కమలం-గులాబీల కుమ్మక్కు రాజకీయం

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. వ్యూహరచనలో గట్టి నాయకుడు. తమ పార్టీ తరఫున అభ్యర్థుల జాబితాను అందరికంటె బాగా ముందుగా ప్రకటించడం ద్వారానే.. ఆయన కొంత పైచేయి సాధించారు. అందరికంటె ముందుగా బీఫారాలు ఇచ్చేశారు.…

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. వ్యూహరచనలో గట్టి నాయకుడు. తమ పార్టీ తరఫున అభ్యర్థుల జాబితాను అందరికంటె బాగా ముందుగా ప్రకటించడం ద్వారానే.. ఆయన కొంత పైచేయి సాధించారు. అందరికంటె ముందుగా బీఫారాలు ఇచ్చేశారు. మేనిఫెస్టో కూడా ప్రకటించేసి.. అంతకంటె గొప్పగా తాము ఏ హామీలు ఇవ్వగలమా? అనే అనుమానాల్లోకి నెట్టేశారు. అలాంటి కేసీఆర్, ప్రచార సమరాంగణంలోకి దిగిన తర్వాత.. అచ్చంగా కాంగ్రెస్ ను మాత్రమే తమ ప్రత్యర్థిగా భావిస్తున్న వాతావరణం కనిపిస్తోంది. ఇంకో కోణంలో గమనించినప్పుడు.. కాంగ్రెస్ పార్టీ- అధికార భారాసలో భయం పుట్టిస్తున్నట్టుగా కూడా కనిపిస్తోంది. 

మారిన వైఖరి

కేసీఆర్ మాటలను గత ఏడాదిగా గమనిస్తున్న వారికి ఆయన తీరులో తేడా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. జాతీయ రాజకీయాల మాట ఆయన మదిలో మెదలిన నాటినుంచి కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ మీద, భారతీయ జనతా పార్టీ మీద విచ్చలవిడిగా విరుచుకుపడడం ప్రారంభించారు. భారతీయ జనతా పార్టీ కారణంగా.. దేశం మొత్తం సర్వనాశనం అయిపోతున్నదనే ప్రచారాన్ని ముమ్మరంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి ప్రయత్నించారు. తెలంగాణ ఈ పదేళ్లలో సాధించిన ప్రగతి యావత్తూ.. తన రెక్కల కష్టమేనని, కేంద్రప్రభుత్వం తెలంగాణకు పూర్తిగా ద్రోహం చేసినదని.. అనేకానేక విమర్శలు కురిపించే వారు.

కానీ తీరా ఇప్పుడు తెలంగాణ ఎన్నికల పర్వం మంచుకువచ్చేసిన తర్వాత.. కేసీఆర్ గళంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ప్రతిరోజూ రెండు బహిరంగసభలతో తెలంగాణ వ్యాప్తంగా సుడిగాలి పర్యటన నిర్వహించడానికి పూనుకున్న కేసీఆర్.. ప్రతిసభలోనూ గరిష్టంగా కాంగ్రెసు మీదనే తన విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతుండం గమనార్హం. కేవలం కేసీఆర్ మాత్రమే కాదు.. భారాస 3.0 ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. ఈ పదవీకాలంలో ముఖ్యమంత్రి పదవిని స్వీకరించే అవకాశం ఉన్నదని అందరూ అనుకుంటున్న కల్వకుంట్ల తారక రామారావు కూడా.. కేవలం కాంగ్రెసు మీదనే విరుచుకుపడుతున్నారు.

తెలంగాణలో ఎన్నికలకు కొన్ని నెలల ముందునుంచి హఠాత్తుగా బలోపేతం అవుతున్న కాంగ్రెసు పార్టీ అంటేనే భారాస ఎక్కువగా భయపడుతున్న వాతావరణంకనిపిస్తోంది. తండ్రీ కొడుకులు సహా గులాబీ దళంలోని ముఖ్యమైన నాయకులు అందరూ కూడా కేవలం కాంగ్రెస్ మీదనే తమ విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ వస్తే.. రాష్ట్రానికి చేటు జరుగుతుందని, కాంగ్రెసు పాలన వల్లనే అరవయ్యేళ్లపాటు తెలంగాణ గోసపడ్డదని, వారు మళ్లీ అధికారంలోకి వస్తే రైతులకు విద్యుత్తు సరఫరా కూడా ఉండదని రకరకాల మాటలతో ఆ పార్టీని బూచిగా చూపించి ప్రజలను భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.

