అన్ని వర్గాల వారు సిఎమ్ పదవిని అధిరోహించారు. కాపులకు రాలేదు అన్నది చిరకాలంగా ఆ వర్గంలో వినవస్తున్నా ఆవేదన, అందుకోసమే చిరంజీవి ప్రజారాజ్యం స్ధాపించి ప్రయత్నించారు. నిజంగా ఆ రోజుల్లో అదో ప్రభంజనం. ఎన్టీఆర్, వైఎస్, జగన్‌ల మాదిరిగా చిరంజీవి చేసిన యాత్రలకు అప్పట్లో విశేష జనాదరణ. తిరుపతి సభకు వచ్చిన జనం చూస్తే వైరి రాజకీయ పక్షాల గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి.
కానీ… సాక్షాత్తూ చిరంజీవినే కాపుల ఓట్లు పుష్కలంగా వున్న వెస్ట్ గోదావరిలో ఓడిపోయారు. కాపుల ఓట్లు గట్టిగా వున్న అనకాపల్లి నుంచి పోటీ చేసి అరవింద్ ఓడిపోయారు. ప్రజారాజ్యం పార్టీ పరాజయం పొందింది.
పార్టీ పెట్టడమే రాంగ్ టైమ్ అని, పొలిటికల్ వాక్యూమ్ లేని టైమ్ లో, వైఎస్ మీద అపరమిత అభిమానం ప్రజల్లో వున్న సమయంలో కొత్తగా ఎంట్రీ ఇవ్వడం తప్పు అయింది విశ్లేషణలు వెల్లువత్తాయి. దాని తరువాత అయిదేళ్లు పార్టీని నిబద్దతో నడపడం అంత సులువు కాదని గ్రహించి చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసారు. తాను కేంద్ర మంత్రి అయ్యారు. రాష్ట్ర విభజన తరువాత తను కూడా రాజకీయాలు వదిలేసారు.
మరి కాపులకు ఎవరు నేత? ముద్రగడ లాంటి వారు లోకల్ గా మాత్రమే నాయకులు, రాష్ట్ర స్థాయిలో జనాలను చైతన్య పరచి, ముందుకు నడిపించి, తాను ముందు నడచి సిఎమ్ కాగలది ఎవరు? ఎవరూ కనిపించలేదు. నిజానికి పొలిటికల్ వాక్యూమ్ వుందో లేదో అర్ధం కాని సమయంలో 2014లో పవన్ కళ్యాణ్ ఉవ్వెత్తున లేచారు. కానీ ఆ సమయంలో పోటీకి దిగలేదు. ఎందుకంటే అప్పటికి పార్టీ నిర్మాణమే జరగలేదు కనుక. తెలుగుదేశం పార్టీకి, భాజపాకు మద్దతు పలికారు. ఆ కూటమి అధికారంలోకి వచ్చింది.
2019 ఎన్నికల టైమ్ లో అనూహ్యంగా ఆ కూటమికి పవన్ బై బై చెప్పి, చంద్రబాబు, లోకేష్, మోడీల మీద తీవ్రమైన విమర్శలు కురిపించి ఒంటరిగా బరిలోకి దిగారు. మళ్లీ అన్న చేసిన తప్పే..రాంగ్ టైమ్ లో రంగంలోకి దిగారు. జగన్ వేవ్ ఉవ్వెత్తున వున్న వేళ, ఓట్లను చీల్చాలన్న ఉద్దేశంతోనో, మరెందుకో అలా చేసారు. వైఎస్ టైమ్ లో మెగాస్టార్ ఓట్లను చీల్చడం ద్వారా వైఎస్ విజయం సాధ్యమైంది కదా, తను కూడా అలాగే చేయాలనే చంద్రబాబు ఎత్తుగడలో పవన్ పావుగా మారారనే అభిప్రాయాలు అంతటా వినిపించాయి.
అయితే ఆ ఓటమి తరువాత అన్న మాదిరిగా పార్టీని ఎక్కడా విలీనం చేయలేదు. అలా అని పార్టీని బలంగా నిర్మించే పనీ పెట్టుకోలేదు. నాదెండ్ల మనోహర్ కు పార్టీని నడిపే బాధ్యతలు అప్పగించి, తాను సినిమాల్లోకి వెళ్లారు మళ్లీ.
2024 ఎన్నికలు వస్తున్నాయి. ఇప్పుడు ఆంధ్రలో సరైన రాజకీయ వాక్యూమ్ వుంది. చంద్రబాబు పాలన చూసారు. జగన్ పాలన చూసారు. పవన్ పాలన చూడండి అని అడిగే అవకాశం వుంది. తనకూ ఒక అవకాశం ఇవ్వండి అని అడిగే చాన్స్ వచ్చింది. కచ్చితంగా ఓ రేంజ్ వరకు గెలుచుకునే అవకాశమూ వుంది. అందులో సందేహం లేదు.
కానీ మళ్లీ చిరంజీవి రాంగ్ టైమ్ లో పార్టీ పెట్టినట్లు, పవన్ రాంగ్ టైమ్ లో తెలుగుదేశంతో జత కట్టారు. అలా జత కట్టడం తెలుగుదేశానికి ప్రయోజనకరం, జగన్ కు ఇబ్బంది కరం అంటే ఎవరైనా ఒప్పుకుంటారు. కానీ పవన్ కు ఏమిటి ప్రయోజనం?
