Advertisement

Advertisement


Home > Politics - Analysis

పేరుకే పవన్ పార్టీ చీఫ్ ...భారమంతా నాదెండ్లదే

పేరుకే పవన్ పార్టీ చీఫ్ ...భారమంతా నాదెండ్లదే

జనసేన పార్టీ పెట్టిందెవరు? పవన్ కళ్యాణ్. ఆ పార్టీ అధ్యక్షుడు ఎవరు? పవన్ కళ్యాణ్. అలాంటప్పుడు పార్టీ బాధ్యతలు పూర్తిగా పవన్ కళ్యాణ్ చూసుకోవాలి కదా. పార్టీని ముందుకు నడిపించాలి కదా. రాష్ట్రమంతా అలుపెరగకుండా తిరగాలి కదా. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా ఇప్పటికే అన్ని పార్టీలు ఎన్నికల మూడ్ లోకి వచ్చేశాయి. కానీ పవన్ కు ఒక్కడికే ఇంకా ఎన్నికల మూడ్ లోకి వచ్చే సమయం ఆసన్నం కానట్లుగా కనబడుతోంది. గత ఎన్నికల్లో పార్టీ పరంగా, వ్యక్తిగతంగా దారుణంగా విఫలమయ్యాడు. అయినా మనిషి మారలేదు. వైఫల్యం నుంచి పాఠం నేర్చుకోలేదు.

ఎన్నికలు దగ్గర పడుతున్నా పార్టీ ఎదగడంలేదనే అభిప్రాయం ఉంది. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన, పార్టీ పెట్టిన కొత్తలో పార్ట్ టైం పొలిటీషియన్ అనే పేరు తెచ్చుకున్నాడు. కానీ ఇన్నేళ్లయినా ఆ పేరు చెరిపేసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. పవన్ కల్యాణ్ వీకెండ్ పొలిటిషియన్ అని వైఎస్ఆర్‌సీపీ నేతలు విమర్శలు చేస్తూంటారు. పార్ట్ టైమ్ పాలిటిక్స్‌తో ఆయన ఏం చేయగలరని సెటైర్లు వేస్తూంటారు. దీనికి కారణం ఆయన వ్యవహారశైలి. ఎప్పుడో ఓ సారి వచ్చి ప్రసంగించడం ..  ఓ రైతు భరోసా యాత్ర పెట్టుకోవడం చేస్తున్నాడు కానీ నిరంతరం ప్రజల్లో ఉండే ప్రయత్నం చేయడంలేదు.

ఎన్నికల వేడి పెరిగిపోతున్న సమయంలో కూడా బస్సు యాత్ర ప్రకటించి కూడా వాయిదా వేసుకున్నాడు. అలా చేస్తున్న రాజకీయం వల్ల జనసైనికుల్లోనూ సీరియస్ నెస్ తగ్గిపోతోంది. మీడియాలో, సోషల్ మీడియాలో జనసేన పేరుతో ఉనికి కనిపిస్తోంది కానీ .. క్షేత్ర స్థాయి పోరాటాల్లో మాత్రం వెనుకబడిపోయాడు. అసలు పవన్ కల్యాణ్ అధికారం కోసం ప్రయత్నిస్తున్నాడా? లేకపోతే కనీసం చట్టసభలో అడుగుపెడితే చాలనుకుటున్నాడా? అన్నది ఆయన పార్టీ నాయకులకే అర్ధం కావడంలేదు. సినిమాలు చేయనే చేయనని చెప్పిన పవన్ కల్యాణ్ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత సినిమా తన బతుకుదెరువు అని చెప్పి మళ్లీ సినిమాలు చేస్తున్నాడు. పార్టీని నెంబర్ టూ అయిన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌కు అప్పగించాడు. మొత్తం పార్టీని నాదెండ్ల నడుపుతున్నారు.

