Advertisement

Advertisement


Home > Politics - Opinion

ఇది తెదేపాకి వరమా శాపమా?

ఇది తెదేపాకి వరమా శాపమా?

ఎప్పటినుంచో చంద్రబాబు చేస్తున్న రాక్షసతపస్సు ఫలించి బీజేపీ కనికరించి పొత్తుకి రెడీ అందని విశ్వసనీయ సమాచారం. అంతే కాదు పొత్తులో భాగంగా కమలనాథులు 6-10 ఎంపీ సీట్లడిగారని దానికి బాబు ఒప్పుకున్నాడని, అలాగే 12 వరకు ఎమ్మెల్యే సీట్లు కూడా అడిగారని తెలుస్తోంది. అన్నిటికీ బాబు దాదాపు సై అన్నట్టే అని చెబుతున్నారు. రేపే మీటింగు కూడానట. 

అయితే ఇది నిజమా లేక ఉత్తుత్తి పుకారా అనేది ఇంకా తెలియాలి. కాసేపు ఇది నిజమైతే పరిస్థితులు, పర్యవసానాలు ఏవిటో చూద్దాం. 

"ఈ రోజుల్లో రాజకీయం చెయ్యాలంటే సిద్ధాంతాలు, విలువలు పనికిరావయ్యా. అవసరాలను బట్టి ముందుకుపోవాలి". ఇది యాత్ర-2 ట్రైలరులో చంద్రబాబు పాత్ర చెప్పే డైలాగ్. 

పై వార్త నిజమైతే ఆ డైలాగుకి అనుగుణంగా ఇప్పటికీ అదే పద్ధతిలో "ముందుకుపోతున్న" వ్యక్తి చంద్రబాబు అనుకోవాలి. 

అప్పుడు చంద్రబాబు లెక్క అస్సలు అర్ధం కాదు. పోయిన 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశులో జనసేనకి వచ్చిన ఓట్ల శాతం సుమారు 7%. అదే బీజేపీకైతే 0.5%. మరి 0.5% ఓటర్లున్న బీజేపీకే 1-10 ఎంపీ సీట్లిచ్చేటట్టైతే మరి 7% ఓటర్లున్న జనసేనకు ఎన్నివ్వాలి? 

బాబుగారి డిస్పరేషన్ ఏ లెక్కలకి అందదు. కమలదళం కనికరించడమే ఎక్కువ.. సాష్టాంగ పడడమే అన్నట్టుంటుంది సన్నివేశం. అయితే కటాక్షించిన బీజేపీ ఇస్తున్నది వరమా, శాపమా? ప్రసాదమా, విషమా? కనీసం ఈ లెక్కన్నా వేసుకోకపోతే అంతకు మించిన మూర్ఖత్వం మరొకటి ఉండదు. 

ఎందుకంటే అడిగిన ఎంపీ సీట్లు ఇవి అని ఆ వార్త- అరకు, విశాఖ, రాజమండ్రి, కాకినాడ, నరసాపురం, ఏలూరు లేదా ఒంగోలు, హిందూపురం, అనంతపురం, తిరుపతి, రాజంపేట. ఇవన్నీ ఉన్నంతలో తెదేపా బలంగా ఉన్న స్థానాలు. వీటిని అడుగుతున్నారంటే అదేం పొత్తు? అసలు పొత్తు అంటే ఏంటి? ఇవతలి పార్టీ ఎక్కడ బలహీనంగా ఉందో అక్కడ బలాన్ని అందించే విధంగా అవతల పార్టీ ఉండాలి. అంతే కానీ తన బలాన్ని లాగేసుకునే పార్టీతో పొత్తేంటి? ఈ కనీసమైన కామన్ సెన్స్ కూడా లేకపోవడం శోచనీయమే కాదు శోకనీయం కూడా. 

అటు చేసి ఇటు చేసి ఇదేదో తెదేపాకి వెన్నుపోటు పొడవడానికి బీజేపీ వేస్తున్న ఎత్తుగడలా ఉంది. రేపు ఈ స్థానాల్లో తాము ఓడితే గెలిచేది వైకాపాయే కాబట్టి ఎప్పటిలాగానే తమకు పార్లమెంటులో మద్దతిచ్చే సామంత ప్రభుత్వం గెలిచినట్టు.  అలా కాకుండా తెదేపా ఓటర్లు నమ్మి గెలిపిస్తే అవి స్వచ్ఛంగా బీజేపీ స్థానాలే కనుక..అనవసరమనిపిస్తే పొత్తులేదూ గిత్తూ లేదు అని తెదేపాకి జెల్లకాయ కొట్టేసి మొహం చాటేయొచ్చు. 

అందుకే ఎక్కడ తెదేపా బలంగా ఉందో ఆ స్థానాలనే బీజేపీ అడుగుతోందని అనుకోవాలి. అంటే "శివ" సినిమాలో భవాని "ఈ స్టూడెంట్ లీడర్లు మనకి బలం అవ్వాలి కాని..మన బలం మీద వాళ్లు బ్రతకకూడదు" అంటాడు. సరిగ్గా అదే లెక్కలో కేంద్ర బీజేపీ ఉన్నట్టు. తమ బలాన్ని తెదేపాకి ఇవ్వడం కాదు..తెదేపా బలాన్నే బీజేపీ లాగేసుకుంటున్నట్టు. 

