వైకుంఠపాళి (పాము పటం) ఆడిన వాళ్లందరికీ అరుకాషుడు తెలుసు. అదో పెద్ద పాము. ఎన్ని నిచ్చెనలు ఎక్కినా టాప్‌లో మన కోసం వేచి వుంటుంది. దాని నోట్లో పడితే ఒకేసారి కిందకే. ఇప్పుడు అది బీజేపీ రూపంలో కేసీఆర్‌ని తినడానికి వేచి చూస్తోంది.
టీఆర్ఎస్‌కి గతంలో ఉన్నంత ఆదరణ లేదు. పదేళ్లు పాలనలో వుంటే ఏ పార్టీకైనా వ్యతిరేకత తప్పదు. గత ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్‌ని ఓటర్ల కంటే ఎక్కువగా లక్ వరించింది. ఈ ఐదేళ్లలో పరిస్థితులు మారిపోయాయి. బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. దీనికి కారణం టీఆర్ఎస్ వ్యతిరేకత మాత్రమే కాదు, మోడీపైన, బీజేపీపైన ఆకర్షణ, అభిమానం కూడా. కాంగ్రెస్ వాళ్లు అమ్ముడు పోవడం వల్ల బీజేపీ ప్రత్యామ్నాయంగా జనానికి కనిపిస్తోంది.
ఇంత కాలం టీఆర్ఎస్‌కి కాంగ్రెస్‌కి మధ్య పోటీ అనుకున్నారు. ఇప్పుడు సీన్ బీజేపీకి మారింది. కాంగ్రెస్ నుంచి వలసలు ప్రారంభమయ్యాయి. మునుగోడు ఒక ఉదాహరణ మాత్రమే. రేపు అక్కడ ఉప ఎన్నిక వస్తే టీఆర్ఎస్ సర్వశక్తులు ఒడ్డాలి. ఒకవేళ ఓడిపోతే అసెంబ్లీ ఎన్నికల మూడ్‌కి అది సంకేతమని బీజేపీ దాడి ప్రారంభిస్తుంది. ఆ రిస్క్ టీఆర్ఎస్ తీసుకోకుండా నేరుగా రాష్ట్ర ఎన్నికలకు వెళ్లొచ్చు.
ఈ నేపథ్యంలో రేపు జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్‌కి బోటాబోటి మెజార్టీ వస్తే లాభం లేదు. కనీసం 70 దాటాలి. అప్పుడు మజ్లిస్‌తో కలిసి కొంచెం సేఫ్ సైడ్ ఉన్నట్టు. అయితే టీఆర్ఎస్‌కి ఎన్ని వస్తాయన్నది లెక్క కాదు. బీజేపీ బలమెంత అదే ముఖ్యం. బీజేపీకి 10 వస్తే కేసీఆర్ ఊపిరి పీల్చుకోవచ్చు. 20 వస్తే డేంజర్ బెల్ మోగినట్టే. 30 దాటితే మరో మహారాష్ట్ర.
కాంగ్రెస్, టీడీపీ నుంచి కేసీఆర్ లాగేసినట్టే, అదే ఫార్ములా బీజేపీ పాటిస్తుంది. ప్రస్తుతం దేశంలో ఎమ్మెల్యేలను చీల్చి ప్రభుత్వాల్ని ఏర్పాటు చేయడంలో ఆ పార్టీ నంబర్ ఒన్. టీఆర్ఎస్‌ని చీల్చడం పెద్ద పనికాదు. కేసీఆర్ నియంత పోకడలతో ఆల్రెడీ అసంతృప్తితో ఉన్నారు. పైగా బీజేపీ గేమ్ మామూలుగా వుండదు. ప్రజాసేవ పేరుతో వ్యాపారాలు చేసుకునే వాళ్లే అన్ని పార్టీల నాయకులు. వాళ్ల లొసుగులు బీజేపీకి తెలుసు. గోవాలో కాంగ్రెస్‌ని ఫినీష్ చేయడానికి 40 కోట్ల వరకూ ఆఫర్ చేసిన వాళ్లు, తెలంగాణలో ఇంకో 10 కోట్లు పెంచుతారు కూడా. కాదు కూడదంటే ఈడీ, సీబీఐలు ఉండనే ఉన్నాయి.
శివసేన లాంటి నిబద్ధత ఉన్న పార్టీనే ముక్కలుచెక్కలు చేయగలిగారు. టీఆర్ఎస్ ఒక లెక్క కాదు. ఇప్పుడు టీఆర్ఎస్‌లో ఉద్యమ నాయకుల కంటే ప్రయోజనాల కోసం చేరిన నాయకులే ఎక్కువ. కేసీఆర్ వల్ల ప్రయోజనం లేదని స్పష్టమైన మరుక్షణమే దూకేస్తారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ముందున్నది అతిపెద్ద యుద్ధం. రాష్ట్రం వదిలి జాతీయ పార్టీ అనడం వల్ల ఏ ప్రయోజనం లేదు. మోదీకి వ్యతిరేకంగా దేశాన్ని సమాయత్తం చేయడానికి కేసీఆర్ జయప్రకాశ్ నారాయణ్ కాదు. గత ఎన్నికల్లో చంద్రబాబు ఇలాగే పిల్లిమొగ్గలు వేసి రాష్ట్రాన్ని కూడా పోగొట్టుకున్నారు.
కేసీఆర్ ఆడే వైకుంఠపాళిలో బీజేపీ అనే అరుకాషున్ని దాటుతాడో లేదో కాలమే చెప్పాలి.