టీడీపీ నేతకు బాహుబలి రేంజ్ బయోపిక్ కావాల్ట!

సాధారణంగా ప్రతి ఒక్కడూ తన జీవితం ఏ సినిమా కథ కంటె తక్కువ కాదని, తాను సినిమా స్టార్ కంటె తక్కువ కాదనే కాన్ఫిడెన్సులో జీవిస్తూ ఉంటారు. ఏదో ఒక రంగంలో కాస్త సెలబ్రిటీ…

సాధారణంగా ప్రతి ఒక్కడూ తన జీవితం ఏ సినిమా కథ కంటె తక్కువ కాదని, తాను సినిమా స్టార్ కంటె తక్కువ కాదనే కాన్ఫిడెన్సులో జీవిస్తూ ఉంటారు. ఏదో ఒక రంగంలో కాస్త సెలబ్రిటీ హోదా వచ్చిందంటే చాలు.. ఇక తన బయోపిక్ ఒకటి తెలుగుజాతికి అందించాల్సిన అవసరం ఉందని కూడా వారు ఉత్సాహపడుతుంటారు. వారి సెలబ్రిటీ హోదాలకు తోడు, కాస్త డబ్బు ఖర్చు పెట్టుకోగల తాహతు ఉంటే గనుక.. ఆ చిత్రాలు మనల్ని ముంచెత్తుతుంటాయి కూడా. 

ఇప్పుడు ఒక తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే, ఫ్యాక్షన్ లీడర్ గా ముద్ర ఉన్న నాయకుడు కూడా తన జీవితాన్ని బయోపిక్ గా తెలుగు ప్రజలకు అందించాలని సరదా పడుతున్నారు. ఇలాంటి కోరికలు ఉన్నప్పుడు సాధారణంగా.. వారు ఎన్నికల్లోమైలేజీ కోసం ఎన్నికలకంటె ముందు తమ గురించి సినిమా రావాలని కోరుకుంటారని మనం అనుకుంటాం. 

కానీ ఈ లీడర్ కాస్త వెరైటీ.. తన జీవితంమీద బయోపిక్ ఎన్నికలకు ముందు కాదు, ఎన్నికల తర్వాతనే భారీస్థాయిలో ఒక బాహుబలి రేంజిలో రావాల్సిన అవసరం ఉన్నదని అంటున్నారు. ఇలాంటి ఆశ పడుతున్న సదరు తెదేపా నేత మరెవ్వరో కాదు. గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు! హైదరాబాదులో ఓచిత్రం ప్రీరిలీజ్ వేడుకకు గెస్టుగా వచ్చిన ఆయన ఈ కోరికను వ్యక్తం చేశారు.

‘నటరత్నాలు’ అనే చిన్న సినిమా ఒకటి శివనాగు దర్శకత్వంలో రూపొందింది. సినిమా ఇండస్ట్రీ కష్టనష్టాలు కథాంశంగా సాగిపోయే సినిమా ఇది. ఈ సినిమా ప్రీరిలీజ్ హైదరాబాదులో జరిగింది. దీనిక యరపతినేని శ్రీనివాసరావు, పెద్దస్థాయి గ్యాంబ్లింగ్ తదితర అరాచక వ్యవహారాల నిర్వాహకుడిగా తన చుట్టూ అనేక వివాదాలు ముసురుకుని ఉండే చికోటి ప్రవీణ్ ముఖ్య అతిథులు.

యరపతినేని మాట్లాడుతూ.. తన సినిమా ఆసక్తుల గురించి వివరించారు. తాను నాలుగైదు ప్రీరిలీజ్ వేడుకలకు వెళ్లానని అంటూ.. తొలిసారి ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా ఆడియో ఫంక్షన్ కు వెళ్లానని కానీ అది తనకు నచ్చలేదని అన్నారు. 

తనకు సమరసింహారెడ్డి, వీరసింహారెడ్డి, నరసింహనాయుడు, మిర్చి వంటి చిత్రాలు నచ్చుతాయని అన్నారు. ఎందుకంటే అవి సినిమాలుగా కనిపిస్తాయి గానీ.. తమ జీవితాలు ఆ సినిమాలలాగా ఉండే వాస్తవ కథలు అని ఆయన చెప్పుకొచ్చారు. ఆ రకంగా తనది ఫ్యాక్షన్ నేపథ్యమే అని చెప్పుకున్నారు. 

తన జీవిత కథాంశంగా ఎన్నికల్లోగా సినిమా చేయాలని ఉన్నట్టు దర్శకుడు శివనాగు చెప్పారని, కానీ తన జీవితం ఎన్నికలకంటె ముందుకాదు.. ఎన్నికల తర్వాత రావాల్సిన బయోపిక్ అని యరపతినేని అన్నారు. ఆ చిత్రం ఒక సమరసింహారెడ్డి, ఒక నరసింహనాయుడు, ఒక బాహుబలి రేంజిలో ఉండాలన్నారు. బడ్జెట్ గురించి మాత్రమే కాకుండా.. అలాంటి ఎమోషన్స్ తో ఉండాలన్నారు.

కాస్త ఫాక్షన్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ప్రతి ఒక్కడూ ఎవడికి వాడు సమరసింహారెడ్డి లాగా ఫీలైపోవడం కూడా ఒక ఫ్యాషన్ అయిపోయింది. మరి మన యరపతినేని గారి ఫాక్షన్ ఎమోషనల్ మూవీకోసం ప్రేక్షకులు వేచిచూస్తూ ఉండాలేమో!