నిజంగా దానయ్య గుండె ధైర్యాన్ని మెచ్చుకోవాలి. లేకపోతే ఏంటి.. పవన్ కల్యాణ్ లాంటి వ్యక్తిని హీరోగా పెట్టుకొని, తన సినిమాకు రిలీజ్ డేట్ ప్రకటించాడంటే అది గుండె కాదు, ఇంకేదో అయ్యుండాలి. ఇప్పుడిదే హాట్ టాపిక్.
పవన్ కల్యాణ్ ఎప్పుడు సెట్స్ పైకి వస్తాడో అతడికే తెలియదు. ఒకవేళ వచ్చినా ఏ సినిమాకు కాల్షీట్ ఇస్తాడో ఆ దేవుడికే తెలియాలి. ప్రస్తుతం పవన్ చేస్తున్న సినిమాలన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఇలాంటి టైమ్ లో ఓజీ సినిమా సెప్టెంబర్ 27వ వస్తుందంటూ దానయ్య ప్రకటించాడంటే ఆయన గుండె ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు.
ఓజీ సినిమా చాలా భాగం షూటింగ్ పూర్తయింది. పవన్ నటిస్తున్న మిగతా సినిమాలతో పోలిస్తే, ఇదే ముందుంది. ఆయన 20 రోజులు కాల్షీట్లు ఇస్తే బ్యాలెన్స్ పూర్తయిపోతుందని టాక్. అంతవరకు నిజమే. అంతమాత్రానికే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తే ఎట్లా? నిజంగా పవన్ ను సంప్రదించే ఈ తేదీ ప్రకటించారా లేక ఆయనపై ఒత్తిడి పెంచే ప్రయత్నమా..?
పవన్ కల్యాణ్ మామూలోడు కాదు. అతడిపై ఒత్తిడి పెంచుదామనుకుంటే అంతకంటే అమాయకత్వం ఇంకోటి ఉండదు. కాబట్టి కచ్చితంగా పవన్ ను సంప్రదించే డేట్ వేసి ఉంటారు. అయినప్పటికీ ఆ డేట్ కు సినిమా వస్తుందన్న గ్యారెంటీ లేదు.
కాకపోతే ఈ విషయంలో దానయ్య కాస్త ముందుచూపుతోనే వ్యవహరించాడు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు, ఆ తర్వాత పరిణామాల్ని లెక్కలేసుకొని దానయ్య ఈ డేట్ లాక్ చేశాడు. పైగా మంచి డేట్స్ అన్నీ ముందే రిజర్వ్ అయిపోతున్న నేపథ్యంలో.. ఓ తేదీని ముందుగానే ప్రకటిస్తే అలా పడి ఉంటుందనే ఆలోచన కూడా మంచిదే.
ఓజీ సినిమా చెప్పిన తేదీకి వస్తుందా రాదా అనేది కాలమే నిర్ణయిస్తుంది. ప్రస్తుతానికైతే పవన్ అభిమానులు ఈ పోస్టర్ తో పండగ చేసుకుంటున్నారు.