చిత్తూరు జిల్లా కుప్పంలో నారా చంద్రబాబునాయుడిని రాజకీయంగా అంతం చేయడానికి సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పంతం పట్టారు. ఎస్వీ యూనివర్సిటీలో చదువుకునే రోజుల నుంచి చంద్రబాబు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య వైరం కొనసాగుతోంది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆ వైరం మరింత పెరిగింది.
ఈ నేపథ్యంలో కుప్పంలో చంద్రబాబును ఓడించి తీరాలన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పట్టుదలకు వైఎస్ జగన్ ప్రోత్సాహం, తనయుడు పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి సహకారం తోడైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పంలో టీడీపీకి నామరూపాలు లేకుండా చేయడంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్‌రెడ్డి విజయం సాధించారు. కుప్పంలో విజయం వైసీపీకి ఇచ్చిన జోష్ అంతాఇంతా కాదు. తాజాగా 175కు 175 ఎమ్మెల్యే స్థానాల్లో గెలవడం అసాధ్యం కాదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిలుపు ఇవ్వడం వెనుక కుప్పం విజయం ఇచ్చిన భరోసానే అని చెప్పక తప్పదు.
ఇప్పుడు పెద్దిరెడ్డి పూర్తిగా కుప్పంపై దృష్టి పెట్టారు. ఇటీవల కుప్పం నియోజకవర్గానికి చెందిన టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తిరుపతికి తరలివచ్చి పెద్దిరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరాయి. కుప్పంలో చంద్రబాబును ఓడించడానికి పెద్దిరెడ్డికి ఓ ఆయుధం చిక్కింది. తాను ముఖ్యమంత్రిగా తప్ప, అసెంబ్లీలో అడుగు పెట్టనని చంద్రబాబు శపథం చేయడాన్ని పెద్దిరెడ్డి తనకు సానుకూలంగా మలుచుకోనున్నారు.
బాబు శపథం ఆయన పాలిట శాపంగా మార్చేందుకు పెద్దిరెడ్డి వ్యూహం రచిస్తున్నారు. మళ్లీ అధికారంలోకి తామే వస్తామని, ఇక చంద్రబాబు ఎప్పటికీ అసెంబ్లీలో అడుగు పెట్టలేరని, అలాంటి నాయకుడికి ఓట్లు వేసినా వృథా అనే నినాదాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లేందుకు పెద్దిరెడ్డి ప్లాన్ చేస్తున్నారు. బాబుకు ఓటు -కుప్పానికి చేటు, కుప్పం వాణి అసెంబ్లీలో వినిపించాలంటే ఎమ్మెల్సీ, వైసీపీ కుప్పం ఇన్చార్జ్ భరత్‌కు ఓటు వేయాలని ఆయన పిలుపునివ్వనున్నారు.
ఈ నినాదాలతో కుప్పంలో బాబుకు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి పెద్దిరెడ్డి సిద్ధమవుతున్నారు. ఇందుకు పక్కా ప్రణాళికలను పెద్దిరెడ్డి సిద్ధం చేస్తున్నారు. ఇలా అన్ని వైపుల నుంచి చంద్రబాబును చుట్టుముట్టి కుప్పంలో ఓడించాలనే పెద్దిరెడ్డి ప్రయత్నాల్ని ఎవరూ కొట్టి పారేయలేరు. పెద్దిరెడ్డి పంతం పడితే… తప్పక సాధిస్తారనే ప్రచారం వుంది.
అంతెందుకు కుప్పం మున్సిపాల్టీలో, అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా సర్పంచులు, ఎంపీటీలు, జిల్లా పరిషత్ స్థానాలను వైసీపీ కైవసం చేసుకోవడం వెనుక పెద్దిరెడ్డి వ్యూహమే కారణం. 2024లో చంద్రబాబును కూడా రాజకీయంగా మట్టి కరిపిస్తానని పెద్దిరెడ్డి అంటే ఎలా కాదనగలం? ఓటమికి చంద్రబాబు అతీతుడా? 1983లో చంద్రగిరిలో ఓడిపోవడం వల్లే కదా ఆయన కుప్పానికి వలస వెళ్లింది.
ఎన్టీఆర్, ఇందిరాగాంధీల కంటే చంద్రబాబు ప్రజాదరణ నాయకుడేమీ కాదని పెద్దిరెడ్డి భావన. తనను పెద్దిరెడ్డి ఏం చేస్తారోననే భయం మాత్రం చంద్రబాబుకు నిద్రలేని రాత్రుల్ని మిగిల్చుతోంది.
సొదుం రమణ