ఏపీలో వైసీపీ సర్కార్ మూడేళ్ళ పాలన పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తాజాగా జరిగిన ప్లీనరీలో నాడు నేడు పధకం గురించి మంత్రులు, కీలక నేతల నుంచి ముఖ్యమంత్రి జగన్ దాకా గొప్పగా చెప్పుకున్నారు. నిజానికి జనాలు కూడా నాడు నేడు పేరిట పాఠశాలల అభివృద్ధి అన్న కాన్సెప్ట్ ని వైసీపీ ఏలుబడిలోనే ఎక్కువగా వింటున్నారు.
ఈ విషయంలో తమ క్రెడిట్ ని చాటుకోవడానికి వైసీపీ చూస్తుంది. దీనిలో తప్పులేదు కూడా. అయితే మూడేళ్ళ తరువాత తాపీగా జగన్ ప్లీనరీ స్పీచ్ మీద కౌంటర్ ఇస్తూ మాజీ విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడారు. నాడు నేడు పథకం తమదని ఆయన చెప్పడమే ఇక్కడ విశేషం.
తాను విద్యాశాఖ మంత్రిగా ఉండగా దానికి డిజైన్ చేశానని గంటా అంటున్నారు. ముఖ్యమంత్రి ప్లీనరీ వేదికగా నాడు నేడు గురించి ఎలా చెప్పుకుంటారు అని గంటా నిలదీస్తున్నారు. ఆ పథకాన్ని సృష్టించింది, రూపకల్పన చేసింది, నిధులను తెచ్చింది తాను విద్యా శాఖ మంత్రిగా ఉండగానే అని గంటా చెబుతున్నారు.
గంటా చెప్పినది ఓకే అనుకున్నా గత మూడేళ్ళుగా ఆయన ఎందుకు మాట్లాడలేదు అన్నదే ఇపుడు వైసీపీ నేతలు అడుగుతున్న ప్రశ్న. నాడు నేడు గురించి ప్లీనరీ కంటే ముందు ఎన్నో సార్లు వైసీపీ నేతలు చెబుతూ వచ్చారు. గత మూడేళ్ళుగా ఈ పధకం వైసీపీదే అని వారు మారుమోగేలా చేశారు. మరి ఆదిలోనే ఇది మా పథకం అని చెప్పకుండా ఇపుడు గంటా రియాక్ట్ కావడమే ఆశ్చర్యంగా ఉందని అంటున్నారు.
అంటే గంటా రాజకీయ కారణాల వల్లనే నాడు సైలెంట్ గా ఉండి ఇపుడు టీడీపీ లో మళ్ళీ యాక్టివ్ అయ్యారు కాబట్టి వైసీపీ మీద ఈ కామెంట్స్ చేస్తున్నారా అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇది మా పధకం అని గంటా చెప్పడం ద్వారా టీడీపీకి రాజకీయ మైలేజ్ ని కలిగించాలని చూస్తున్నారు అని వైసీపీ నేతలు అంటున్నారు.
నిజానికి నాడు నేడు మా పథకం అని ఏనాడో చంద్రబాబు అయినా దమ్ముగా చెప్పాల్సింది కదా అని కూడా వైసీపీ నేతలు అంటున్నారు. నాడు-నేడు పథకం తమ బిడ్డ అని, దానిని తమదిగా చెప్పుకోవడం జగన్ విచక్షణకే వదిలేస్తున్నాను అని గంటా మాట్లాడుతున్నారు.