లోకేశ్ చుట్టూ రెడ్లు!

వైసీపీ పాల‌న‌లో అన్యాయానికి గురైన వారిలో తాము కూడా ఉన్నామ‌నే ఆవేద‌న‌లో రెడ్డి సామాజిక వ‌ర్గం వుంది. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత పార్టీలు, కులాలు, మ‌తాలు చూడ‌కుండా… వలంటీర్లు, స‌చివాల‌య ఉద్యోగుల ద్వారా…

వైసీపీ పాల‌న‌లో అన్యాయానికి గురైన వారిలో తాము కూడా ఉన్నామ‌నే ఆవేద‌న‌లో రెడ్డి సామాజిక వ‌ర్గం వుంది. జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత పార్టీలు, కులాలు, మ‌తాలు చూడ‌కుండా… వలంటీర్లు, స‌చివాల‌య ఉద్యోగుల ద్వారా సంక్షేమ ప‌థ‌కాల ల‌బ్ధిదారుల ఎంపిక‌తో పాటు నేరుగా ప్ర‌యోజ‌నం క‌లిగిస్తున్నారు. ముఖ్యంగా రాయ‌ల‌సీమ‌ల‌లో రెడ్డి సామాజిక వ‌ర్గం రాజ‌కీయంగా ఆధిప‌త్యం చెలాయిస్తోంది.

త‌మ సామాజిక వ‌ర్గానికి చెందిన వైఎస్ జ‌గ‌న్‌ను అధికారంలోకి తెచ్చుకుంటే… ఇక త‌మకు తిరుగులేద‌ని రెడ్లు ఆశించారు. జ‌గ‌న్‌ను అధికారంలోకి తెచ్చుకోవ‌డంలో రెడ్లు కీల‌క పాత్ర పోషించారు. కానీ తాము ఆశించిన‌ట్టు ప‌వ‌ర్ మాత్రం ద‌క్క‌లేద‌న్న‌ది వారి ఆవేద‌న‌. ముఖ్యంగా కాంట్రాక్టు బిల్లులు రాక‌పోవ‌డంతో వారంతా జ‌గ‌న్‌పై ర‌గిలిపోతున్నారు. జ‌గ‌న్‌పై రెడ్ల‌లోని ఆగ్ర‌హాన్ని సొమ్ము చేసుకునేందుకు టీడీపీ యువ‌నేత నారా లోకేశ్ వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతున్నారు.

యువ‌గ‌ళం పాద‌యాత్ర‌లో రెడ్ల‌తో ఆయ‌న త‌ర‌చూ స‌మావేశ‌మ‌వుతున్నారు. తాడిప‌త్రి త‌ర్వాత తాజాగా క‌డ‌ప‌లో ఆయ‌న రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన గ్రామ‌స్థాయి నేత‌ల‌తో స‌మావేశ‌మ‌య్యారు. జ‌గ‌న్ పాల‌న‌లో న‌ష్ట‌పోయిన రెడ్ల‌తో ఆయ‌న మాట్లాడించారు. అలాగే టీడీపీ పాల‌న‌లో రెడ్ల‌కు ఇచ్చిన ప్రాధాన్యాన్ని లోకేశ్ వివ‌రించ‌డం విశేషం. జ‌గ‌న్ పాల‌న‌లో రెడ్లు బాగుప‌డి వుంటార‌నుకున్నామ‌ని, పాద‌యాత్ర మొద‌లు పెట్టాకే ఎక్కువ‌గా నష్ట‌పోయింది రెడ్డేన‌ని తెలిసింద‌ని లోకేశ్ సానుభూతి వ్య‌క్తం చేసి, వారి ఆద‌ర‌ణ చూర‌గొనే ప్ర‌య‌త్నం చేశారు.

ఎన్టీఆర్‌ టీడీపీ స్థాపించినప్పటి నుంచీ రెడ్లకు సముచిత గౌరవం ఇచ్చామని లోకేశ్ గుర్తు చేశారు. 2014–19 పాలనలోకూడా పలువురు మంత్రులుగా, కార్పొరేషన్‌ చైర్మన్లుగా పనిచేశారన్నారు. తన వ్యక్తిగత సిబ్బందిలో కూడా రెడ్లు ఉన్నారన్నారు. వాస్తు సిద్ధాంతి జయరామిరెడ్డి త‌న పాద‌యాత్ర‌కు ముహూర్తం పెట్టారని లోకేశ్ చెప్ప‌డం విశేషం.

అలాగే లోకేశ్ పాద‌యాత్ర స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా మాజీ ఎమ్మెల్సీ దీప‌క్‌రెడ్డి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఎలాంటి లోపాలు లేకుండా పాద‌యాత్ర ముందుకు సాగుతున్న‌దంటే దీపక్‌రెడ్డి పాత్ర చాలా వుంది. అలాగే టీడీపీ జాతీయ అధికార ప్ర‌తినిధి జీవీరెడ్డి కూడా అప్పుడ‌ప్పుడు వ‌చ్చి పాద‌యాత్ర మంచీచెడుల‌ను గ‌మ‌నించి, పార్టీకి స‌మాచారం ఇస్తుంటారు. లోపాల‌ను స‌వ‌రించుకోవ‌డంలో జీవీరెడ్డి పాత్ర ఉంద‌ని టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. వీళ్లంద‌ర్నీ దృష్టిలో పెట్టుకునే నారా లోకేశ్ త‌న టీమ్‌లో రెడ్లు ఉన్నార‌ని చెప్ప‌డం. 

రాయ‌ల‌సీమ‌లో రానున్న ఎన్నిక‌ల్లో రెడ్ల‌కు స‌ముచిత స్థానం ఇవ్వాల‌ని టీడీపీ భావిస్తోంది. రెడ్ల‌తో శ‌త్రుత్వం చేసుకోవ‌డం ద్వారా జ‌గ‌న్‌కు ప్ర‌యోజ‌నం క‌లిగించిన‌ట్టు అవుతుంద‌నే ఉద్దేశంతో టీడీపీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంది.