పుకార్లను నిజం చేస్తున్న పొరుగింటి పెద్దమనిషి!

ఆయన కాంగ్రెసు పార్టీతో తలపడినప్పుడు తల బొప్పి కట్టింది. మరీ దయనీయంగా ఓడిపోయారు. పైగా కాంగ్రెసు గెలిచింది. ఆ కడుపుమంట ఆయనకు పుష్కలంగా ఉన్నట్టుంది. ఇప్పుడు తగుదునమ్మా అంటూ తెలంగాణ ఎన్నికల్లో తలదూర్చి.. కాంగ్రెసు…

ఆయన కాంగ్రెసు పార్టీతో తలపడినప్పుడు తల బొప్పి కట్టింది. మరీ దయనీయంగా ఓడిపోయారు. పైగా కాంగ్రెసు గెలిచింది. ఆ కడుపుమంట ఆయనకు పుష్కలంగా ఉన్నట్టుంది. ఇప్పుడు తగుదునమ్మా అంటూ తెలంగాణ ఎన్నికల్లో తలదూర్చి.. కాంగ్రెసు హామీలను నమ్మవద్దని, వారికి ఓటు వేయవద్దని తెలంగాణ ప్రజలకు సలహా ఇస్తున్నారు. ఆ పొరుగింటి పెద్దమనిషి పేరు కుమారస్వామి. 

కర్ణాటక రాష్ట్రానికి గతంలో ఓసారి ముఖ్యమంత్రిగా వెలగబెట్టి.. కాలం ఖర్మం కలిసొచ్చి.. తనకు దక్కే సీట్ల మీద సంకీర్ణాలు ఏర్పడే పరిస్థితి వస్తే మళ్లీ ముఖ్యమంత్రి కాగలనని కాచుకుని ఉండే నాయకుడు.

జేడీఎస్ అగ్రనేత కుమారస్వామి.. తెలంగాణ ఎన్నికల్లో ప్రజలకు ఉచిత సలహా ఇస్తున్నారు. కాంగ్రెస్ ప్రజలను మభ్యపెడుతోందిట. కర్నాటకలో ఇచ్చిన హామీలు విఫలం అయ్యాయని, అక్కడ వారు మాట నిలబెట్టుకోలేకపోయారని కుమారస్వామి చెబుతున్నారు. ఆయన కడుపుమంటను అర్థం చేసుకోవచ్చు. 

గతంలో కన్నడనాట ఎన్నికలు జరిగినప్పుడు.. కాంగ్రెసు , బిజెపిలలో ఎవరికి కాసిని సీట్లు తక్కువ పడినా.. తమ పార్టీకి దక్కే సీట్ల ద్వారా సంకీర్ణంలోకి వచ్చి తాను సగం పదవీకాలం అయినా సీఎం కావచ్చునని ఆయన కలగన్నారు. కానీ.. కాంగ్రెస్ కు సొంతంగానే సంపూర్ణమైన మెజారిటీ వచ్చింది. ఆయన అవసరం ఎవ్వరికీ ఏర్పడలేదు. అలాంటి పరిస్థితుల్లో.. ఆ రాష్ట్రంలో తన మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్నది కాబట్టి.. ఆయన నెమ్మదిగా, బిజెపి పంచన చేరారు. ఎన్డీయేలో జేడీఎస్ భాగస్వామి పార్టీగా చేరిపోయింది.

ఆ హోదాలో ఆయన ఎంచక్కా ఇప్పుడు తెలంగాణ ఎన్నికల ప్రచార బరిలోకి వచ్చి బిజెపి అనుకూల ప్రచారం చేయడానికి అవకాశం ఉంది. నిజం చెప్పాలంటే బాధ్యత కూడా ఉంది. కానీ.. ఆ పని చేయడం లేదు. బెంగుళూరులో కూర్చుని కాంగ్రెసుకు ఓట్లు వేయవద్దని ప్రెస్ మీట్లు పెడుతూన్నారు. అలాగని బిజెపి అనుకూల వ్యాఖ్యలు కూడా చేయడంలేదు. పైపెచ్చు భారాసకు అనుకూలంగా మాట్లాడుతున్నారు. తెలంగాణలో రైతుబంధు విజయవంతంగా అమలవుతోందని కితాబులు ఇస్తున్నారు.

ఇదే కుమారస్వామి.. కేసీఆర్ ప్రాపకం సంపాదించి.. కన్నడ ఎన్నికల్లో ఆయన మద్దతు ‘అన్ని రకాలుగానూ’ పొందగలమని అనుకున్నారు. భారాసగా అవతరించిన సందర్భాల్లో ప్రతిసారీ హైదరాబాదు వచ్చి కేసీఆర్ కు  శాలువాలు కప్పారు. కానీ వారిద్దరి బంధం ఏర్పడక ముందే చెడింది. 

ఇప్పుడు బిజెపితో పొత్తుల్లో ఉన్న కుమారస్వామి.. తెలంగాణలో భారాసను కీర్తిస్తూ ప్రకటనలు చేయడం గమనిస్తే.. భారాస- బిజెపి కుమ్మక్కు లోపాయికారీ రాజకీయాలు నడుపుతున్నాయనే పుకార్లకు బలం చేకూరుతోంది. బిజెపికి వచ్చే సీట్లు కూడా చివరికి భారాసకు మద్దతు ఇవ్వడానికే ఉపయోగపడతాయనే అభిప్రాయం పలువురిలో కలుగుతోంది.