటు వేయడమే అని జగన్ అంటున్నారు.
రెండేళ్లకు ముందుగానే తన పార్టీ ప్రజాప్రతినిధులను, కార్యకర్తలను, వాలంటీర్లను జనం వద్దకు పంపారు. జనం సమస్యల్ని అడిగి తెలుసుకోవాలని ఆదేశించారు. ఒక్క మాటలో చెప్పాలంటే చాలా ముందుగానే ఏపీ సమాజాన్ని వైసీపీ చుట్టుముట్టింది. మరో పార్టీకి అవకాశం ఇవ్వనంతగా జనంతో మమేకం అయ్యేలా జగన్ ప్లాన్ చేశారు.
టీడీపీ మాత్రం మహానాడు సక్సెస్ అయ్యిందనే ఆనందంలోనే వున్నారు. మినీ మహానాడు అంటూ కార్యకర్తల్ని ఒక చోటికి రప్పించుకుని చంద్రబాబు బాదుతున్నారు. ఇదే జగన్, చంద్రబాబు గేమ్ ప్లాన్‌లలోని తేడా.
తమ నాయకుల్ని జనం వద్దకు వెళ్లాలని జగన్ ఆదేశిస్తే, తన వద్దకు కార్యకర్తల్ని రప్పించడంలోనే చంద్రబాబు మునిగి తేలుతున్నారు. కాలం చెల్లిన గేమ్ ప్లాన్‌లతో చంద్రబాబు అధికారం కోసం పోరాడుతున్నారు. కొత్త గేమ్‌ని, నిబంధనల్ని సృష్టించి జగన్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. దీంతో జగన్ పవర్ గేమ్ ఆడుతుంటే చంద్రబాబు, లోకేశ్ ప్రేక్షకపాత్ర పోషించాల్సి వస్తోంది.
ఇక పవన్‌కల్యాణ్ ఉనికిలోనే లేకపోవడం గమనార్హం. ఎత్తుకు పైఎత్తు వేసిన వారినే విజయం వరిస్తుంది.