హాస్యంగా మారిన కేసీయార్ రాజకీయ పాతివ్రత్యం

పులి శాకాహారంలో ఉన్న ఆదర్శం గురించి లెక్చరు దంచితే ఎలా ఉంటుంది?  Advertisement హిట్లర్ గాంధీయిజంలోని గొప్పతనం మీద ఉపన్యాసం చేస్తే ఏమనిపిస్తుంది? సరిగ్గా ఈ రోజు అటువంటి సంఘటనే ఎదురయింది తెలుగు ప్రజలకి. …

పులి శాకాహారంలో ఉన్న ఆదర్శం గురించి లెక్చరు దంచితే ఎలా ఉంటుంది? 

హిట్లర్ గాంధీయిజంలోని గొప్పతనం మీద ఉపన్యాసం చేస్తే ఏమనిపిస్తుంది?

సరిగ్గా ఈ రోజు అటువంటి సంఘటనే ఎదురయింది తెలుగు ప్రజలకి. 

వాగ్ధాటి, బహుభాషాపటిమ, చెప్పేది సూటిగా చెప్పడం ఒక్కటీ సరిపోదు… వీటికి తగ్గట్టు చేతలు కూడా ఉండాలి. 

మనం చెప్పుకునేది నేటి కేసీయార్ ప్రెస్మీట్ గురించి. 

మునుగోడు ఎన్నిక నేడు ముగిసింది. కెసీయార్ ఇవాళ ప్రెస్మీట్లో చెప్పిన మాటల గురించే ఇప్పుడు చర్చంతా. 

కొన్ని రోజుల క్రితం కేంద్రశక్తులు ఏ విధంగా తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టాయో, పార్టీకి విధేయులైన తన ఎమ్మెల్యేలు ఎంత చాకచక్యంగా ప్రలోభపెట్టేవాళ్లని పట్టించారో గొప్పగా చెప్పుకొచ్చారు ముఖ్యమంత్రి కేసీయార్. వినడానికి చాలా బాగుంది. ఆయన చెప్పినట్టే కనుక దేశం మారితే అసలు సిసలు రామరాజ్యం వచ్చేసినట్టే. 

నిజమే మరి..కేసీయార్ చెప్పినట్టు ఎమ్మెల్యేలను ఎర వేసి కొనకూడదు. భయపెట్టో, ఆశ చూపో పక్క పార్టీ ఎమ్మెల్యేలను తమ వైపుకు తిప్పుకోకూడదు. అది ప్రజాస్వామ్యం కానే కాదు. ఆయన మాటలకి నిజంగా రక్తం ఉప్పొంగుతుంది. ఆయన ప్రస్తావించినలాంటి అసాంఘిక రాజకీయకుట్రదారుల్ని తరిమి కొట్టాలనిపిస్తుంది. తెలంగాణాకే కాదు యావత్ దేశానికి జాతిపిత కాగలిగే ఆదర్శం, ఔన్నత్యం కేసీయార్ లో ఉన్నాయనిపిస్తుంది…. (కేవలం ఆయన మాటలు వింటూ ఏమీ ఆలోచించకపోతేనే సుమీ!!!) 

కాస్త ఆలోచిస్తే తాజాగా జరిగిన మునుగోడు ఎన్నికల ప్రహసనమే చెప్పుకోవచ్చు. భాజపా, తెరాసా పోటీ పడి మరీ ఓటర్లకి డబు పంచాయని ప్రజలే మీడియా కెమెరాలకు చెప్పారు. కొంతమంది ఓటర్లు తమకు ఇస్తామన్న డబ్బు అందని కారణంగా ఓటు వేయమని భీష్మించుకుని కూర్చున్నారు. కొంతమందైతే తులం బంగారమిస్తామని ఆశ చూపి చివరికి మూడు వేలు చేతుల్లో పెట్టారని వాపోయారు. పుచ్చుకుంటున్న ఈ ఓటర్లకి సిగ్గు లేదు, ఇవ్వజూపిన పార్టీలకు లజ్జ లేదు. ఇక్కడ ఎవ్వడూ మానం మర్యాద కలవాడు లేడు. అంతా సర్వ భ్రష్టత్వమే ఉంది. ఒక పక్క తెగబడి ఓటుకింతని ఇచ్చి కొనుక్కుని ఈ రోజు ప్రెస్మీట్లో శ్రీరంగనీతులు వల్లించిన కేసీయార్ ని చూస్తే వక్తృత్వంలో ఆయన ప్రతిభకి ముచ్చటేస్తుంది తప్ప ఇంకేమీ అనిపించదు. 

కాస్త గతంలోకి వెళ్లితే తెలంగాణాలో కాంగ్రెస్ నాయకులంతా తెరాసాలోకి దూరలేదా? ఒక పార్టీ జెండాతో నెగ్గి భయంతోనో, ఆశతోనో తెరాసాలోకి చేరతామంటే ఆదర్శవంతమైన ప్రజాస్వామ్య సూత్రం ప్రకారం వద్దనాలి కదా. ప్రస్తుతం ఆ.ప్ర లో జగన్ మోహన్ రెడ్డి చేస్తున్నది అదే. లేకపోతే ఎప్పుడో వల్లభనేని వంటి వాళ్లని వైకాపాలో కలుపుకునేవాడే కదా! 

ఇక బహుళప్రాచుర్యం పొందిన చంద్రబాబు ఓటుకి నోటు కేసుని కేసీయార్ ఏం చేసారు? ఈ రోజు చెప్పినట్టుగా అటువంటి బేరాలాడినవాళ్లని చట్టబద్ధంగా శిక్షించే దిశగా ఎందుకు పోరాడలేదు? సందర్భోచిత రాజకీయాలు నడుపుతూ పదవిని కాపాడుకుంటున్న కేసీయార్ ఆదర్శ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం హాస్యాస్పదమే. 

ఆమాటకొస్తే ఇలాంటి రాజకీయాల వల్ల, రాజకీయనాయకుల వల్ల దేశానికి ఏమీ ప్రయోజనం లేదు. మీడియావాళ్లకి ఫ్రీ ఆర్టిస్టుల్లా దొరకడానికి, జనానికి ఏ రోజుకారొజు తాజా వినోదాన్ని అందించడానికి తప్ప రాజకీయనాయకులు దేనికీ పనికిరావట్లేదు. మన పెరట్లో ఏం జరుగుతోందో చూసుకుని మాట్లాడాలనే రూల్ పెడితే కేసీయార్ తో సహా ఏ రాజకీయనాయకుడూ నోరు విప్పలేడు. ఇక్కడ నీతి మాట్లాడే అర్హత ఎవ్వడికీ లేదు. వినే తీరిక, ఓపిక జనానికీ లేదు. అదేదో సినిమాలో చెప్పినట్టు..”తిన్నామా, పొడుకున్నామా, తెల్లారిందా..” బాపతే అంతా! 

హరగోపాల్ సూరపనేని