తమాషా ఏంటంటే.. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ తదితర సంగతులు ప్రస్తావిస్తూ.. భాజపా తెలంగాణకు ద్రోహం చేస్తున్నదని ఇన్నాళ్లుగా  అంటూ వచ్చిన గులాబీ నాయకులు.. ఇప్పుడు అవే అంశాలకు కొత్త రంగు పులుముతూ.. ఈ అంశాలపై ఇన్నాళ్లుగా రాహుల్ గాంధీ ఎందుకు పోరాడలేదు.. అని విమర్శలను కాంగ్రెస్ మీదికి మళ్లిస్తున్నారు. కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ముందు పొరుగున ఉన్న కర్ణాటకలో అమలుచేసిన తర్వాత ఇక్కడ మాట్లాడాలని ప్రశ్నించడం భారాసకు ఎడ్వాంటేజీగా మారుతోంది. 

భాజపా ఫోకస్ కూడా కాంగ్రెస్ మీదనే

భారాస.. తమ గెలుపు ప్రస్థానానికి ప్రధాన ఆటంకంగా మారుతుందని, టైం బాగాలేకపోతే తమను ఓడిస్తుందని అనుకుంటున్న కాంగ్రెసు మీద విరుచుకుపడడంలో అర్థముంది. అయితే.. మరో విపక్షం భారతీయ జనతా పార్టీ కూడా.. అధికారంలో ఉన్న భారాసకంటె, కాంగ్రెసు మీదనే అతిగా విమర్శలకు దిగుతోంది. కాంగ్రెసును దెబ్బకొట్టడమే తమ లక్ష్యం అన్నట్టుగా వారు వ్యవహరిస్తున్నారు. కాంగ్రెసు పార్టీ అభ్యర్థులను కూడా కేసీఆర్ నిర్ణయిస్తున్నారని భాజపా అంటోంది. కనీసం 30 మంది కాంగ్రెస్ అభ్యర్థులకు భారాస ఎన్నికల ఖర్చులకు ఫండింగ్ చేస్తోందని ఆరోపిస్తోంది. గెలిచిన తర్వాత.. వారందరూ కూడా భారాసలోనే చేరుతారంటూ ప్రచారం సాగిస్తోంది.

ఇలాంటి ప్రచారం ద్వారా.. కాంగ్రెస్ యొక్క క్రెడిబిలిటీని దెబ్బకొట్టడమే లక్ష్యంగా భాజపా ప్రవర్తిస్తుండడం విశేషం. అధికారంలో ఉన్న భారాసలోపాలను ఎండగడుతూ.. వారిని ఓడించి, తాము గద్దె ఎక్కాలని ఆరాటపడితే అర్థం చేసుకోవచ్చు. అయితే భారాస కంటె కాంగ్రెసు మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టడం అనుమానాస్పదంగా ఉంది. ఈ మాటల ద్వారా కాంగ్రెస్ కు ఉండే ఓటర్లలో అపనమ్మకాన్ని పెంచాలనేది వారి కోరిక. 

కాంగ్రెసు ఓట్లు చీలి భాజపాకు పడినా కేసీఆర్ కే లాభం! లేదా, సాంప్రదాయ కాంగ్రెస్ ఓటర్లు, బిజెపికి వేయలేరు గనుక.. వారు భారాసను ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటే కేసీఆర్ కు ఇంకా లాభం. అందుకే భాజపా ఎక్కువ కాంగ్రెస్ నే దునుమాడుతున్నట్టుగా ఉంది. 

‘కుమ్మక్కు’ ప్రచారం నిజమేనా?

ఈ పోకడలను గమనించినప్పుడు.. భాజపా- భారాస లోపాయికారి ఒప్పందంతో, కుమ్మక్కు రాజకీయాలు నడిపిస్తున్నాయనే ఆరోపణలే నిజం అనే భావన పలువురిలో కలుగుతోంది. ఇప్పుడు కాంగ్రెసును దెబ్బకొట్టడానికే ఈ రెండు పార్టీలు తెరవెనుక చేతులు కలిపాయనే అభిప్రాయం ఏర్పడుతోంది. 

కేసీఆర్ 3.0 సర్కారు ఇప్పుడు ఏర్పడితే.. పార్లమెంటు ఎన్నికలు వచ్చే సమయానికి భాజపా వ్యతిరేక ఓట్లను దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఎంతో కొంత చీల్చడం ద్వారా, రాష్ట్రంలో భాజపా కోరుకునే ఎంపీ స్థానాల్లో బలహీనమైన అభ్యర్థులను మోహరించి, తూతూమంత్రంగా ప్రచారం చేయడం ద్వారా భారాస సహకరించవచ్చునని అంతా అనుకుంటున్నారు. మరి తెలంగాణ రాజకీయాలు ముందు ముందు ఇంకా ఎన్నెన్ని రసవత్తరమైన మలుపులు తిరుగుతాయో వేచిచూడాలి.