టీడీపీని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆత్మరక్షణలోకి నెట్టేశారు. వైఎస్సార్సీపీ ప్లీనరీలో పార్టీ అధినేతగా వైఎస్ జగన్ సుదీర్ఘ ప్రసంగం చేశారు. మొదటి రోజు ప్రారంభ ఉపన్యాసం చప్పగా సాగిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. మాతృమూర్తి విజయమ్మ హృదయాల్ని తాకే ప్రసంగం ముందు… తనయుడు జగన్‌తో పాటు మిగిలిన వారి ప్రసంగాలు కూడా తేలిపోయాయి. రెండోరోజు శాశ్వత అధ్యక్షుడిగా తనను ఎన్నుకున్న తర్వాత జగన్ ఇచ్చిన ముగింపు ప్రసంగం మాత్రం శ్రేణుల్లో సమరోత్సాహాన్ని నింపింది.
ముఖ్యంగా 175కు 175 స్థానాల్లో మనమే గెలిచితీరాలనే దిశానిర్దేశం వైఎస్సార్సీపీ శ్రేణుల్ని బాగా ఆకట్టుకుంది. అసాధ్యం అనేది లేనేలేదనే జగన్ పిలుపు… ఔను కదా అని పార్టీ శ్రేణుల్లో కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ కలిగించింది. జగన్ ఏమన్నారంటే…
‘ 175కి 175 స్థానాలూ మనం గెలవాలి. అది అసాధ్యమేమీ కాదు. సుసాధ్యమే. మనం చేస్తున్న మంచిని కుప్పం ప్రజలు కూడా ఆశీర్వదించారు. పంచాయతీ ఎన్నికల్లో, మండల పరిషత్, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేశాం. అదే రీతిలో 175 స్థానాలు గెలవాలన్నదే మన లక్ష్యం’ అని సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు.
వైఎస్సార్సీపీ శ్రేణుల్ని అధినేత జగన్ పాజిటివ్ కోణంలో ఉత్సాహం నింపారు. అసాధ్యమనేది ఏదీ లేదని, చేయాల్సిందల్లా పరిశ్రమే అని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. మరోవైపు తాము అధికారంలోకి వస్తామని ధీమాగా ఉన్న టీడీపీ శ్రేణుల్లో వైఎస్సార్సీపీ ప్లీనరీ నీళ్లు చల్లింది. సునామీలా తరలివెళ్లిన జనాన్ని చూసి టీడీపీ తీవ్ర నిరుత్సాహానికి గురైంది.
జగన్‌పై ప్రజాదరణ ఏ మాత్రం తగ్గలేదని వైఎస్సార్సీపీ ప్లీనరీ చెప్పకనే చెప్పింది. మరోవైపు 175కు 175 స్థానాల్లో మనమే గెలవాలనే జగన్ లక్ష్యం నిర్దేశించడం … టీడీపీని భయపెడుతోంది.
చివరికి కుప్పం కూడా గెలుస్తామనే ధీమా వైఎస్సార్సీపీలో కనిపించడం ప్రత్యర్థిని కలవరపాటుకు గురి చేస్తోంది. జగన్ చెబుతు న్నట్టు… చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో స్థానిక సంస్థలన్నింటిని వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. కుప్పంలో గెలుపు…అసాధ్యం కాదనే ధీమాతో వైఎస్సార్సీపీ శ్రేణులు రేపటి నుంచి కదనరంగంలో దూకనున్నాయి.
ఈ లెక్కన రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరుగుతుందోననే ఆందోళన టీడీపీ శ్రేణుల్ని ఆత్మరక్షణలో పడేస్తోంది. వైఎస్సార్సీపీ మైండ్ గేమ్ ఆడుతుంటే, టీడీపీ శ్రేణులకు ఏం చేయాలో దిక్కుతోచని స్థితి. జగన్ మాటలు ప్రాక్టికల్‌గా ఉండగా, బాబువన్నీ ఊహాలోకంలో విహరిస్తున్నట్టుగా ఉన్నాయి. అందుకే టీడీపీ శ్రేణుల్లో భయం.