రా…కదిలి రా అని టీడీపీ నేతలు ఎంత మొత్తుకుని అరిచినా కార్యకర్తలు మాత్రం కదల్లేదు. దీంతో చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు (జీడీనెల్లూరు)లో మంగళవారం సాయంత్రం పాల్గొన్న చంద్రబాబు బహిరంగ సభ జనం లేక అట్టర్ ప్లాప్ అయ్యింది. కీలకమైన ఎన్నికల సమయంలో తన సభకు జనం చాలా తక్కువ హాజరుకావడంతో తన పార్టీ నేతలపై చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్ర వ్యాప్తంగా రా… కదిలిరా పేరుతో బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో జీడీనెల్లూరు సమీపంలోని రామానాయుడుపల్లె బస్టాప్ వద్ద చేపట్టిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. జీడీనెల్లూరు టీడీపీ ఇన్‌చార్జ్ థామస్ వ్యవహార శైలి నచ్చక టీడీపీ కార్యకర్తలెవరూ సభకు రాలేదని తెలిసింది.
జీడీనెల్లూరు నియోజకవర్గం వ్యాప్తంగా మండల నాయకులను సమన్వయం చేసుకోవడంలో థామస్ విఫలమయ్యారు. దీంతో తమకెందుకులే అని టీడీపీ మండల నాయకులు కార్యకర్తలను మీటింగ్‌కు తరలించడానికి ఆసక్తి చూపలేదనే ప్రచారం జరుగుతోంది. బాబు సభకు మొత్తం 10 వేల నుంచి 14 వేల మంది వచ్చి వుంటారంటే, సభ ఎంత అట్టర్ ప్లాప్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. సభలో 9,600 కుర్చీలు వేశారు. కుర్చీలో కూచున్న వారు కాకుండా, చాలా తక్కువ మంది నిలబడి బాబు సభను మొక్కుబడిగా సాగించారు.
చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నుంచి కేవలం వెయ్యి మంది మాత్రం పాల్గొన్నట్టు టీడీపీ నేతలే తెలిపారు. సొంత జిల్లాలో తన సభ జనం లేక వెలవెల పోవడం ఒకింత అవమానంగా చంద్రబాబు భావిస్తున్నారు. ఊరికే స్టేజీపై నాయకులు ఉంటే సరిపోదని, వేదిక ముందు జనం లేకపోతే ఏం చేయాలని బాబు ఆగ్రహించినట్టు తెలిసింది.