ఒకప్పుడు రాజకీయాల్లో బాగానే వెలిగిన కాసాని జ్ఙానేశ్వర్ తరువాత వెనుక బడ్డారు. ఇటీవల మళ్లీ బయటకు వచ్చారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షపీఠం కట్టబెట్టడంతో కాస్త హల్ చల్ చేయడం ప్రారంభించారు. కానీ ఇప్పుడు మళ్లీ జంక్షన్ లోకి వచ్చేసారు. ఎటు వెళ్లాలో, ఏం చేయాలో తోచని పరిస్థితి. తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ నాయకులకు తెలంగాణలో భవిష్యత్ లేదని క్లారిటీ వచ్చేసినట్లే. ఇక ఎప్పటికీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల గోదాలోకి దిగదు. కేసీఆర్ పార్టీ భారాస వున్నంత వరకు అది గ్యారంటీ.
ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీకి దిగుతుందన్నత కలర్ ఇచ్చారు. కాసాని లిస్ట్ లు కూడా రెడీ చేసారు. ప్రకటనలు చేసారు. రాజమండ్రి వెళ్లి వచ్చారు. ఇదిగో జాబితా.. అదిగో పోటీ అన్నారు. ఈ లోగా తెలుగుదేశం పార్టీ నుంచి అనధికార లీక్ లు వచ్చాయి. తెలంగాణలో పోటీ చేసే పరిస్థితి ప్రస్తుతం లేదంటూ. అబ్బే అవన్నీ ఫేక్ అని ఖండించారు కాసాని జ్ఙానేశ్వర్. ఇది జరిగి మూడు రోజుల అయింది. ఇక్కడ కాసాని మిస్ అయిన చిన్న లాజిక్ ఏమిటంటే చంద్రబాబు జైలులో వున్న కారణంగా మేనిఫెస్టో విడుదల ఆగింది. లోకేష్ యువగళం ఆగింది. మరి తెలంగాణ ఎన్నికల్లో పోటీ ఆగదా?
నిజంగా తెలంగాణలో పోటీ చేస్తే ప్రచారం చేసేది ఎవరు? ఆ సంగతి అలా వుంచితే యాంటీ పార్టీల నుంచి కౌంటర్ ఎలా వుంటుంది. ప్రజా ధనం కొల్లగొట్టి జైలులో వున్నారు అంటూ ఆరోపణలు, విమర్శలు మొదలు కావా? ఇవన్నీ పక్కన పెడితే తెలంగాణలో ఒక్క సీటు కూడా గెల్చుకోకపోతే ఎంత నామర్దా. ఆంధ్రలో ఏ రేంజ్ డ్యామేజ్ జరుగుతుంది. ఎంత ఎగతాళి వుంటుంది. ఇన్ని తెలిసి తెలంగాణలో ఎందుకు పోటీ చేస్తారు.
ఇక ఇప్పుడు మిగిలింది ఒకటే.. కాసాని జ్ఙానేశ్వర్ తన దారి తాను చూసుకోవడం. బి సి నాయకుడు కనుక ఏదో ఒక పార్టీ చేరదీస్తుంది. టికెట్ సంగతి హామీ ఇస్తే తప్ప ఈయన పార్టీ మారరు. అలా టికెట్ ఎవరు ఇస్తారు అన్నదాన్ని బట్టి పార్టీ మారడం వుంటుంది.
ఇక తెలుగుదేశం పార్టీ కి నేత ఎవరు అంటారా? ఎవరో ఒకరు వుంటారు. లెటర్ హెడ్ మీద సంతకం పెట్టడానికి. కానీ ఇప్పటికే తెలుగుదేశం పార్టీని తెలంగాణ జనం మరిచిపోయారు. సెటిలర్స్ లోని తెలుగుదేశం అనుకూల సామాజిక వర్గం మినహా మరెవరు దాని గురించి ఆలోచించడం లేదు. ఆ వర్గం కూడా ఇప్పుడు కాంగ్రెస్ కు కొమ్ము కాస్తోంది. అందువల్ల ఇక తెలుగుదేశం తెలంగాణలో దుకాణం సర్దేశినట్లే. ఎటొచ్చీ వైకాపా మాదిరిగ తమ దృష్టి అంతా ఆంధ్ర మీదనే అని క్లారిటీగా ప్రకటించడం లేదు.. అంతే.