Advertisement

Advertisement


Home > Politics - Telangana

వ్యతిరేకత ఉన్నా కాంగ్రెస్ కు ఆయన అవసరం

వ్యతిరేకత ఉన్నా కాంగ్రెస్ కు ఆయన అవసరం

తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ మొదటి నుంచి వలస నాయకులకు పెద్ద పీట వేసి మంత్రి పదవులు కట్టబెట్టాడు. మొదటి టర్మ్ లోనే కాకుండా రెండో టర్మ్ లో కూడా దాన్ని కొనసాగించాడు. అలా ఆయన పార్టీలోకి వలస వచ్చిన వారిలో నిర్మల్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ముఖ్యుడు. 2014 లో తెలంగాణా ఏర్పడిన తరువాత జరిగిన ఎన్నికల్లో ఇంద్రకరణ్ బీఎస్పీ నుంచి గెలిచాడు. వెంటనే గులాబీ పార్టీలో చేరాడు. అంతే వేగంతో కేసీఆర్ ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టాడు. ఒకసారి కాదు రెండుసార్లు మంత్రి పదవి ఇచ్చాడు. ఇంత ప్రాధాన్యం ఇచ్చినా ఆయన కూడా తాజాగా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాడు.

నిజానికి ఇంద్రకరణ్ కాంగ్రెస్ లో చేరతాడని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. ఆయన ఎప్పుడో ఆ పార్టీలో చేరాల్సింది. కానీ ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని నిర్మల్ జిల్లా కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. అక్కడి డీసీసీ అధ్యక్షుడు కూడా వ్యతిరేకించాడు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో ఎదురులేకుండా ఉన్న ఇంద్రకరణ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాడు. దానికి తగ్గట్లు పార్టీ కూడా మట్టికరిచింది. అప్పటి నుంచి పార్టీ మారే ఆలోచన చేస్తున్నాడు. కాంగ్రెస్ నాయకులకు టచ్ లోకి వచ్చాడు. కానీ వ్యతిరేకత కారణంగా వెంటనే స్టెప్ తీసుకోలేదు. ఎందుకైనా మంచిదని వెయిట్ చేశాడు. అల్లోల వెంట నడిచి అనేక పదవులు అనుభవించిన ద్వితీయ శ్రేణి నాయకులు అల్లోలను వీడి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. మరికొందరు కమలం పార్టీలో చేరిపోయారు.

దీంతో ఒంటరైన అల్లోల పరిస్థితి ఏంటనే ప్రశ్న మొదలైంది. అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అధిష్టానం  సుముఖంగానే ఉన్నప్పటికీ స్థానిక నాయకత్వం వ్యతిరేకించింది.  కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీహరి రావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గతంలో గురు శిష్యులే అయినప్పటికీ శ్రీహరి రావును అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చిన్న చూపు చూశారనే విమర్శలు బాహాటంగానే  వినిపించాయి. ఈ కారణంగానే నాయకులు, కార్యకర్తలు అల్లోల కాంగ్రెస్‌లోకి రాకను వ్యతిరేకించారు. 

అల్లోల చేరికపై నిర్మల్ జిల్లాలోని పలు మండలాల్లో నిరసన దీక్షలను సైతం చేసి అధిష్టాన వర్గానికి ఫిర్యాదులు చేశారు. అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తన ఆస్తులను కాపాడుకునేందుకే అధికార కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడనే  ప్రచారం జోరుగా సాగింది.  కానీ చాలా సీనియర్ నాయకుడైన అల్లోలను వదులుకోవడం కాంగ్రెస్ కు ఇష్టం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గులాబీ పార్టీని, బీజేపీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ కు సీనియర్ నాయకుడు, బలమైన నాయకుడు అవసరం.

ఉస్మానియా యూనివ‌ర్సిటీ నుంచి ఎల్ఎల్‌బీ ప‌ట్టా పుచ్చుకున్న ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి 1980లో రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేశాడు. 1987 నుంచి 1991 వ‌ర‌కు జిల్లా ప‌రిష‌త్ చైర్మ‌న్‌గా పనిచేశాడు. 1991 నుంచి 1996 వ‌ర‌కు ఎంపీగా చేశాడు.  1999, 2004 ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా గెలిచాడు. 2008 ఉప ఎన్నిక‌ల్లో ఎంపీగా విజ‌యం సాధించాడు. 2009 ఎన్నిక‌ల్లో ఓడిపోయాడు. 2014లో బీఎస్పీ నుంచి గెలుపొంది, టీఆర్ఎస్ పార్టీలో చేరాడు. మంత్రి అయ్యాడు.  2018లో బీఆర్ఎస్ త‌ర‌పున నిర్మ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలిచాడు. మంత్రి అయ్యాడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాడు.

రాజకీయాల్లో అల్లోలకు ఇంకో రికార్డ్ కూడా ఉంది. దేవాదాయ శాఖ మంత్రిగా ప‌నిచేసిన వారికి అనంత‌రం రాజ‌కీయ జీవితంలో దేవుడి క‌రుణ మాత్రం క‌ల‌గ‌లేద‌ని చ‌రిత్ర చెబుతోంది. ఎన్టీ రామారావు పీరియ‌డ్ నుంచి మొద‌లుకుంటే.. ఉమ్మ‌డి ఏపీలో కిర‌ణ్‌కుమార్ రెడ్డి కేబినెట్ వ‌ర‌కు 8 మంది నేత‌లు దేవాదాయ శాఖ మంత్రులుగా ప‌ని చేశారు. వారిలో ఎవ‌ర్నీ కూడా తరువాత మంత్రి ప‌ద‌వి వ‌రించ‌లేదు. ఎమ్మెల్యేగా గెల‌వ‌డం కూడా క‌ష్ట‌మైంద‌ని రికార్డులు ఉన్నాయి.

కానీ నిర్మ‌ల్ ఎమ్మెల్యే అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మాత్రం చ‌రిత్ర‌ను తిరగరాశాడు. కేసీఆర్ తొలి కేబినెట్‌లో దేవాదాయ శాఖ మంత్రిగా ప‌నిచేసిన అల్లోల‌.. మ‌ళ్లీ ఎమ్మెల్యేగా గెలిచాడు. కేసీఆర్ రెండో కేబినెట్‌లో కూడా దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించి రికార్డు సృష్టించాడు. మరి కాంగ్రెస్ పార్టీ ఆయన్ని ఎలా ట్రీట్ చేస్తుందో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?