టైటానిక్ తో పాటు టైటాన్ కూడా..!

టైటానిక్ నౌక శకలాల్ని చూసేందుకు వెళ్లిన టైటాన్ అనే జలాంతర్గామి కూడా అంతర్థానమైంది. టైటానిక్ మునిగిన ప్రదేశానికి 488 మీటర్ల దూరంలో టైటాన్ కూడా సముద్రగర్భంలో కలిసిపోయినట్టు అమెరికా కోస్ట్ గార్డ్ ప్రకటించింది. ఈ…

టైటానిక్ నౌక శకలాల్ని చూసేందుకు వెళ్లిన టైటాన్ అనే జలాంతర్గామి కూడా అంతర్థానమైంది. టైటానిక్ మునిగిన ప్రదేశానికి 488 మీటర్ల దూరంలో టైటాన్ కూడా సముద్రగర్భంలో కలిసిపోయినట్టు అమెరికా కోస్ట్ గార్డ్ ప్రకటించింది. ఈ విషాధంలో ఐదుగురు మృతి చెందారు.

అట్లాంటిక్ మహాసముద్రంలో 12వేల 5వందల అడుగుల లోతులో మునిగిపోయిన టైటానిక్ ఓడ శకలాల్ని చూసేందుకు ఓషన్ గేట్ సంస్థ ఏర్పాటైంది. దీనికి 3 జలాంతర్గాములున్నాయి. వీటిలో అత్యుత్తమమైనది టైటాన్ సబ్ మెరీన్. ఇప్పటికే ఎన్నో సముద్రగర్భ యాత్రలు పూర్తిచేసింది టైటాన్. అంతేకాదు.. సంస్థకు ఉన్న 3 సబ్ మెరీన్లలో అత్యంత ఎక్కువ లోతుకు వెళ్లగలిగే సామర్థ్యం కూడా దీనికే ఉంది.

అందుకే పాకిస్థాన్ బిలియనీర్ షెహజాదా దావూద్ దీన్ని ఎంపిక చేసుకున్నాడు. తనతో పాటు తన 19 ఏళ్ల కొడుకు సులేమాన్ ను కూడా తీసుకెళ్లాడు. వీళ్లతో పాటు బ్రిటిష్ వ్యాపారవేత్త హమీష్, ఫ్రెంచ్ మాజీ నావల్ ఆఫీసర్ పాల్ హెన్రీ కూడా ఉన్నారు. ఇక ఓషన్ గేట్ వ్యవస్థాపకుడు రష్ కూడా వీళ్లతో పాటు ఉన్నారు.

అలా ఈ ఐదుగురితో ఆదివారం రోజున న్యూ ఫౌండ్ ల్యాండ్ నుంచి సముద్రంలోకి దిగింది టైటాన్ మినీ-సబ్ మెరీన్. సముద్రంలో దిగిన గంటన్నర వరకు వీళ్ల ప్రయాణం సాఫీగానే సాగింది. అప్పటికే చాలా అడుక్కి చేరుకుంది. సరిగ్గా అప్పుడే టైటాన్ తో ఉపరితల నౌకకు కనెక్షన్ కట్ అయింది. ఆ తర్వాత టైటాన్ అదృశ్యమైంది.

టైటాన్ తో సంబంధాలు తెగిపోయే సరికి జలాంతర్గామిలో 96 గంటలకు సరిపడ ఆక్సిజన్ ఉంది. దీంతో అందులో ఉండేవాళ్లు బతికే అవకాశం ఉందని నౌకాదళం భావించింది. కానీ అధిక పీఢనం వల్ల టైటాన్ పేలిపోయి ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

3 రోజులు సుదీర్ఘంగా జల్లెడ పట్టిన తర్వాత టైటాన్ శకలాల్ని గుర్తించారు. ఇప్పటివరకు మృతదేహాల్ని కనుగొనలేకపోయినప్పటికీ, వాళ్లు మరణించినట్టు అమెరికా కోస్ట్ గార్డ్ ప్రకటించింది. అలా టైటానిక్ నౌక సమీపంలో టైటాన్ జలాంతర్గామి ప్రస్థానం ముగిసింది. మరో ఐదుగుర్ని బలితీసుకుంది.