Advertisement

Advertisement


Home > Politics - Analysis

కుల మీడియా అతి 'దేశానికి' చేటు

కుల మీడియా అతి 'దేశానికి' చేటు

తెలుగుదేశం పునాదుల్లో పదిలంగా వున్న సామాజిక వర్గానికి చెందిన పత్రికలు చదివిన, చదువుతున్న వారందరికీ ఇవ్వాళ లేదు.. రేపే అధికారంలోకి వచ్చేస్తారు అనే భావన కలుగుతుంది. ఇంకేం లేదు ఆంధ్రలో అల్లకల్లోలం జరిగిపోతోంది. సర్వ నాశనం అయిపోయింది. జగన్ ను జబ్బ పట్టుకుని లాగి, కిందకు దింపకపోతే అసలు దేశ పటంలో ఆంధ్ర కనిపించదు అనేంతగా ప్రచారం జరిగిపోతుంటుంది ఈ కుల పత్రికల్లో, కుల డిజిటల్ మీడియాలో. రాసినవే రాస్తుంటారు. హెడ్డింగ్ లు మారుస్తుంటారు.

ఈ మీడియాకు కానీ, ఈ మీడియా మద్దతుతో అధికారం సాధించాలి అని అనుకుంటున్న తెలుగుదేశం పార్టీకి కానీ తెలియంది ఏమిటంటే ఈ అతి ప్రచారం వల్ల మిడ్ రేంజ్ లీడర్లలో ధీమా వచ్చేసింది అని. ఎన్నికలు దగ్గరకు రావడంతో ఇప్పుడు చోటా, మిడ్ రేంజ్ లీడర్లు అంతా అభ్యర్ధుల చుట్టూ తిరుగుతున్నారు. డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇప్పుడే కనుక వారి బాధ అంతా అదే.

ఎప్పుడయితే మిడ్ రేంజ్ లీడర్లు అంతా ఎమ్మెల్యే అభ్యర్ధుల కనుసన్నలలో వుంటూ, వారి చుట్టూ తిరుగుతున్నారో, గ్రామీణ స్ధాయిలో వైకాపా ప్రచారాన్ని తిప్పి కోట్టే వారు కరువయ్యారు. వాలంటీర్లు కావచ్చు, వైకాపా రాజకీయ ఆశ్రితులు కావచ్చు, జనాల్లో వుంటూ వారి ప్రచారం వారు సాగిస్తున్నారు. తేదేపా కూటమి జనాలు మాత్రం తాము అధికారంలోకి వచ్చేసామని ప్రజలు తిరిగిపోయారని డిసైడ్ అయిపోయారు.

దాంతో వాళ్లు ఇక ప్రచారం అన్నది కేవలం ఎమ్మెల్యే అభ్యర్ధికే వదిలేసారు. కూటమి భాగస్వాములైన భాజపాకు కేడర్ నే లేదు. అందువల్ల దాని గురించి మాట్లాడుకోవాల్సిన పని లేదు. జనసేన కేడర్ తో సమస్య ఏమిటంటే జై అంటూ జెండాలు పట్టుకుని ఎగరడం తప్ప ఫలితం వుండడం లేదు. ఎందుకంటే తెలుగుదేశం మిడ్ రేంజ్ లీడర్లు తమకు అందిన వాటిలో తాము గిల్లుకోగా మిగిలినవి, తమ కేడర్ కు కాస్తో కూస్తో పంచుతున్నారు.

జనసైనికులకు ఇది అంతంగా మాత్రమే అందుతోంది. చాలా చోట్ల అది కూడా అందడం లేదు. దాంతో వాళ్లు ఉన్నచోటే జై జనసేన అంటున్నారు తప్ప, అంతకు మించి జనాల్లోకి వెళ్లడం లేదు. వేల ఓట్లు వున్న గ్రామాల నుంచి జనసేన పవన్ వస్తే పాతిక ముఫై మందిని మాత్రమే తరలించగలిగారు. అన్ని గ్రామాల నుంచి ఇలా వచ్చిన పాతికలు కలిపి పెద్దగా కనిపించింది కానీ, లోకల్ లెక్కలు చూసుకుంటే అది చాలా అంటే చాలా తక్కువ. దీనికి కారణం మరేం లేదు. జనసేన పోటీ చేయని చోట, ఆ పార్టీ కేడర్ కోసం ఎమ్మెల్యే అభ్యర్ధులు డబ్బులు తీయకపోవడమే.

ఇలాంటి టైమ్ లో పది ఓట్లు వుండనీ, పాతిక ఓట్లు వుండనీ, అలాంటి జనసేన నాయకులు అందరినీ ఏరి మరీ వైకాపాలోకి లాగుతున్నారు. దీన్ని తెలుగుదేశం అభ్యర్ధులు పట్టించుకోవడం లేదు. ఎందుకంటే పార్టీ పత్రికలు చూస్తుంటే తాము అధికారంలోకి వచ్చేసామని, తమ గెలుపు నల్లేరు మీద నడక అని వారికి ధీమా వస్తోంది. అందువల్ల ఇక ఎందుకు డబ్బులు తీయడం అనే భ్రమలో వున్నారు.

ఈ భ్రమలు పార్టీ విజయావకాశాలు ఎలా దెబ్బతీస్తాయన్నది మును ముందు తెలుస్తుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?