ఇక ఎన్నికల వేడి తగులుతున్నా పవన్ కల్యాణ్‌లో పెద్దగా మార్పు లేదు. ఆయన చాలా సినిమాల కమిట్ మెంట్స్ పెట్టుకున్నాడు. వాటిని చేస్తూనే పార్టీకి సమయం కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పవన్ సినిమాల బిజీలో ఉంటే నాదెండ్ల మనోహర్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. కానీ ఎవరైనా పవన్‌ ను పట్టించుకుంటారు కానీ నాదెండ్లను పెద్దగా పట్టించుకోరు కదా. అయినప్పటికీ శక్తివంచన లేకుండా నాదెండ్ల మనోహర్ పార్టీ కోసం తిరుగుతున్నారు. అయితే పవన్ తిరగడం వేరు.. నాదెండ్ల తిరగడం వేరు. పవన్ కల్యాణ్  ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు కోరుకుంటున్నారు. పవన్ కూడా తమదే అధికారమని గంభీరమైన ప్రకటనలు చేస్తున్నాడు. 

అయితే ఆయన పార్టీ అధికారంలోకి రాకపోయినా పర్వాలేదు కానీ ఆయన చట్టసభల్లోకి అయినా అడుగు పెడతాడా? అనే సందేహం కలుగుతోంది. గత ఎన్నికల్లో సామాజిక వర్గ పరంగా కూడా ఎంతో ప్లస్ అవుతుందని పోటీ చేసిన భీమవరం, గాజువాకల్లోనే కలసి రాలేదు. కాబట్టి ఈ సారి ఆయన మరింత పకడ్బందీగా వ్యవహరించాలి. కానీ ఇప్పటివరకు అలాంటి ప్రయత్నాలు చేస్తున్న దాఖలాలు లేవు. పవన్ కల్యాణ్‌కు ప్రజలు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఓటేసిన తరవాత ఆయన సినిమాలు చేసుకుంటారనే డౌటే ఎక్కువ మందికి ఉందని రాజకీయవర్గాల అభిప్రాయం. జనసైనికులదీ అదే అభిప్రాయమేనని చెబుతున్నారు. 

పవన్ కల్యాణ్ ఇప్పటికైనా వెంటనే పూర్తి స్థాయిలో రాజకీయాలు ప్రారంభించకపోతే ప్రజల్లో సీరియస్ నెస్ పోతుంది. ఆరేడు శాతం ఓట్లు సాధించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. చట్టసభల్లో సీట్లు ఉంటేనే విలువ. ఓట్లు చీలనిచ్చేది లేదని చెబుతున్నందున టీడీపీతో  పార్టీతో పొత్తు పెట్టుకున్నా..  ప్రజల్లో నమ్మకం కలిగించాలన్నా...  బలంగా ఉన్నామని చెప్పి ఎక్కువ సీట్లు పొందాలన్నా రాజకీయంగా వేగం పుంజుకోవాలి. లేకపోతే జనసేనాని రాజకీయం పార్ట్ టైమ్ అని జనసైనికులు కూడా నమ్మే పరిస్థితి వస్తుంది. పవన్ కల్యాణ్ పేరు చెబితే లక్షల మందికి వైబ్రేషన్. ఏ హీరోకూ లేనంత ఫాలోయింగ్. 

ఆ ఫాలోయింగ్ సినిమా వల్ల మాత్రమే రాలేదు. ఆయన సామాజిక స్పృహ, రాజకీయ ఆలోచనలు, సమాజానికి మంచి చేద్దామన్న ఓ పట్టుదల కారణంగా కూడా అభిమానులు ఉన్నారు. అన్యాయాలపై ఎదిరించాలన్న ఓ ఫైర్ పవన్ కల్యాణ్‌లో కనిపిస్తుంది. అందుకే యువరాజ్యంతో రాజకీయాల్లోకి వచ్చి.. జనసేనతో కంటిన్యూ అవుతున్నారు. కానీ ఆయన రాజకీయ ప్రయాణంలో అన్నీ వైఫల్యాలే. ఎందుకిలా జరుగుతోంది?. రాజకీయంగా పవన్ కల్యాణ్ సూపర్ హిట్లు ఎందుకు కొట్టలేకపోతున్నారు? ఇది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?