ప్రపంచంలో పేరెన్నికగన్న నేతల భద్రత ఎప్పటికీ ప్రశ్నార్థకంగానే మిగిలిపోతోంది. దేశాలు వేరైనా, పరిస్థితులు ఏవైనా.. తుపాకీ తూటాలకు నేతలు నేలకొరగడం సంభవించగల అంశంగానే నిలుస్తోంది. చరిత్రను చూస్తే.. తిరుగులేని నాయకత్వ లక్షణాలు ఉన్న వారు, దేశాలనే కదిలించగల నేతల ప్రాణాలను తుపాకీలు తీసిన సందర్భాలు ఉన్నాయి. ఆ జాతులకే కంటతడిని పెట్టించి, ఆ దేశాల గమనాలనే మార్చేసిన ఉదంతాలు ఇవి.
జపాన్ మాజీ ప్రధాని షిజో అబే ను ఒక దుండగుడు, ఒక జపనీయుడే పొట్టన పెట్టుకున్నాడు. మాజీ ప్రధాని అయినప్పటికీ.. జపాన్ ప్రభావశీల నేతల్లో ఒకరిగా చరిత్రలో స్థానం సంపాదించి, తన ఉనికిని చాటుకుంటున్న షిజోను చాలా సులువుగా కాల్చి చంపేశాడు ఒక అనామకుడు. జాతీయ నేతల ప్రాణాలను ఇంతే సులవుగా తీసిన సందర్భాలు చరిత్రలో రక్తపుమరకల్లా చెరిగిపోవు. ఆ జాబితాను ఒకసారి ప్రస్తావిస్తే..
అబ్రహం లింకన్..
అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో … బానిసత్వానికి చరమగీతం పాడిన నేత. జీవితంలో ఎన్నో ఒడిదుడులకు తట్టుకుని అమెరికా అధ్యక్ష స్థానాన్ని అలకరించిన నేపథ్యం లింకన్ ఇది. నల్లవాళ్లను బానిసలుగా చేర్చి, వారిని జంతువుల తరహాలో ట్రీట్ చేస్తున్న స్వదేశీ విధానాన్నే తప్పు పట్టిన పాలకుడు. బానిసత్వాన్ని రద్దు చేస్తూ చట్టం చేశాడు. అధ్యక్షుడు చేసిన చట్టాన్ని దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకించాయి.
నల్లవాళ్లను బానిసలుగా, జంతువుల్లా చేసుకుని వారి చేత పనులు చేయించుకోవడం, బానిసలే ప్రధానంగా కార్మికులుగా ఉండే అమెరికా దక్షిణాది రాష్ట్రాలు లింకన్ నిర్ణయాన్ని వ్యతిరేకించగా.. వారిని అదుపు చేయడానికి అంతర్యుద్ధానికి కూడా వెనుకాడలేదు. బలప్రయోగం ద్వారా బానిసత్వాన్ని రద్దు చేయించిన తన బలాన్ని చూపించిన లింకన్ తుపాకీ తూటాల ముందు నిలవలేకపోయారు. 1865లో లింకన్ హత్య జరిగింది.
మహాత్మాగాంధీ…
భారత స్వతంత్ర పోరాటంలో కీలక పాత్ర పోషించి జాతిపితగా నిలిచిన మహాత్మగాంధీ తను కలలు గన్న స్వతంత్ర భారతదేశంలో బతకనివ్వలేదు భారతీయులు. స్వతంత్ర భారతావనిని కలలుగన్న గాంధీని తుపాకీ తో బలిగొన్నారు.
గాంధీని చంపినవాడికి కూడా దేశభక్తుడిగా కీర్తించే కీర్తనలు ఈ మధ్యకాలంలో మరింత ఎక్కువ కావడం మరో విషాదం.
జాన్ ఎఫ్ కెన్నడీ
అబ్రహం లింకన్ హత్యకు గురి అయిన 98 సంవత్సరాల తర్వాత అమెరికాలో మరో అధ్యక్షుడిపై తూపాకీ గుళ్ల వర్షం కురిసింది. అమెరికాకు ప్రియమైన ప్రెసిడెంట్ గా నిలిచిన జాన్ ఎఫ్ కెన్నడీ 1963లో దారుణ హత్యకు గురయ్యారు.
అమెరికాలో విస్తృతమైన గన్ కల్చర్ కు అక్కడి అధ్యక్షుల ప్రాణాలు తీయడం కూడా పెద్ద కష్టం కాదని అలా దశాబ్దాల కిందటే రుజువైంది.
ఇందిరాగాంధీ
మూకలోంచి వచ్చే అగంతకులు కాల్చి చంపితే అదో ఎత్తు. అయితే నమ్మి పెట్టుకున్న భద్రతాదళాలే ఇండియన్ ఐరన్ లేడీని పొట్ట పెట్టుకున్నాయి. ఇప్పటి వరకూ దేశ చరిత్రలో ఒకే ఒక్క మహిళా ప్రధాని అయిన ఇందిర కు దేశ రక్షణ కోసం తీసుకున్న నిర్ణయాలే శాపంగా మారాయి. సిక్కు సెక్యూరిటీ సిబ్బంది ఇందిరను అమె నివాసంలోనే కాల్చి చంపి ప్రతీకారం తీర్చుకున్నాయి.
తను తీసుకున్న నిర్ణయం దేశం కోసం అనే ధీమాతో ఉన్న ఇందిర నమ్మకాన్ని సొంత భద్రతా సిబ్బందే వమ్ము చేసి, వంచనకు పాల్పడి దారుణంగా హతమార్చింది.
రాజీవ్ గాంధీ
అప్పటి వరకూ నేతలను చంప లక్ష్యంతో తుపాకీలు ఎన్నో పేలాయి. అయితే ప్రపంచంలోనే తొలిసారి ఆత్మాహుతి దళాన్ని తయారు చేసుకున్న లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈళం -ఎల్టీటీఈ తమ వ్యూహాలను తమకు నచ్చని నేతల పై ప్రయోగించింది.
ఇందులో భాగంగా భారత ప్రధాని రాజీవ్ గాంధీని తమిళనాట మానవబాంబుతో హతమార్చింది. శ్రీలంక అధ్యక్షుడు ఒకరిని కూడా ఎల్టీటీఈ ఇదే పద్ధతిలో హతమార్చింది.
బెనజీర్ భుట్టో
దాదాపు 15 యేళ్ల క్రితం పాకిస్తాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్య జరిగింది. అధికారం చేపట్టే లక్ష్యంతో పాక్ లో అడుగుపెట్టిన భుట్టో తనయ పాల్గొన్న బహిరంగ సభలో భారీ పేలుడుతో ఈ పాక్ మాజీ ప్రధానితో పాటు అనేకమంది మరణించారు.
ఇంకా ఎందరో!
కేవలం రాజకీయమైన పదవుల్లో ఉన్న నేతలే కాదు.. తమ పిలుపుతో లక్షలమంది ప్రజలను, అనేక మెదళ్లను ప్రభావితం చేయగలిగిన వారు కూడా తుపాకీ తూటాలకు బలయ్యారు. వారిలో అమెరికా మానవహక్కుల ఉద్యమకారులు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, మాల్కం ఎక్స్ తో సహా అనేక మంది నేతలున్నారు.