కాపుల అసంతృప్తి.. భయం ఇప్పటివి కావు

టీడీపీతో పొత్తు పెట్టుకున్న పవన్​ కళ్యాణ్‌కు ఘోర అవమానం జరిగిందని కాపులు, జనసేన శ్రేణులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. పవన్​ కల్యాణ్​ టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి, సీట్లు పంపిణీ చేసుకున్న…

టీడీపీతో పొత్తు పెట్టుకున్న పవన్​ కళ్యాణ్‌కు ఘోర అవమానం జరిగిందని కాపులు, జనసేన శ్రేణులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. పవన్​ కల్యాణ్​ టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పటి నుంచి, సీట్లు పంపిణీ చేసుకున్న దగ్గర నుంచి జనసేన శ్రేణుల్లో, కాపు సామాజిక వర్గంలో అసంతృప్తి పెల్లుబుకుతోంది. ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. టీడీపీ పొత్తలో పవన్​ కళ్యాణ్​కు ఘోర అవమానం జరిగిందనే భావన వటవృక్షంలా పెరిగిపోయింది. 

కాపు సామాజిక వర్గానికి నాయకుడిగా చెలామణి అవుతున్న కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య మండిపడుతున్నారు. సీట్ల పంపకం పూర్తికాగానే ఆయన పవన్​కు లేఖ రాశారు. రేపు  అంటే 28న టీడీపీ–జనసేన ఉమ్మడి సభ జరగనున్న నేపథ్యంలో చంద్రబాబును ఉద్దేశించి జోగయ్య మరో బహిరంగ లేఖ రాశారు. అధికారంలో సగభాగం పవన్​ కళ్యాణ్​కు దక్కాల్సిందేనని కుండ బద్దలు కొట్టారు. కొన్ని కీలక అంశాలపై తన గళాన్ని విప్పారు. 

టీడీపీ–జనసేన సీట్ల పంపకం జరగ్గానే హరిరామ జోగయ్య పవన్​ ఉద్దేశించి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ సీట్ల ఒప్పందం కూడా పవన్ సమర్ధించుకుంటారా అని ప్రశ్నించారు. కేవలం 24 సీట్లకు పరిమితం కావటం పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఒకరు ఇవ్వడం మరోకరు దేహీ అనడం పొత్తు ధర్మం అనిపించుకుంటుందా అంటూ నిలదీసారు. జనసేన కు 24 సీట్లకు మించి నెగ్గగలిగే స్తోమత లేదా అంటూ ఫైర్ అయ్యారు. జనంలో జనసేన పరిస్థితి ఇంత హీనంగా ఉందా అంటూ జోగయ్య కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ పంపకం కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని పవన్ చెప్పగలరా అని జోగయ్య నిలదీసారు. సీట్ల పంపకం మిత్రపక్షాల మధ్య  ఏ ప్రాతిపదికన చేసారని ప్రశ్నించారు. అన్నికులాల జనాభా ప్రాతిపదికన  జరిగాయా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. 

వాస్తవానికి టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని పవన్​ నిర్ణయించుకున్నప్పుడే జనసేన నాయకులు, కార్యకర్తలు, పవన్​ అభిమానులు, ప్రధానంగా కాపులు అనుమానాలు, భయాలు వ్యక్తం చేశారు. అయితే జనసేనకు అధికారం దక్కాలంటే చంద్రబాబుతో పొత్తు తప్పనిసరి అని భావనను పవన్​ తన  సొంత సామాజిక వర్గంతో పాటు జనసేన పార్టీలోనూ నరనరాన నింపడంలో  సక్సెస్ అయ్యారు. 

టీడీపీతో పొత్తు తప్పదని పవన్ ఎప్పుడో చెప్పేశారు. అలాగే కాపు సామాజిక వర్గం తనకు అండగా నిలవలేదని పలుమార్లు బహిరంగసభల్లోనే అసంతృప్తి కూడా వ్యక్తం చేశారు. దీన్ని బట్టి చూస్తే కాపులు తనను సీఎం కావాలనుకుంటే తప్పనిసరిగా తన నిర్ణయాలకు అండగా నిలవాల్సిందేనన్న వాతావరణాన్ని పవన్ క్రియేట్ చేసేశారు. అనంతరం వ్యూహాత్మకంగా టీడీపీతో పొత్తు ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో కాపు సామాజిక వర్గం గతంలోలా చంద్రబాబుపై వ్యతిరేకతను కొనసాగిస్తుందా లేక పవన్ కు అధికారం కావాలి కాబట్టి ఓ అడుగు వెనక్కి తగ్గుతుందా అన్న చర్చ జరుగుతోంది. అలాగే కాపు సామాజిక వర్గం నుంచి పవన్ కు పూర్తి మద్దతు లభిస్తుందా లేక ఎప్పటిలాగే పార్టీల మధ్య కాపులు చీలిపోతారా అన్నది చూడాల్సి ఉంది.

గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు తమ కుల నాయకుడు సీఎం అవుతాడనే భావనలో తొలిసారి కాపులు ఐక్యత ప్రదర్శించారు. దీంతో టీడీపీ నష్టపోయింది. కాంగ్రెస్ కూడా కాపు ఓటు బ్యాంకును నష్టపోయింది. ఈసారి అదే కాపులు మరోసారి ఆయన సోదరుడు పవన్ కు అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. కానీ పవన్ చంద్రబాబుకు జై కొట్టడంతో కాపులు కొత్త దారులు వెతుక్కునే పరిస్థితి వచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అదే సమయంలో జనసేన కార్యకర్తలు కూడా డైలామాలో పడ్డారు.

2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు, లోకేష్ అవినీతిపరులని పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటున్నారు. బాలకృష్ణ జనసేన కార్యకర్తల గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటున్నారు. రెండు జెండాలను మోసేందుకు సిద్ధంగా తాము లేమని తమ దారులు తాము వెతుక్కుంటున్నట్లు సమాచారం. నాడు లోకేష్ పై పవన్ కళ్యాణ్ విరుచుకుపడ్డప్పుడు టీడీపీ వారితో సోషల్ మీడియా వేదికగా ఒక యుద్ధమే చేశామని పవన్ అభిమానులు చెబుతున్నారు. 

మరి నాడు లోకేష్‌, చంద్రబాబులను అవినీతిపరులుగా ముద్రవేసిన పవన్ కళ్యాణ్ నేడు ఏ రకంగా వారిని సమర్థిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి పవన్ టీడీపీ పొత్తుతో కాపులు మరోసారి ఆలోచనలో పడ్డారని అంటున్నారు. దానికి తగ్గుట్లుగానే పొత్తులో, సీట్ల పంపకంలో జనసేనకు, పవన్‌కు తీవ్ర అవమానం జరిగిందని ఫీలవుతున్నారు. ఇక మళ్లీ కాపులు చీలిపోతే మాత్రం వైసీపీ మరోసారి ఆ ఓటు బ్యాంకుతో అధికారంలోకి రావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.