ఇదంతా నిజమై చంద్రబాబు ఈ పొత్తుకి ఒప్పుకుంటే అంతకంటే ఆత్మహత్య మరొకటి ఉండదు. అమాయకంగా కోరి కోరి పులిబోనులోకి దూరినట్టే. 

అవసరం లేనప్పుడు చంద్రబాబు మోదీని అనరాని మాటలు అన్నాడు బాబు. "మోదీ గో బ్యాక్" అన్నాడు. పెళ్ళాన్ని వదిలేసినవాడు జనాన్ని ఏం పట్టించుకుంటాడు అని కూడా అన్నాడు. 

2019లో తనకొచ్చిన సర్వేల ప్రకారం కాంగ్రెస్ గెలుస్తుందనుకుని పొత్తులో ఉన్న బేజేపీకి వెన్నుపోటు పొడిచేసి చేతులు కలిపాననే అసలు సత్యాన్ని చెప్పకుండా, స్పెషల్ స్టాటస్ ఇవ్వలేదు కాబట్టి విబేధించి బయటికి వచ్చేసానన్నాడు. ఇప్పుడు ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్ ఇస్తామని బీజేపీ చెప్పిందా? ఎందుకీ పొత్తు మరి? 

ఏమన్నా అంటే రేపు సంక్షేమపథకాలు నడపాలంటే కేంద్ర నిధులు కావాలి..కనుక పొత్తు లేకపోతే అది సాధ్యం కాదు కనుకనే ఈ పొత్తు అని బుకాయించొచ్చు. అదే నిజమైతే మరిప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి తొమ్మిది వేల కోట్ల నిధులు ఈ మార్చి లోపు ఇస్తున్నట్టు ప్రకటించింది కదా కేంద్రం? తమది "కాంగ్రెస్ ముక్త్ భారత్" నినాదం కాబట్టి తెలంగాణాని ఎండకట్టేయట్లేదు కదా. కనుక ఒకవేళ చంద్రబాబు పొత్తుకి కారణం "నిధులు" అని చెబితే మాత్రం తెలంగాణాని చూపించి ఎదురు ప్రశ్నించాలి. మరి ఈ పొత్తు దేనికి అంటే, ఒక్కటే... తాను మళ్లీ జైలుకి పోకూడదు.

చంద్రబాబు రాజకీయాలు ఎలా ఉంటాయంటే పదవి లేనప్పుడు అందరూ తనవాళ్లే. పదవుంటే మాత్రం ఎవరివైపూ కనీసం మొహం తిప్పి చూడడు.

గతంలో జూ.ఎంటీయార్ ని పదవి లేనప్పుడు అలాగే ఎన్నికల ప్రచారాలకి వాడుకుని తర్వాత కనీసం పట్టించుకోలేదు. ఆ చేదుని స్వయంగా చవిచూశాడు కనుకనే తారక్ ఎప్పటికీ దూరంగా ఉంటున్నాడు. 

సరిగ్గా అదే పద్ధతిని బీజేపీతో అవలంబిస్తున్నాడు బాబు. తనకి పదవున్నప్పుడు మోదీ కూడా గడ్డిపోచలా కనిపించాడు. పదవి లేకపోతే అతని కటాక్షం కోసం తపస్సు చేస్తున్నాడు. 

2019 ఎన్నికల ప్రచారంలో "చంద్రబాబు వెన్నుపోటు పొడవడంలో సిద్ధహస్తుడు" అని మోదీ తన ప్రసంగంలోనే చెప్పాడు.  కనుక ఆ వెన్నుపోటు రుచి చూసినవాడు ఏ లెక్కలోనైనా బాబుతో పొత్తుకి ఒప్పుకుంటాడని అనుకోలేం. అసలీ పొత్తే జరగని పని అని అనుకుంటే కొన్ని గంటల క్రితం ఈ వార్త గుప్పుమంది. ఇది పసుపుదళం పుట్టించి ప్రచారం చేస్తున్న వార్తలా అనిపిస్తోంది. ఎందుకంటే వాళ్లు అందులో సిద్ధహస్తులు. 

కనుక..ఈ పొత్తు వార్త నిజమా కాదా అనేది ఎలాగో కాసేపట్లో తెలుస్తుంది. నిజమయ్యుంటే ఈ పాటికి నేషనల్ మీడియాలో ఏదో ఒక మూల వచ్చుండేది. రాలేదు కాబట్టి ప్రస్తుతానికిది పుకారే అనుకోవాలి. ఒకవేళ పొత్తు నిజమైతే మాత్రం అందులో బీజేపీ ఆంతర్యం ఇక్కడ చెప్పిందే అవుతుంది. కచ్చితంగా బాబుకి వెన్నుపోటు పొడవడానికి తప్ప వెన్నుముకలో శక్తిని నింపడానికి మాత్రం అవ్వదు. 

హరగోపాల్ సూరపనేని

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?