చూస్తుంటే తెలుగుదేశం పార్టీ పునాదుల్లో దాగిన సామాజిక వర్గం మరోసారి తెలంగాణలో పాగా వేయాలని డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. ఇన్నాళ్లూ హైదరాబాద్ లో టీఆర్ఎస్ కనుసన్నలలో వుంటూ సైలంట్ గా వుంటూ వస్తున్నారు తెలుగుదేశం అనుకూల వర్గం. ఎప్పడయితే ఓటుకు నోటు వ్యవహారం వల్ల హైదరాబాద్ పదేళ్ల ఉమ్మడి రాజధాని హక్కును గాలికి వదిలేసి, అప్పటి వరకు ఆంధ్ర సిఎమ్ పేషీ అలంకరణకు చేసిన కోట్ల ఖర్చును కూడా వదిలేసి ఆంధ్రకు వెళ్లిపోయారు చంద్రబాబు. నిజానికి పదేళ్ల కాలం ఇక్కడే వుంటే వేరుగా వుండేది.
సరే, చంద్రబాబు వెళ్లిపోగానే ఆయన అనుకూల వర్గం, ఆయన అనుకూల మీడియా అంతా టీఆర్ఎస్ చెంత చేరిపోయారు. గత ఏడెనిమిదేళ్లుగా మారు మాట్లాడకుండా వున్నారు. ఒక్క నెగిటివ్ న్యూస్ లేదు. ఒక్క విమర్శ లేదు. ఈ మీడియా సంగతి తెలియని కేసిఆర్ అంతా తన కంట్రొల్ లో వుందనుకున్నారు. సమయం వచ్చినపుడు పడగ విప్పే నైజం ఈ మీడియాది..తెలుగుదేశం సామాజిక అనుచర వర్గానికి అని మరిచిపోయారు. పైగా ఆ వర్గాన్ని కూడా దగ్గరకు తీసుకుని, మంత్రి పదవి ఇచ్చి, ఇన్నాళ్లూ దువ్వుతూ వచ్చారు.
2019లో జగన్ ఎప్పుడయితే అధికారంలోకి వచ్చారో, ఇటు తెలంగాణలోనూ అధికారం లేక అటు ఆంధ్రలోనూ లేక కిందా మీదా అవుతోంది ఈ వర్గం. అప్పటికె టీఆర్ఎస్ చెంత చేరి కొంత మంది రియల్ ఎస్టేట్ వ్యాపారాలు బాగానే నడుపుతున్నా, అందరికీ సాగడం లేదు. అయినా చేసేదేమీ లేక చేష్టలుడిగి కూర్చున్నారు. అదే సమయంలో ఆంధ్రలో ఎలాగైనా అధికారం అందుకోవాలని అందరూ ఒక్కటై జగన్ మీద పోరాడుతున్నారు.
ఇలాంటి నేపథ్యంలో తెలంగాణలో భాజపా గట్టి ప్రయత్నానికి రెడీ అవుతోంది. కాంగ్రెస్ తానూ వున్నాను అంటోంది. వైఎస్ షర్మిల తన ప్రయత్నం తాను చేస్తాను అంటోంది. ఇప్పటి వరకు కేసిఆర్ కు అండగా వున్న తెలుగుదేశం అనుకూల మీడియా గత కొద్ది నెలలుగా సన్నాయి నొక్కులు నొక్కుతూ వస్తోంది. ఆఖరికి ఇప్పుడు తన నైజం బయట పెట్టుకుని కేసిఆర్ వ్యతిరేక వార్తలు వండి వారుస్తోంది. కేసిఆర్ చుట్టూ వున్న జనాలను భయపెట్టే ప్రయత్నం ప్రారంభించింది.
అదే సమయంలో వరంగల్, ఖమ్మం ప్రాంతంలో తమ వర్గానికి వున్న ఇంతో అంతో ఓటు బ్యాంక్ ను మళ్లీ వాడుకోవాలని చూస్తున్నట్లుంది తెలుగుదేశం పార్టీ. ఇప్పటి వరకు తెలంగాణ కు సంబంధించిన ఏ ఎన్నికల జోలికి రాకుండా, మొహం చాటేసిన చంద్రబాబు ఇప్పుడు అర్జంట్ గా ఖమ్మం జిల్లాలో అడుగుపెట్టారు. అంటే మెల్లగా మళ్లీ తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టే ఆలోచన చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఎన్నో కొన్ని సీట్లు తెచ్చుకుంటే మళ్లీ తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పగలమని ఆశిస్తున్నట్లు వుంది. లేదా, ఏ పార్టీకి సరిపడా సీట్లు రాక, హంగ్ వస్తే, తమ మద్దతు భాజపాకు అందించి, ఆ విధంగా ఆ పార్టీ మద్దతును సంపాదిచవచ్చని సుదూర ఎత్తుగడ వేస్తున్నట్లుంది.
గమ్మత్తేమింటే ఎన్నో సార్లు కేసిఆర్ మీద బీరాలు పలికి, ఆ తరువాత కేసిఆర్ మీద అతి వినయం ప్రేమ చూపించిన జనసేన పార్టీ కూడా ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తోంది. ఇప్పటి వరకు పోటీ చేస్తామని చెప్పిన ఏ ఎన్నికలో పోటీ చేయని జనసేన కూడా ఖమ్మం వైపు చూస్తోంది. అంటే ఆంధ్ర ఓట్లను ఇటు తెలగుదేశం, అటు జన సేన కలిసి ప్రభావితం చేసే ప్లాన్ ఏదో పెట్టుకున్నట్లు కనిపిస్తోంది.
ఇప్పటికైనా ఈ వర్గం రాజకీయాలు కేసిఆర్ కు తెలిసిరావాలి. ఇన్నాళ్లుగా వాళ్లను దువ్వుతూ, వాళ్లకు పనులు చేసి పెడుతూ వచ్చిన దాని ఫలితం ఇలాగే వుంటుందని అర్థం కావాలి. కేసిఆర్ చరిష్మా తగ్గుతోందని ఏమాత్రమో ఈ వర్గం పసిగట్టి వుండాలి. అందుకే మళ్లీ తమ రాజకీయం ప్రారంభించి వుండాలి. మళ్లీ కేసిఆర్ పవర్ లోకి వస్తే కనుక ఈ వర్గం గప్ చుప్ అయిపోతుంది. ఈ మీడియా మళ్లీ భజన మొదలుపెట్టి, నెగిటివిటీని పక్కన పెడుతుంది.