జగన్ స్ట్రాటజీ వర్కవుట్ అయినట్లేనా?

ఆంధ్ర సిఎమ్ జగన్ రాజకీయాల్లో ఆరితేరిపోయారు. ఎప్పుడు ఏ పావు ను ఎలా నప్పాలో ఫుల్ గా నేర్చేసుకున్నారు. ఒక పక్క అమరావతి కేసు అప్పీల్ కు వెళ్లారు. మరోపక్కన వివేకానంద రెడ్డి హత్య…

ఆంధ్ర సిఎమ్ జగన్ రాజకీయాల్లో ఆరితేరిపోయారు. ఎప్పుడు ఏ పావు ను ఎలా నప్పాలో ఫుల్ గా నేర్చేసుకున్నారు. ఒక పక్క అమరావతి కేసు అప్పీల్ కు వెళ్లారు. మరోపక్కన వివేకానంద రెడ్డి హత్య కేసును పక్క రాష్ట్రానికి బదిలీ చేసారు. ఇంకోపక్క కేంద్ర లిక్కర్ స్కామ్ మీద రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు వినిపిస్తున్నాయి. 

అమరావతి..పోలవరం మీద జగన్ చెప్పినవన్నీ నిజాలు కాదని ఎల్లో మీడియా కోడై కూస్తోంది. ధరల పెంపును కేంద్రం ఖాతా నుంచి రాష్ట్రం ఖాతాలోకి తొసి, ఆందొళన చేసే పని తెలుగుదేశం పెట్టుకుంది. ఇలా అనేక వ్యవహారాలు కందిరీగల మాదిరిగా ముసురుకుంటున్నాయి.

ఇలాంటి టైమ్ లో అన్నీ పక్కకు పోయాయి. మెడికల్ అండ్ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్చి వైఎస్ పేరు పెట్టడం మీద ఇప్పుడు నానా యాగీ నడుస్తోంది చానెళ్లు, పత్రికలు, సోషల్ మీడియా మొత్తం దీని మీద పడింది. దీని మీద ప్రతిపక్షాలు ఎంత యాగీ చేసినా, జగన్ మొండికేసినా, అది ఒప్పయినా, తప్పయినా కామన్ ఓటర్ కు పట్టే సమస్య కాదు. అందువల్ల జగన్ చిద్విలాసంగా చోద్యం చూస్తుంటారు తప్ప వేరు కాదు.

తెలుగుదేశం అనుకూల మీడియా, ఆ పార్టీ కన్నా ఎక్కువ రంకెలు వేస్తోంది. తెలుగుదేశం అధికారంలోకి వస్తే అస్సలు వైఎస్ పేరు లేకుండా చేస్తారని, విగ్రహాలు తీసేస్తారని, అసలు జిల్లానే లేకుండా చేస్తారని రంకెలు వేస్తోంది. అసలు ఇలా రంకెలు వేయడం ఎందుకు? చేసేది చేయడమే. జగన్ ఒకటంటే…చంద్రబాబు రెండు అనొచ్చుగా. జగన్ కూడా దానికి సిద్దపడే వున్నారు కానీ లేదనలేదు కదా? మరి ఈ బెదిరింపులు ఎందుకు?

మొత్తం మీద ప్రతిపక్షాలకు, ఎల్లో మీడియాకు కావాల్సినంత సరుకు దొరికింది. కానీ సమస్య ఒక్కటే ఇది అస్సలు కామన్ మాన్ కు ఇంట్రస్టెడ్ సబ్జెక్ట్ కాదు. దీనికి టీఆర్పీలు రావు. ఓట్లు చెదరవు. కానీ ఒక్కటే అసలు వ్యవహారాలు అన్నీ పక్కకు పోయాయి. అదే జగన్ కు కావాల్సింది. అదే జరుగుతోంది ఇప్పుడు. 

మహా అయితే పేపర్లలో నాలుగు వార్తలు, చానెళ్లలో నాలుగు డిస్కషన్లు..సోషల్ మీడియాలో నాలుగు వందల కామెంట్లు. జగన్ వీటికి లొంగే ఘటం కాదు. అతని టార్గెట్ వేరే. అదే అసలు స్ట్రాటజీ.