మీలో పాపం చేయని వారు…?

మీలో పాపం చేయని వారే ముందుగా రాయి వేయాలి అంటూ వెనకటికి ఓ మంచి కథ వుంది. గోరంట్ల మాధవ్ వ్యవహారం చూస్తుంటే ఈ కథ గుర్తుకు వస్తోంది. మొరాలిటీ వేరు. నిబంధనలు వేరు.…

మీలో పాపం చేయని వారే ముందుగా రాయి వేయాలి అంటూ వెనకటికి ఓ మంచి కథ వుంది. గోరంట్ల మాధవ్ వ్యవహారం చూస్తుంటే ఈ కథ గుర్తుకు వస్తోంది. మొరాలిటీ వేరు. నిబంధనలు వేరు. ప్రతి వ్యక్తి ఇలా వుండాలి అన్నవి నిబంధనలు. ఇలా వుండాలి అనుకోవడం నైతికత. 

గోరంట్ల మాధవ్ చేసిన పనిని ఎవరూ సమర్థించరు. అందులో సందేహం లేదు. సెక్స్ లో అనైతిక ప్రవర్తన, పెర్వర్డెడ్ నెస్ అన్నవి ఈ తరంలోని కొందరిలో అయినా పెరిగిపోతున్నాయి. డబ్బులకు వాట్సాప్ లో న్యూడ్ కాల్స్ అన్నవి పట్టణాల్లో పెరుగుతున్న జాఢ్యం. నేను పేకాడతాను…జూదశాలకు వెళ్తాను అంటూ ఓపెన్ గా ప్రకటించారు ఓ పార్లమెంట్ సభ్యుడు. అది తప్పా? కాదా? అన్న విచక్షణ అతని వరకే. జూదశాలలో అదే ఎంపీ వుండగా విడియో తీసి వదిలారు అనుకుందాం. ఎంపీ జూదం ఆడడం ఏమిటి అనే డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. నేనే వెళ్తాను అని చెప్పిన తరువాత ఇక కేసే లేదు.

గోరంట్ల మాధవ్ ఎవరితోనో నగ్నంగా చాట్ చేసారు. అతనికి సంబంధించినంత వరకు అది అతని వ్యక్తగతం. అతనికి సమాజంలో ఏ హోదా లేకుంటే అసలు డిస్కషన్ నే లేదు. శ్రీశ్రీ చెప్పినట్లు పబ్లిక్ లో వున్నాడు కనుక ఏమైనా అనొచ్చు..అంటున్నారు కూడా. మాధవ్ తనను బలవంత పెట్టి న్యూడ్ కాల్ మాట్లాడించారు అని ఎవరైనా ఫిర్యాదు చేసి వుంటే అది వేరే సంగతి. అలాంటిది లేదు. ఎంపీ కాబట్టి ఇలా చేయడం తప్పు అని అందరూ సుద్దులు చెబుతున్నారు. మరో అంశం లేనట్లు ఏకంగా ఎడిటోరియల్స్ నే వండి వారుస్తున్నారు.

ఇలా ఎడిటోరియల్ రాసిన ఓ పెద్దాయిన గతంలో జర్నలిస్ట్ గా వుండగానే ఓ బార్ నిర్వహణలో భాగస్వామిగా వున్నారు. జర్నలిస్ట్ ఏమిటి? బార్ నిర్వహణ ఏమిటి అని ఎవ్వరూ అడగలేదు. కానీ ఆయనే జర్నలిస్ట్ నుంచి యజమానిగా మారినపుడు నైతికత పరంగా సరైనది కాదు అని ఆ భాగస్వామ్యం నుంచి తప్పుకున్నారు.

ముఖ్యమంత్రిగా వుంటూ సినిమాల్లో నటించడం ఏమిటి? అది నైతికత కాదు అని కొందరు అన్నారు. నేను నటిస్తా, నా ఇష్టం అన్నారు ఎన్టీఆర్. అది ఆయన ఇష్టం..ఆయన నైతికత.

జన జీవనంలో సెక్స్, కోరికలు, అక్రమ సంబంధాలు, వాడుకోవడాలు అన్నవి ఇవ్వాళ ఎంత కామన్ అయిందో రాజకీయాల్లో కూడా అదే పరిస్థితి వుంది. అయితే బయటకు వస్తే రభస. లేదంటే లేదు. కానీ ఇన్ సైడ్ వర్గాల్లో ఇవే కథలు కథలుగా చెప్పుకుంటారు. బయటకు వస్తేనే నైతికత ప్రశ్న ఉదయిస్తుంది లేదంటే లేదు.

రాజకీయాల్లో వుంటూ ప్రజాధనం దోచుకోవచ్చు..హత్యలను ప్రోత్సహించవచ్చు. ఓట్లు కొనవచ్చు. స్కామ్ లు చేయవచ్చు. కానీ రంకు పనులు మాత్రం చేయకూడదు. ఎందుకంటే అది నైతికత కాదు.

ఇద్దరు భార్యలు వుండడం లీగల్ కాదు. నైతికత అంతకన్నా కాదు. కానీ అనఫీషియల్ గా రెండో భార్య వుండి కూడా ఎంపీలుగా చలామణీ అయిన వారు లేరా?

అటవీ ప్రాణులను ఇంట్లో పెంచడం నేరం. గతంలో ఓ మంత్రి అలా చేసి, దానిని ఆసుపత్రికి తీసుకెళ్లి నాన రభస అయింది. ఇక్కడ నైతికత ఏమయింది?

ఓ మంత్రి తాను విమానంలోకి లైటర్, సిగరెట్లు తీసుకెళ్తా అని అన్నారు. అక్కడ నైతికత ఏమయింది.

అంటే కేవలం సెక్స్ సంబంధించి వ్యవహారాలు అయితేనే నైతికత అనుకోవాలా? మరేదీ నైతికత కిందకు రాదా?

ఇదంతా గోరంట్ల మాధవ్ చేసిన దాన్ని వెనకేసుకురావడం కోసం కాదు. అతని నైతికతను అతనికే వదిలేయకుండా దేశద్రోహం అన్నంత యాగీ చేస్తున్న మీడియా నైతికత గురించి ఆలోచనతోనే…