ఏపీని ముగ్గులోకి తెచ్చారే ఎలా సాధ్యమబ్బా?

మునుగోడు ఎన్నికకు పోలింగ్ ముగిసిన వెంటనే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రెస్ మీట్ పెట్టారు. తన సహజ శైలిలో భారతీయ జనతా పార్టీ మీద ఒక రేంజ్ లో విరుచుకుపడ్డారు. పైగా…

మునుగోడు ఎన్నికకు పోలింగ్ ముగిసిన వెంటనే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రెస్ మీట్ పెట్టారు. తన సహజ శైలిలో భారతీయ జనతా పార్టీ మీద ఒక రేంజ్ లో విరుచుకుపడ్డారు. పైగా ఇప్పుడు ఎడాపెడా విమర్శలు కురిపించడానికి ఆయనకు మరో బలమైన అవకాశం కూడా ఉంది వచ్చింది. 

‘తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు కోసం.. ఢిల్లీ దూతలు బేరలాడుతున్నారు’ అనే వ్యవహారం బయటపడి ప్రస్తుతం విచారణ దశలో ఉన్న నేపథ్యంలో.. బిజెపి మీద ఫైర్ కావడానికి కేసీఆర్ కు మంచి అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని చాలా చక్కగా వాడుకుంటూ.. దేశంలో అనేక రాష్ట్రాలలో ప్రభుత్వాలను కూలతోయడానికి బిజెపి కుట్రలు పన్నుతోందంటూ కల్వకుంట్ల చంద్రశేఖర రావు అనేక ఆరోపణలు గుప్పించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ పేరును కూడా తెరమీదకు తీసుకురావడం తమాషాగా కనిపిస్తోంది. 

రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడానికి బిజెపి కొత్త కుట్రలు చేస్తున్నదంటూ కెసిఆర్ నిప్పులు చెరిగారు. ఆయన ప్రధానంగా నాలుగు రాష్ట్రాల పేర్లను ప్రస్తావించారు. వాటిలో తెలంగాణ తరువాత ఢిల్లీ, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోలుకు ఒక ప్రయత్నం జరిగిందని వ్యవహారం ఇప్పుడు తాజాగానే ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ తమ ఎమ్మెల్యేల కొనుగోలుకు బిజెపి శతవిధాలా ఎరవేస్తున్నదని చాలా కాలం నుంచి ఆరోపణలు చేస్తూనే ఉంది. రాజస్థాన్లో కూడా గ్రూపు కుమ్ములాటలను ఎగదోశారనే ప్రచారం ఉంది. ఈ మూడు రాష్ట్రాలలో కూడా అధికారంలో ఉన్న పార్టీలు బిజెపిని తీవ్రంగా వ్యతిరేకించే పార్టీలు. ఒకవేళ వారిని రాజకీయంగా దెబ్బ కొట్టడానికి బిజెపి ప్రయత్నం చేసిందని ఆరోపించినా నమ్మడం కుదురుతుంది. కానీ ఈ రాష్ట్రాల జాబితాలోకి ఆంధ్రప్రదేశ్ పేరును కేసీఆర్ ఎందుకు లాగినట్లు?

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 151  స్థానాల అతి భయంకరమైన ఆధిక్యంతో ప్రభుత్వం నడుపుతోంది. ఈ ప్రభుత్వాన్ని కూలతోయాలంటే ఆషామాషీ వ్యవహారం ఎంత మాత్రమూ కాదు. ఏకంగా 55 -60 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పైగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి దిక్కూదివాణమూ లేదు. ‘ఆ పార్టీని నమ్ముకుని ఎంత పెద్ద ఆఫర్ వచ్చినా సరే అధికార పార్టీ ఎమ్మెల్యే ఒక్కరు కూడా అంగుళం కూడా పక్కకు జరగరు’ అనేది సత్యం. పైగా జగన్ సర్కారుతో కేంద్రానికి సత్సంబంధాలే ఉన్నాయి. వారికి బలం అవసరమైన ప్రతి సందర్భంలోనూ.. వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతును వారు పొందుతూనే ఉన్నారు. అయితే ఏపీలో కూడా సర్కారును కూల్చడానికి బిజెపి ప్రయత్నిస్తున్నదని కెసిఆర్ చెప్పడం ఆశ్చర్యకరం!

ఇక్కడ మనం మరొక సంగతి కూడా గమనించాలి. ఢిల్లీ రాజస్థాన్లో ప్రభుత్వాలను కూల్చడానికి బిజెపి ప్రయత్నిస్తోందని సంగతి కేసీఆర్ కనిపెట్టినది ఏమీ కాదు. ఎప్పటినుంచో ప్రచారంలో ఉన్న విషయాలే. అయితే కొత్తగా ఆయన ఏపీ పేరును జత చేశారు. ఇలా చేయడం వెనుక ఒక వ్యూహం ఉన్నదని పరిశీలకులు భావిస్తున్నారు.

కొత్తగా బి ఆర్ ఎస్ పేరుతో జాతీయ పార్టీని సంకల్పిస్తున్న కేసీఆర్ కు.. పొరుగున ఉన్న తెలుగు రాష్ట్రం ఏపీలో కూడా తన అస్తిత్వాన్ని నిరూపించుకోవడం పెద్ద అవసరం. తెలుగు ప్రాంతంలో కూడా తన అస్తిత్వం చూపించుకోకుండా ఇతర ప్రాంతాలకు వెళితే జనం నవ్వుతారు. ఇంట గెలిచి రచ్చ గెలిచే ప్రయత్నం చేయమని ఉద్బోధిస్తారు. అయితే కెసిఆర్ పట్ల ఏపీ ప్రజల్లో ఎలాంటి విశ్వాసమూ ఆదరణా లేదు. 

రాష్ట్ర విభజన నాటి ఆయన దుందుడుకు మాటలను ఏపీ ప్రజలు ఎవ్వరూ మర్చిపోలేదు. కనుకనే ఏపీ ప్రజలలో కూడా బిజెపి పట్ల ఒక భయం బీజం విత్తడం ద్వారా.. తన పట్ల వారిలో జాలి పెంపొందించుకోవాలని కేసీఆర్ ప్రయత్నం లాగా కనిపిస్తుంది. ఏపీని ముంచడానికి బిజెపి ప్రయత్నిస్తున్నదనే మాటలు చెబితే.. అక్కడి ప్రజలు తనను విశ్వాసంలోకి తీసుకుంటారని ఆయన తలపోస్తున్నట్టుగా ఉంది. 

మొత్తానికి ఈ ప్రెస్ మీట్ లో కేసీఆర్ కొన్ని నమ్మదగిన విషయాలు వెల్లడించినప్పటికీ.. కొన్ని ఆధారాలు సమర్పించినప్పటికీ.. చాలావరకు గాలిపోగు చేసి మాట్లాడినట్లుగా అనిపిస్తోంది!