ఆంధ్ర రాష్ట్రంలో కూడా మహిళలకు బస్ ఫ్రీ పద్దతి ప్రవేశ పెట్టే ఆలోచన తమకు వుందని తెలుగుదేశం పార్టీ నుంచి ప్రకటన వచ్చింది. ఇప్పటికే ఈ పద్దతి ప్రవేశపెట్టిన తెలంగాణలో నానా గందరగోళం జరుగుతోంది. ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మహిళలు శిగపట్లు పడుతున్నారు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు నానా బాధలు పడుతున్నారు. ఇంత గందరగోళానికి దారి తీసిన మహిళలకు బస్ ఫ్రీ అనేది ఆంధ్ర ఎన్నికల్లో హామీ అంశంగా మారితే స్పందన ఎలా వుంటుంది అన్నది పాయింట్.
ఇలాంటి హామీ ఇచ్చే తెలుగుదేశం పార్టీకి ఆటో డ్రైవర్లు అస్సలు సహకరించరు. ఎందుకంటే ఈ స్కీము వల్ల వచ్చే కష్టం, నష్టం వారికి బాగా అర్థం అయింది తెలంగాణ ఆటో సోదరులను చూస్తుంటే. పైగా జగన్ ఆటో డ్రైవర్లకు ఏటా పదివేలు ఇస్తున్నాడు. అదీ ఇదీ కలిసి ఆటో డ్రైవర్లను, వారి కుటుంబాలను తెలుగుదేశం పార్టీకి దూరం చేస్తాయి.
ఇక ఆర్టీసీ సిబ్బంది విషయానికి వస్తే, ఈ స్కీము వల్ల వస్తున్న తలకాయనొప్పులు వారికి తెలుసు. తెలంగాణలో ఏం జరుగుతోందో గమనిస్తున్నారు. పైగా జగన్ ఆర్టీసీని జాతీయం చేసారు. వాళ్లను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చారు. ఇప్పుడు ఈ స్కీము పెట్టి ఆర్టీసీని దెబ్బ తీసే ప్రయత్నం చేస్తారంటే వాళ్లు సహించలేరు. ఆ విధంగా ఆర్టీసీ సిబ్బంది, వారి కుటుంబాల ఓట్లు కూడా తెలుగుదేశం పార్టీకి దూరం అవుతాయి.
ఇక ఆర్టీసీ బస్సుల్లో రెగ్యులర్ గా ప్రయాణించే వారికి కూడా ఈ స్కీము నచ్చదు. ఎందుకంటే మహిళలకు ఫ్రీ ప్రయాణం కావడం వల్ల అవసరమై ప్రయాణించేవారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ తెలంగాణలో జరుగుతున్నవే. పత్రికల ద్వారా ఆంధ్ర జనాలు కూడా ఈ సమస్యలు చూస్తున్నారు. వింటున్నారు. అందువల్ల ఆ వర్గాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకత తప్పదు.
ఎటొచ్చీ ఫ్రీ సర్వీస్ అంటే మోజు పడేది, ఇష్టపడేది మహిళలే. అందువల్ల వారి ఓట్లు కాస్త గట్టిగానే తెలుగుదేశం పార్టీకి రావచ్చు.