అంత దమ్ముగా చెప్పగల మరో నాయకుడు ఉన్నారా?

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. చేసిన ప్రకటన చాలా విశిష్టమైనది. దేశం మొత్తం మీద ఏ నాయకుడిని తీసుకున్నప్పటికీ.. ఇంత ధైర్యంగా ఇలాంటి మాటలు చెప్పగల ధీమా ఎవరికి ఉంటుంది? ఒక్కరంటే ఒక్క…

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. చేసిన ప్రకటన చాలా విశిష్టమైనది. దేశం మొత్తం మీద ఏ నాయకుడిని తీసుకున్నప్పటికీ.. ఇంత ధైర్యంగా ఇలాంటి మాటలు చెప్పగల ధీమా ఎవరికి ఉంటుంది? ఒక్కరంటే ఒక్క నాయకుడిని మనం చూపించగలమా? అనే ఆశ్చర్యం కలుగుతోంది.

‘‘జగనన్న మేనిఫెస్టోలో చెప్పింది చేశాడన్న నమ్మకం కలిగితేనే వచ్చే ఎన్నికల్లో తమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి’’ అని చెప్పడం అంటే మాటలు కాదు. అలా చెప్పగల నిబద్ధత తమకు ఉందని జగన్ ప్లీనరీ సభాముఖంగా ప్రకటించారు. నిజానికి అలా ప్రకటించడానికి అవసరమైనది కేవలం నిబద్ధత మాత్రమే కాదు, ఎంతో ధైర్యం కావాలి. అసలే.. ఆరు హామీలు మినహా మేనిఫెస్టో మొత్తం అమలు చేశానని జగన్ అంటోంటే.. అదంతా పెద్ద బూటకం అన్నట్టుగా ప్రచారం చేయడానికి విపక్షాలు అత్యుత్సాహం కనబరుస్తూ ఉన్నాయి.

ఇలాంటి సమయంలో.. మీ ఇంటికి సంక్షేమం అందిందనే అభిప్రాయం ఉంటేనే మళ్లీ నాకు ఓటేయండి.. లేకపోతే అక్కర్లేదు.. అనే మాటను.. ఒక నాయకుడు చెప్పడం ఇవాళ్టి రాజకీయాల్లో అనూహ్యం. ఈ ఒక్కమాటకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డిని అభినందించాల్సిందే.

మేనిఫెస్టో అనేది రాజకీయ పార్టీలకు భగవద్గీత, ఖురాన్, బైబిల్ లాంటిది. అందులో ప్రతి అంశాన్ని వారు నమ్మవలసిందే, ఆచరించవలసిందే. ఇదంతా నిబద్ధత ఉండే నాయకులకు సంబంధించిన వ్యవహారం. అయితే మేనిఫెస్టో అనే ముసుగులో ప్రజలను మభ్యపెట్టడానికి నానా మాటలూ అల్లి చెప్పేసి, వారి ఓట్లను కొల్లగొట్టిన తర్వాత.. ఆ మేనిఫెస్టోను పూర్తిగా మరిచపోయే దుర్మార్గపు ఆలోచనలు ఉండే నాయకులకు అది ఎంత గొప్పదైనా పట్టదు. వారు ఆచరించే వేదం ఒకే ఒక్కటి.. అది వంచన.

తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఏం హామీ ఇచ్చిందో.. మేనిఫెస్టోలో కనిపిస్తుంది. కానీ ఆ మేనిఫెస్టోను వారు పార్టీ వెబ్సైట్ నుంచి రిమూవ్ చేశారంటే.. ఎంత చవకబారు మనుషులో అర్థమవుతుంది.

అధికారంలోకి రావడానికి ముందు తాము ఇచ్చిన మేనిఫెస్టోను ఇవాళ ప్రజలు చూస్తే గనుక.. తమను ఛీత్కరించుకుంటారనే భయం.. వారితో ఆ పని చేయించింది.

వైఎస్ జగన్ అలా కాదు.. తాను విడుదల చేసిన మేనిఫెస్టోను మూడేళ్ల పరిపాలన తర్వాత.. చేయలేకపోయిన హామీలతో కలిపి ఒక కరపత్రంగా ముద్రించి.. ప్రజలకు అందించారు. 95 శాతం పనులు చేశాం అనే జగన్ హామీని ఎద్దేవా చేసే కుహనా నాయకులు.. ఆ మేనిఫెస్టోకాపీని దగ్గర పెట్టుకుని ఫలానా పని జరగలేదు అని దమ్ముంటే మాట్లాడాలి. అంతేతప్ప నేలబారు విమర్శలు తగవు.

మళ్లీ ఒకసారి ప్రస్తావించాల్సిందే.. ‘మేనిఫెస్టోలో చెప్పింది చేశాడన్న నమ్మకం కలిగితేనే నాకు మళ్లీ ఓటు వేయండి..’ అని చెప్పడానికి ఏ రాజకీయ నాయకుడికైనా చాలా దమ్ము కావాలి. జగన్ వద్ద అది ఉంది!