తెలుగుదేశం యువరాజు లోకేష్ బాబు తన యువగళం పాదయాత్ర ప్రారంభించిన వెంటనే జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యవహారాలు ఆపేసి, సినిమాల్లో బిజీ అయిపోయారు. మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ హుంకరించిన ఆయన, తన వారాహి వాహనాన్ని షెడ్ లో వుంచేసారు. లోకేష్ యాత్ర కు పోటీగా కనిపించకూడదు, వుండకూడదు అనే పవన్ ఇన్నాళ్లూ ఊరుకుని, ఇప్పుడు సినిమాల మీద దృష్టి పెట్టారు అని అంతా అనుకున్నారు. అదే వినిపించింది కూడా.
లోకేష్ రాయలసీమలో యాత్ర ముగించుకుని దక్షిణ కోస్తా వైపు ప్రారంభించిన తరుణంలో పవన్ ఉన్నట్లుండి ఉభయ గోదావరి జిల్లాల యాత్ర మొదలుపెట్టారు. పవన్ ఏం మాట్లాడారు. వాటిల్లో లాజిక్ ఎంత వరకు వుంది.. అన్నది పక్కన పెడితే ఇప్పటి వరకు అన్నవరం నుంచి అమలాపురం వరకు యాత్రలు మాత్రం.. నో డౌట్ సూపర్ సక్సెస్ అయ్యాయి. విపరీతంగా జనాలు వచ్చారు. గతంలోనూ పవన్ సభలకు జనాలు బాగా వచ్చారు అని ఎవరైనా అనొచ్చు. కానీ దానికీ దీనికీ తేడా వుంది.
ఈసారి జనాల రావడమూ ఎక్కువే. హడావుడి అంతకన్నా ఎక్కువే. జెండాలు, కట్ అవుట్ లు, తోరణాలు ఒకటి కాదు, అన్ని విధాలా ఈసారి సినిమా హడావుడి అనే కన్నా రాజకీయ హడావుడి ఎక్కువ కనిపించింది. కచ్చితంగా ఇది గుర్తించతగిన మార్పు. అందులో సందేహం లేదు.
సరే, ఇప్పుడేంటీ? అంటే అసలు కథ ఇక్కడే వుంది. మరి కొన్ని రోజుల్లోనో, నెలల్లోనొ లోకేష్ బాబు కూడా ఇదే గోదావరి జిల్లాల్లో అడుగు పెడతారు. ఆయన కోనసీమలో తిరగాల్సి వుంటుంది.అప్పుడేంటి పరిస్థితి అన్నది చూడాలి. పవన్ కు వచ్చినంత మంది జనం ఆయన సభలకు కూడా కనిపించాలి.లేదంటే పవన్ చరిష్మా ముందు లోకేష్ ఇమేజ్ చిన్నదైపోతుంది.
లేదూ, ఏదో ఒకటి చేసి, జనాన్ని రప్పించారు అనుకుందాం. మరి జనసేనకు వచ్చిన జనమే కదా లోకేష్ కు కూడా రావాల్సింది. అంటే రెండు పార్టీల అభిమానులు ఒకటే అనుకుందామా? లేదు రేపు జగన్ వస్తే అప్పుడు కూడా ఇంత భారీగా జనం వచ్చారు అంటే, అప్పుడేం అనుకోవాలి? జనం రావడంతో సంబంధం లేదు. ఓట్ల లెక్క వేరు అనుకుందామా?
ఎవరు వచ్చినా జనం వస్తారు అనుకుంటే ఇక డిస్కషనే లేదు. ఈ పాదయాత్రలు, ఈ వారాహి యాత్రలు వృధా. ఎన్నికల పోల్ మేనేజ్ మెంట్, ఇతరత్రా వ్యవహారాలే గెలుపు ఓటములను నిర్ణయిస్తాయి.