ఇదీ అసలు సిసలు ప్రశ్న. చంద్రబాబును 2024లో గద్దె ఎక్కించడం ద్వారా పవన్ సాధించేది ఏమిటి? కాపులకు ఒరిగేది ఏమిటి? జగన్ ను ఓడిస్తారు సరే. ఆల్ మోస్ట్ అవుటాఫ్ ది రేస్ లో వున్న చంద్రబాబు పార్టీకి సెలైన్ ఎక్కించి, గద్దె నెక్కించడం ద్వారా పవన్ సాధించేది ఏమిటి? అంటే ఇప్పుడు వున్న పరిస్థితుల్లో ఒంటరిగా పోటీ చేస్తే జగన్ నే మళ్లీ సిఎమ్ అవుతారు అని పవన్ భావిస్తున్నారా? నిజమే అనుకుందాం. కానీ తెలుగుదేశం పార్టీ అవుటాఫ్ ది రేస్ అయిపోతుంది కదా? 2029 నాటికి జగన్.. పవన్ ముఖాముఖి తలబడే అవకాశం వస్తుంది కదా? మరి ఎందుకు పవన్ ఆ దిశగా ఆలోచించడం లేదు.
పోనీ ఇప్పుడు జగన్ పక్కకు వెళ్లిపోతే 2029 లో చంద్రబాబు కు దూరం జరిగి, ముఖాముఖి తలపడవచ్చు అని పవన్ భావిస్తున్నారా?
అది సాధ్యమేనా? ఎందుకు సాధ్యం కాదు? అంటే..
చంద్రబాబు పార్టీ లేకుండా 2029లో పవన్-జగన్ పోరాటానికి దిగితే తెలుగుదేశం మద్దతు దారులు తప్పని సరిగా పవన్ వెంట నిలవాల్సి వస్తుంది. మరో ఆప్షన్ వుండదు. ఎందుకంటే అప్పటికే చంద్రబాబు రాజకీయంగా రిటైర్ అవుతారు. జగన్ ధాటికి చాలా మంది అటు నుంచి ఇటు వస్తారు. అందువల్ల మిగిలిన వారు పవన్ వెంట వుండక తప్పదు. తెలుగుదేశం అనుకుల మీడియా పవన్ కు బాసటగా నిలవక తప్పదు.
కానీ ఇప్పుడు పరిస్థితి ఏమిటి?
తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు పవన్ అందిస్తున్న ఆక్సిజన్ విలువ ఇంతా అంతా కాదు. ఒక్కసారి జగన్ ను గద్దె దింపితే చంద్రబాబు, ఆయన వారసుడు లోకేష్, పార్టీ శ్రేణులు వీరవిహారం చేస్తాయి. ఏం చెప్పి 2029లో పవన్ వారికి దూరం అవుతారు? 2024లో చంద్రబాబు గురించి చెప్పినవి అన్నీ తప్పు అని చెప్పగలరా? లేదూ చంద్రబాబు ఈసారికి సిఎమ్ గా వుండు అని సింహాసనం పవన్ కు అందిస్తారా? లోకేష్ వుండగా బాలకృష్ణ ను, ఎన్టీఆర్, బంధువులు అందరినీ ఆమడ దూరంలో వుంచిన చంద్రబాబు కోరి పవన్ కు సింహాసనం అందిస్తారా? ఎంత మాట.. ఎంత మాట..
సరే, తెగించి పవన్ దూరం జరిగి పోరాడుతారే అనుకుందాం. ఒక్క గంట చాలు ఆ నిర్ణయం తీసుకున్న తరువాత తెలుగుదేశం అనుకుల మీడియా పవన్ ను ఎత్తి అవతల పెట్టడానికి. దాంతో జగన్ నే చాల లేకపోతున్నారు. పవన్ ఎంత?
మరి కాపుల ఆశలు నెరవేరేది ఎలా? తెలుగుదేశం కాపులకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వదు. కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ కూడా డిటో డిటో.. మిగిలిన ఆప్షన్ పవన్ మాత్రమే. ఆయన ఓ దశ, దిశ లేని విధంగా రాజకీయం చేస్తున్నారు. పైగా కాపులను ఒదిగి వుండమని, కమ్మవారితో కలిసి నడవమని, సుద్దులు చెబుతున్నారు. ఇక పవన్ ను కాపులు నమ్ముకుని ప్రయోజనం ఏమిటి?
వైకాపా బిసి జపం చేస్తోంది. తెలుగుదేశం కూడా అదే జపం చేస్తోంది. పవన్ కూడా కాపులు పెద్దన్నగా వుండి అందరితో కలిసి నడవాలంటున్నారు. అంతే కాదు 2024 ఎన్నికలు ముగియగానే మళ్లీ సినిమాల మీదకు వెళ్లడానికి రంగం ఇప్పటి నుంచి సిద్దం చేసుకుంటున్నారు. అంటే రాష్ట్రాన్ని చంద్రబాబుకో, జగన్ కో వదిలేయడానికి ముందే ఫిక్స్ అయిపోయారన్న మాట.
మరింక కాపు ముఖ్యమంత్రి అనే చిరకాల వాంఛ నెరవేరేది ఎలా? ముఫై నలభై సీట్లతో ఇప్పుడు సరిపెట్టుకున్న పవన్, పోనీ 2029 నాటికి బలంగా మారిపోయి, సగం సీట్లు డిమాండ్ చేసి, సగం కాలం సిఎమ్ పోస్ట్ తీసుకునే రేంజ్ కు వెళ్తారని అనుకుందామా? జగన్ లాంటి మొండి మనిషినే మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్న కమ్మ సామాజిక వర్గ అష్ట దిగ్బంధనాన్ని పవన్ ఒక్క రోజు అయినా తట్టుకోగలరా?
అందుకే..కాపులు ఇక తమ వర్గానికి సిఎమ్ పదవి.. జీవితకాలం లేటు అనుకోవాల్సిందే.